- రాష్ట్రంలో టార్గెట్ 14 లక్ష్యం సాధ్యమేనా..
- రిజర్వేషన్ల రద్దు అస్త్రంతో కాంగ్రెస్…వీడియో మార్ఫింగ్ అస్త్రంతో బీజేపీ
- వలసవాదులకే టికెట్ల కేటాయింపుతో పార్టీ నేతల్లో అసంతృప్తి
సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా పది రోజుల వ్యవధి ఉండడంతో రాజకీయ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. వోటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు అనేక ఎత్తుగడలు వేస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఒట్లు, రాజీనామాస్త్రాలతో రాష్ట్రం అట్టుడికి పోతున్నది. దేశ వ్యాప్తంగా ఏడు విడుతలుగా జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు ఇప్పటికే రెండు విడుతలు పూర్తి చేసుకోగా, మూడవ విడుత పోలింగ్ ఈ నెల 7న, నాలుగవ విడుతలో భాగంగా తెలంగాణలో ఈనెల 13న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పై చెయ్యి సాధించేందుకు ముఖ్యంగా మూడు పార్టీలు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకుంటే, బిఆర్ఎస్ పది నుంచి పన్నెండు స్థానాలను ఎట్టి పరిస్థితిలో గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇక బిజెపి కూడా కనీసం 12 స్థానాలను గెలుకుని తీరాల్సిందేనన్న లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్ కోరిక ఎలాగూ తీరింది. దక్షిణాదిలో తమ పార్టీని బలోపేతం చేయాలంటే తెలంగా ణపై కాషాయ జండాను ఎగురవేయాలన్న బిజేపీ ఆశయం మాత్రం నెరవేరకుండాపోయింది. దీంతో మరో పదిరోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నిక ల్లోనైనా తమ బలాన్ని నిరూపించుకోవాలని కాషా య పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా కేంద్ర, రాష్ట్రంలోని స్టార్ క్యాపెయిన్లనందరినీ రంగంలోకి దింపుతున్నది.
ఎవరెంత ప్రచారం చేసినా మోదీ చరిష్మానే తమను గెలిపిస్తుందన్న నమ్మకంగానే అభ్యర్థులున్నారు. మోదీ గ్యారంటీలే తమను గెలిపిస్తాయని వారు అభిప్రాయపడు తున్నారు. అభ్యర్థులంతా తామింతవరకు ప్రజాసేవలో ఏమేరకు తరించామని చెప్పుకోవడంకన్నా మోదీ నామస్మరణతోనే ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అయిన కిషన్‌రెడ్డి కూడా మోదీ పేరుచెప్పే వోట్లు అడుగటం గమనార్హం. మోదీ మూడవసారి అధికారంలోకి వొస్తే అంతా శుభమే జరుగుతుందన్నదే ప్రచారంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. పెద్దనోట్ల రద్దు, నల్లధనం, కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాఖ్ రద్దు, జన్‌ధన్ యోజన లాంటి నినాదాలకు భిన్నంగా దశాబ్దాలుగా ఎవరూ చేయలేకపోయిన ఆయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట, ఆత్మనిర్భర్ భారత్, అమృత్కాల్ లాంటి నినాదాలకే ఆ పార్టీ ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నది. అవే మోదీ తద్వారా ఆ పార్టీ గెలుపుకు కారణమవుతాయన్న భావన ఉంది. అయితే ఈ విషయాలే ఆయనకు ప్రశ్నలుగా ఎదురవుతున్నాయి. 2014 ఎన్నికల సందర్భంగా విదేశాల్లోని నల్లధనాన్ని స్వదేశానికి తరలించి దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని విపక్షాలు నిలదీస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు సరికదా, వివిధ సందర్భాల్లో తెలంగాణలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీల సంగతేంటంటున్నాయి ఆ పక్షాలు.
దీనికితోడు తాజాగా రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న చర్చ ఒక విధంగా ఆ పార్టీని డిఫెన్స్‌లో పడేసింది. ఈసారి కేంద్రంలో అధికారంలోకి వొస్తే రాజ్యాంగాన్ని తద్వారా రిజర్వేషన్లను లేకుండా చేస్తుందని కాంగ్రెస్, బిఆర్ఎస్, వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడానికి ఆ పార్టీలు తీవ్ర ప్రయత్నంచేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణలో పర్యటించిన నేపథ్యంలో ఆయన చేసిన ప్రసంగం మార్ఫింగ్ జరిగిందన్న గొడవ ఇప్పుడు తెలంగాణలోనే గాక, దేశంలోనే హాట్ టాపిక్‌గా మారింది. రాజ్యాంగ విరుద్ధంగా కేటాయించిన ముస్లిమ్ రిజర్వేషన్లను ఎత్తివేస్తామన్న మాటను మార్ఫింగ్ చేసి, మొత్తం రిజర్వేషన్లనే ఎత్తివేస్తారన్నట్లుగా వీడియోలు వైరల్ కావడాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అనుమానించిన కొందరిని అరెస్టు చేయగా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంటి వారికి నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. బిజెపి తెలంగాణలో ఎక్కువ స్థానాలను తెచ్చుకోలేమన్న ఉద్దేశ్యంగానే ఆ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నదని రేవంత్‌రెడ్డి విమర్శిస్తున్నారు. కాగా బిజెపి ఎన్ని స్థానాలను గెలుచుకుంటుందన్న దానిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవున్నాయి. బిఆర్ఎస్ నేతలైతే బిజెపికి రెండు సీట్లు కూడా రావని కరాఖండీగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆ పార్టీ నుండి తెలంగాణలో పోటీలో నిలబడ్డ అభ్యర్థుల్లో ఎక్కువ శాతం ఇతర పార్టీల నుండి వచ్చిన వారు కావడం కూడా అందుకు ఒక కారణంగా చెబుతున్నారు.
రాష్ట్రంలోని 17 ఎంపి స్థానాల్లో దాదాపు పది స్థానాల్లో ఇతర పార్టీల నుండి వొచ్చినవారికే ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది. వీరిలో తాజాగా బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నుండి ఆ పార్టీలోకి వెళ్ళిన వారు కాగా, 2019 నుండి కాంగ్రెస్, బిఆర్ఎస్ నుండి వెళ్ళి ఆ పార్టీ వారుగా చెలామణి అవుతున్న వారుండడం గమనార్హం. దీంతో ఏళ్ళ నుండి పార్టీ జండా మోసిన వారిలో కొంత నిరుత్సాహం ఏర్పడడం అభ్యర్థుల గెలుపుపైన ప్రభావాన్ని చూపేదిగా ఉందంటున్నారు. వీరందరికి ఇప్పుడు మోదీ చరిష్మానే దిక్కు. అందుకే ఆయన ప్రచార సభలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ తీరును, నేటి కాంగ్రెస్ వైఖరిపై ఘాటుగా స్పందిస్తున్నారు. అంతేకాదు గత శాసనసభ ఎన్నికల్లో లిక్కర్ కుంభకోణాన్ని విస్తృతంగా ప్రజల ముందుకు తీసుకువచ్చినట్లు, ఈ ఎన్నికల్లో మార్ఫింగ్ అంశాన్ని బూచీగా చూపించి కాంగ్రెస్‌కు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నదని వామపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. తెలంగాణలో ఒంటరి పోరు చేస్తున్న బిజెపీ గత పార్లమెంటు ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అలాగే గత శాసనసభ ఎన్నికల్లో మొత్తం మీద 14 శాతం వోట్లను మాత్రం సాధించుకుంది. ఈ ఎన్నికల్లో వీలైనంత వరకు 17 స్థానాలను గెలుచుకోవాలనుకుంటుంది. అమేరకు ప్రధాని మోదీ కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలైప్పటి నుండి ఆదిలాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిల్లో పర్యటించగా, ఈ నెల 8న కరీంనగర్, 10న హైదరాబాద్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కుంటున్న పరిస్థితిలో మోదీ చరిష్మా ఈసారి ఏమేరకు పనిచేస్తుందో చూడాలి.
-మండువ రవీందర్రావు
సీనియర్ జర్నలిస్ట్





