మానవత్వం కోసం అన్వేషణ…

ఒక్కరోజుతోనే ముగిసిపోయే /  ఊరి జాతరలా ఎన్నికల పండగ… రాజకీయ గొంగట్లో/  విశీర్ణమౌతున్న విలువల గొంతుకలు/ ఎంత గుక్కపట్టి ఏడ్చినా /  రెక్కలు విదుల్చుకోలేక కునారిల్లుతున్నాయి అని వర్తమాన రాజకీయాల విచిత్రాలను ఓట్ల సంత కవితలో  డా.ఎన్‌. ఈశ్వరరెడ్డి విశ్లేషించారు. నాకొక మనిషి కావాలి అన్న శీర్షికన 43 కవితలతో ఆయన కవితా సంపుటి వెలువడింది. ఆర్తిని కలబోసిన  ఆర్ద్రత నిండిన గొంతుగా ఎన్నో కవితా వాక్యాలలో కవి స్పష్టంగా కన్పిస్తారు. ఈ కవి కవిత్వాన్ని  ఒక ప్రాణ జలం అని నిర్వచించారు. కవిత్వమొక రక్త చైతన్యమని, కర్తవ్య జన్యమని చెబుతూ కవిత్వ పుప్పొడి పరుచుకున్న చోట/  మనుషులు వేగు చుక్కల్లా ఉంటారని  చెప్పారు. కవిత్వం ఒక గొప్ప మహాత్యమని, తన జీవితాన్ని మార్చిన నవనీతమని అభివర్ణించారు.
ఎన్నికల సంతలో కరెన్సీ కుప్పలు,  గాలి వాగ్దానాలు, కరపత్ర  హామీలతో ప్రజాస్వామ్యం నవ్వుల పాలైందని వేదన చెందారు. అర్థ బలం, అంగ బలమే నాయకీయం అయ్యాక తమ బతుకులు ఇచ్చేయక తప్పని ధైన్యం ప్రజలకు ఏర్పడిందని అన్నారు.  పచ్చటి పొలాలను/  కార్పొరేట్‌ ‌గద్దలకిచ్చి/  చీలిపోయిన రైతుగుండెల్ని/   చివికిపోయిన పరిహార పోగులతో/  కలిపికుడుతున్నాం అని చెప్పారు.  ఎన్నికల కాలం ముంచుకొస్తోంది/  చెవులు ఖాళీగానే ఉన్నాయి/  కొంగొత్త హామీల కాలీఫ్లవర్లు పెడతారు జాగ్రత్త అని ప్రజలను హెచ్చరించారు. మత దివాంధాలను కూల్చకుంటే మరో మానవరహిత  గ్రహంగా భూగోళం మారే ప్రమాదముందని తెలిపారు.

నిర్మలంగా ప్రవహించే మంచి మనిషి తనకు కావాలని కవి ప్రగాఢంగా కోరుకున్నారు. మానుషత్వం పూయించగల మనిషి కావాలన్నారు. పిడికెడు చినుకుల కోసం, దోసెడు ప్రాణజలం కోసం రైతన్న ఆర్తిని తీర్చిపొమ్మని జీవనది కృష్ణవేణిని ప్రార్థించారు. ప్రేమంటే నమ్మకమనే సౌధానికి పునాది రాయి, జీవితానికి వెలుగు దారి చూపించే సూర్య దీపమన్నారు. పల్లె పండుగ కవితలో పండగ రోజుల్లొస్తే/  అమ్మలంతా నిర్విరామ/  శ్రామిక యంత్రాలుగా మారిపోతారని చెప్పారు. పల్లెల్లోని పండుగలను, సంస్కృతి వైభవాన్ని మానవ సంబంధాలను చెప్పి  కాలక్రమేణా వచ్చి చేరిన వైపరీత్యాలతో పల్లె బలిపీఠమెక్కిందని వేదన పడ్డారు. నా ఊరును నాకు కాకుండా చేశారని అక్షరమై కన్నీరొదిలారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఓటును సద్వినియోగం చేయమన్నారు. వ్యత్యాసాలు తొలగి సమత్వం వెల్లివిరియాలని కోరుకు న్నారు. క్రమశిక్షణ గల సైనికుడి లాంటి ప్రాణత్యాగికి ఓటేయమన్నారు.

