- అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
- సిఎస్ శాంతి కుమారి అత్యవసర సమావేశం…
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 20 : రానున్న 48 గంటలలో రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో భారీ వర్ష సూచన ఉందని అదేవిధంగా దక్షిణ తెలంగాణా జిలాల్లో ఒక మోస్తరు వర్షం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు గురువారం డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ…అత్యవసర పరిస్థితుల్లో, సహాయపడేందుకు వీలుగా వరంగల్, ములుగు, కొత్తగూడెం లలో ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలను ఉంచామని, అదేవిధంగా హైదరాబాద్ లోనూ 40 మంది బృందం గల ఒక బృందం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏవిధమైన నష్టం వాటిల్లలేదని, ముఖ్యంగా రాష్ట్రంలో చెరువులు, కుంటలకు నష్టం వాటిల్లలేదని, గ్రామీణ ప్రాంతాలలో రహదారుల పరిస్థితి కూడా మెరుగ్గానే ఉందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులలోనూ 50 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నందున భారీ వరద వొచ్చినా ఇబ్బందులు లేవని అన్నారు. అయినప్పటికీ, అన్ని రిజర్వాయర్లు, చెరువుల వద్ద తగు ముందు జాగ్రత్త చర్యలను చేపట్టినట్టు ఆమె తెలియచేశారు. భద్రాచలం వద్ద గోదావరి 41.3 అడుగుల మేర ప్రవహిస్తుందని, గురువారం రాత్రికి ఒకటో ప్రమాద సూచీ జారీ అయ్యే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న ఈ వర్షాలు వ్యవసాయానికి అత్యంత అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఏ విధమైన అతిసార వ్యాధి, ఇతర అంటూ వ్యాధుల వ్యాప్తి లేదని, అయినప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా, ప్రతీ గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీల్లోని మంచినీటి ట్యాంకులలో విస్తృత స్థాయిలో క్లోరినేషన్ చేపట్టామని వివరించారు. రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వరద పరిస్థితిపై సంబంధిత ఛీఫ్ ఇంజనీర్‌తో సిఎస్ సమీక్షించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో 426 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను, 157 స్టాటిక్ టీమ్‌లను ఏర్పాటు చేయడంతోపాటు నగరంలో ఉన్న 339 నీటి నిల్వ(వాటర్ లాగింగ్ పాయింట్స్) ఉండే ప్రాంతాలపై ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని జీహెచ్‌ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. నగరంలోని 185 చెరువులు, కుంటలలో నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అధర్ సిన్హా, రజత్ కుమార్, సునీల్ శర్మ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, సింగరేణి సిఎండి శ్రీధర్, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ శాఖ డీజీ నాగిరెడ్డి, జీఎడి కార్యదర్శి శేషాద్రి, జీహెచ్‌ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, ఈఎన్‌సి, గణపతి రెడ్డిలతోపాటు ట్రాన్స్‌కో, నీటిపారుదల, పంచాయితీ రాజ్, రోడ్లు భవనాల శాఖల ఈఎన్‌సీ లు పాల్గొన్నారు.