శ్రమ విలువను/  పచ్చ నోటు కింద పాతేసిన/  నవనాగరికులంతా ఆనందమే అని వాపోయారు. చెప్పుకోలేని ఆవేదన లోపల లావాలా మరుగుతుంటే రైతన్న రహస్య చావును వెతుక్కుంటున్నాడని చెప్పారు. గింజల్ని పండించే రైతు కష్టాన్ని నిఖార్సుగా కొలవాలని అన్నారు. సీమ గర్భంలో దొరికే ఇనుప మట్టితో నైనా బతకనివ్వండి అంటూనే ఉక్కు రాయలసీమ యువతకు ఎలా హక్కో వివరించారు. ఖాళీజేబుల్తో గుణపాఠం నేర్వనివాళ్ళు/   నిండుజేబుల్తో శ్రమను ఛీత్కరించేవాళ్ళు/  ఈ భూమికి ఎప్పటికీ భారమే అని అన్నారు. విశ్వమంతా క్షోభం… లక్షల క్యూసెక్కుల కన్నీళ్ళు/   కోట్ల గుండెల దీనాలాపనలు అని వేదన పడ్డారు. తెలుగు సూర్యుడు బ్రౌన్కు ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు పరిశోధనా నావికులకు దారి చూపిస్తూ గ్రంథాలయ దీప స్తంభాన్ని నిలబెట్టిన అక్షరమిత్రుడిగా జానమద్దిని అభివర్ణించారు. ఫ్లెమ్మింగ్‌ ‌పక్షులను ఉద్దేశించి నీటి వేదికపై మీరు వయ్యారంగా నడుస్తుంటే/ ప్రపంచ సుందరీమణులు క్యాట్వాక్కు వచ్చిన ట్టుంది అని చెప్పారు. ఎల్లలు దాటిన ప్రేమైక పక్షి ఫ్లెమ్మింగో నుండి జీవిత పాఠం చదువుకోవాలన్నారు.
నా ఎద్దుల బండి ఏమైంది అన్న కవితలో రాత్రిళ్ళ  ప్రయాణాలకు/  ముక్కిన కింద వేలాడే లాంతరు/  చీకటిని చిమ్మేసి/  దారి నిండా వెలుతురు వస్త్రం పరిచేది అన్నారు.

ఎన్నికల పరీక్షలు ఎదురవగానే నాయకులు ఓటర్లను దేవుళ్లుగా మార్చేసి హామీల మొక్కులు, వినయాల దీక్షలతో  ఉక్కిరి బిక్కిరి చేస్తారని అంటూ మనిషి కోసం నిలబడే  నాయకుని ఎన్నికే ముఖ్యమని చెప్పారు. కాస్టింగ్‌ ‌కౌచ్‌ ‌కవిత సమాజంలో స్త్రీల  వేదనను వెల్లడించింది. అకృత్యాల బాటన పట్టిన వారు మనుషులుగా చచ్చి రూపాయల కాష్టంపై కాలనీ శవాల్లా అఘోరిస్తుంటారని చెప్పారు. క్యాన్సర్‌ ‌రాకాసిని తరిమి కొట్టే ఆధునిక వైద్య ధన్వంతరి పుట్టాలని అన్నారు. ఉగ్రమూకలు మానవతకు పట్టిన చెదపురుగులని చెప్పారు. విష రసాయనాల జలస్మశానాలలో అస్తికల వేట కొనసాగుతున్నదని వేదన చెందారు. మనిషిలోని అహంకారం, స్వార్థాలను భోగి మంటల్లో తగలేయ మన్నారు. మా సీమ కూడా దేశంలో భాగమే కనుక ఆ దేహాన్ని తడిపే దయార్ద్ర చట్టం ఒకటి తీసుకురమ్మని అభ్యర్థించారు. ఎండతోనే బతుకాటలో మగ్గిపోయే జనాలను గురించి తలపోశారు. కుహనా మేధస్సు మిగిల్చే నష్టాలను వెల్లడించారు. కొనడం అమ్మడమే రాజకీయమైన సమాజంలో  కొత్త దైవాంశ సంభూతుల కోసం అన్వేషణ సాగుతున్నదని చెప్పారు. మనిషిగా మారకపోతే గడ్డ కట్టిన నరకంలా ఒంటరిగా మిగిలిపోతారని అన్నారు.

నాలుగు మాటలు నేర్చిన నంగనాచులంతా జీవితాన్ని వెక్కిరించే వారే అని   ఆగ్రహించారు. ఎడారి దుఃఖం కవిత గుండె తెగిన విషాదాన్ని  చెప్పింది. పరాయీకరణ, వస్తు వ్యామోహంలో కొట్టుకుపోయి ఒట్టి మనుషులుగా  మిగిలిపోతున్నామని చెప్పారు. చిల్లులు పడ్డ మనసు కుండ ధైర్యాన్ని పారబోసుకొని ఒట్టి మట్టి పెంకులా మిగిలిందని అన్నారు. ప్రేమ జీవ ప్రవాహమైన అమ్మ  కళ్లల్లో దాగి ఉన్న కన్నీటి సాగరం అప్పుడప్పుడు ఉప్పెనవుతుందని చెప్పారు. దురాశను, స్వార్థాన్నిజయిస్తే మనశ్శాంతితో పాటు సంతోషం దక్కుతుందని చెప్పారు. దిగులుపడకు నేస్తమా అని చెబుతూ అనుభవ పాఠాలు కొత్తదారిని చూపిస్తాయని, ప్రతి బాధకు ఒక జ్ఞాన సందేశం దొరుకుతుందని చెప్పారు. సామాజిక స్పర్శ తో అణువణువునా ఎన్నో ఆలోచనాత్మక అంశాలను అక్షరీకరించడంలో కవి చూపిన శ్రద్ధ ఎంతో  స్పష్టంగా కన్పిస్తుంది. నాకొక మనిషి కావాలి అని సమాజానికి ప్రకటన జారీ చేసిన కవి లక్ష్యం మానవతను కాపాడడమే.
– డా. తిరునగరి శ్రీనివాస్‌
                                     8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *