Take a fresh look at your lifestyle.

గజ్వేల్‌ ‌నుంచే కేసీఆర్‌ ‌పోటీ

  • త్వరలో ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో స్పెషల్‌ ‌లంచ్‌ ‌మీటింగ్‌
  • అదే వేదిక ద్వారా పోటీపై క్లారిటీ
  • పుకార్లకు ఫుల్‌స్టాప్‌ ‌పెట్టనున్న గులాబీ దళపతి

ఎ.సత్యనారాయణరెడ్డి, ప్రజాతంత్ర ప్రతినిధి
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : మరి కొద్ది నెలల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ రేస్‌ ‌గుర్రాలపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌గడ్డపై నుంచి ఈసారి ఎన్నికల బరిలో నిలిచేదెవరూ అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు…వ్యూహాలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచే, గెలిచే వారి జాబితాను కూడా రె‘ఢీ’ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే…ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిన పార్టీలన్నీ ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గజ్వేల్‌ ‌సీటు ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం ఇక్కడి నుంచి ప్రస్తుతం సిఎం కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తుండటం.

అయితే, ఈసారి అక్కడ్నుంచి ఎవరు బరిలో ఉంటారు..? గతంలో మాదిరిగానే గులాబీ బాస్‌ ‌బరిలో ఉంటే…ప్రత్యర్థిగా ఎవర్ని దించాలి..? కేసీఆర్‌ ‌టార్గెట్‌గా కీలక నేతలు బరిలోకి దిగుతారా..? అదే జరిగితే పరిస్థితేంటన్న చర్చ మొదలైంది. ఓ వైపు కేసీఆర్‌పై ఎవరిని పోటీకి దింపాలని ఆలోచన చేస్తూనే…మరోవైపు రానున్న ఎన్నికలో సిఎం కేసీఆర్‌ ‌ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌నుంచి పోటీ చేయరంటూ ప్రధానంగా కాంగ్రెస్‌ ‌పార్టీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి కొత్త పల్లవిని ఎత్తుకున్నాడు. కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ‌నుండి కాకుండా, రానున్న ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు కొత్త ప్రచారానికి తెరలేపారు. మీడియాలో కూడా వార్తలొస్తున్నాయి.

అయితే, దుష్ప్రచారాలను, పుకార్లను బిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులు కొట్టివేస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ క్యాడర్‌ను, ప్రజలను కన్ఫ్యూజన్‌ ‌చేసేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు మైండ్‌గేమ్‌ను మొదలుపెట్టారనీ, ఈ ప్రచారాన్ని పట్టించుకోవల్సిన అవసరం లేదనీ బిఆర్‌ఎస్‌కు చెందిన సీనియర్‌ ‌నాయకుడు, సిఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ నేత గురువారమిక్కడ ‘ప్రజాతంత్ర’తో మాట్లాడుతూ చెప్పారు. వొచ్చే ఎన్నికల్లోనూ కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ‌నుండే పోటీలో ఉంటారనీ, ఈ విషయంలో పార్టీ శ్రేణులు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దంటున్నారు.  కేసీఆర్‌ ‌పోటీపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి, పార్టీ క్యాడర్‌ అయోమయానికి గురి కాకుండా ఉండేందుకు   సిఎం కేసీఆరే త్వరలోనే  క్లారిటీ ఇస్తారనీ, అప్పటి వరకు ఎలాంటి పుకార్లను నమ్మొద్దన్నారు.

గతంలో  ఆలేరు అంటూ…ఇప్పుడు కామారెడ్డి అంటూ  ప్రచారం…
సిఎం కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ‌నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విధితమే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడ్నుంచి పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టిడిపి పార్టీ తరపున బరిలో ఉన్న వంటేరు ప్రతాప్‌రెడ్డి రెండో ప్లేస్‌లో నిలిచారు.  కాంగ్రెస్‌ ‌నుంచి ఉన్న తూంకుంట నర్సారెడ్డి మూడో ప్లేస్‌లో నిలిచారు. అనంతరం వంటేరు ప్రతాప్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. మహాకూటమి అభ్యర్థిగా 2018 ఎన్నికల్లోనూ కేసీఆర్‌పై పోటీకి నిలబడ్డారు. ఈసారి భారీ మెజార్టీ తేడాతో ఓడిపోయారు. అయితే, ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ ‌మెజార్టీ 50 వేల మార్క్‌ను దాటింది. 2014లో కేవలం 19వేల మెజార్టీతో గెలవగా…2018 ఎన్నికల్లో మాత్రం 58,290 వోట్ల మెజార్టీని సొంతం చేసుకున్నారు కేసీఆర్‌. అయితే, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనూ సిఎం కేసీఆర్‌ ‌గజ్వేల్‌ను వీడి ఆలేరు నియోజకవర్గంకు పోతారనీ ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లో చేసినట్లుగానే రానున్న ఎన్నికల్లోనూ సిఎం కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ‌వీడుతారంటూ పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.

ముఖ్యంగా టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి…సిఎం కేసీఆర్‌ ‌గజ్వేల్‌ను వదిలి కామారెడ్డికి వెళ్తురంటూ అర్థం వచ్చేలా మాట్లాడుతుండటంతో అటు మీడియాలో, ఇటు రాజకీయ సర్కిల్స్‌లలో కేసీఆర్‌ ‌పోటీపై ఆసక్తి నెలకొంది. అయితే, ఇవన్నీ వట్టి పుకార్లే అని బిఆర్‌ఎస్‌ ‌నేతలు అంటున్నారు. 2018లోనూ కేసీఆర్‌ ఆలేరు వెళ్తున్నారంటూ ప్రచారం చేసినట్లుగానే ఈ దఫా కూడా కామారెడ్డి వెళ్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, ఇదంతా వట్టి పుకార్లేననీ, ఈ తప్పుడు ప్రచారాన్ని పార్టీ క్యాడర్‌ ‌నమ్మొద్దనీ, 2018లో పోటీ చేసినట్లుగానే 2023 ఎన్నికల్లోనూ కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ‌నుండి పోటీ చేస్తారనీ,  తప్పుడు ప్రచారం చేసే వారికి వారం, పది రోజుల్లోనే సరైన సమాధానం వొస్తుందంటున్నారు.  ఇక రాష్ట్ర సిఎంగా బాధ్యతలు వహిస్తున్న కేసీఆర్‌….‌గజ్వేల్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా గజ్వేల్‌ ఏరియా డెవలప్‌మెంటు అథారిటీ (గడా)ని ఏర్పాటు చేయించారు. వేల కోట్ల రూపాయలతో కార్యక్రమాలు చేపట్టారు.  కేజీ టూ పీజీ, సమీకృత మార్కెట్లు, రోడ్లు, ఫారెస్ట్ ‌కాలేజ్‌ అం‌డ్‌ ‌రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌, ‌కొండా లక్ష్మణ్‌ ‌తెలంగాణ స్టేట్‌ ‌హార్టికల్చర్‌ ‌యూనివర్శిటీ ఏర్పాటు, గజ్వేల్‌ ‌పట్టణంలో మహతి ఆడిటోరియం, పట్టణంలో దవాఖానాల నిర్మాణం ఇలా అనేక పనులు చేపట్టడంతో…గజ్వేల్‌ ‌కాస్త కేసీఆర్‌ అడ్డాగా మారిపోయింది.

త్వరలో స్పెషల్‌ ‌లంచ్‌ ‌మీటింగ్‌…అదే వేదిక ద్వారా పుకార్లకు ఫుల్‌స్టాప్‌ ‌పెట్టనున్న గులాబీ దళపతి
రానున్న అసెంబ్లీ ఎన్నికలు బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చాలా ఇంపార్టెంట్‌. ‌దీంతో కేసీఆర్‌ ‌పోటీపై ఆసక్తి నెలకొంది. అయితే, వొచ్చే ఎన్నికల్లోనూ గజ్వేల్‌ ‌నుండి పోటీ చేసేందుకు కేసీఆర్‌ ఇప్పటికే మానసికంగా సిద్ధమైనట్లు అత్యంతమైన విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గత ఐదారు రోజులుగా సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న సిఎం కేసీఆర్‌ ‌తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు కావల్సిన వ్యూహాలను రూపొందించడంతో పాటు తను గజ్వేల్‌ ‌నుంచి పోటీ చేయడానికి సంబంధించిన దానిపై పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి సిఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు కావల్సినన్ని నిధులు కేటాయిస్తున్నారు, దీనికి తోడుగా రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు కూడా గజ్వేల్‌ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాడు.

క్యాడర్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటుండటంతో పార్టీ క్యాడర్‌ ‌చాలా వరకు హ్యాపీగానే ఉంది. ఇదిలా ఉంటే, నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను సిఎం కేసీఆర్‌ ‌నేరుగా కలుసుకోక చాలా కాలమే అయ్యింది. అయితే, రానున్న వారం, పది రోజుల్లో గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను కలుసుకోవడానికి ప్రత్యేకంగా ఓ లంచ్‌ ‌సమావేశాన్ని ఏర్పాటు చేసి వారితో నేరుగా మాట్లాడాలని సిఎం కేసీఆర్‌ ఓ ‌నిర్ణయానికి వొచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే వేదికగా ద్వారా తన పోటీపై జరుగుతున్న ప్రచారానికి కూడా ఫుల్‌స్టాప్‌ ‌పెట్టనున్నట్లు  తెలుస్తుంది. వొచ్చే ఎన్నికల్లోనూ గజ్వేల్‌ ‌నుండి తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించడమే కాకుండా, అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పని చేసి భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత మీదేనంటూ ఈ ప్రత్యేక సమావేశం వేదిక ద్వారానే కేసీఆర్‌ ‌పిలుపునివ్వనున్నట్లు సమాచారం. ఈ పిలుపుతో వొచ్చే ఎన్నికల్లో తాను గజ్వేల్‌ను వీడి మరెక్కడికి పోవడం లేదన్న సమాచారం అందరికీ ఇవ్వాలన్నది సిఎం కేసీఆర్‌ ఆలోచనగా తెలుస్తుంది.

దీంతో ఈ వేదిక ద్వారా ప్రస్తుతం ఆయన పోటీపై జరుగుతున్న పుకార్లన్నింటికి ఫుల్‌స్టాప్‌ ‌పడనున్నాయి. అంటే, ఒకే వేదిక నుండి అనేకమంది నోళ్లు మూయించేలా సిఎం కేసీఆర్‌ ‌పక్కావ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుత పరిస్థితులను చూస్తే మాత్రం గజ్వేల్‌ ‌గడ్డపై కేసీఆర్‌ను ఢీకొట్టడం ప్రతిపక్ష పార్టీలకు పెద్ద సవాల్‌తో కూడిన విషయమే అని చెప్పొచ్చు. ఏకంగా లక్ష మెజార్టీనే టార్గెట్‌ అం‌టూ బిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులు  గ్రౌండ్‌లోకి ముందుకెళ్తున్నాయి. వొచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆరే బరిలో ఉంటారని….లక్ష మెజార్టీ సాధించటం ఖాయమని అంటున్నాయి. ఆ దిశగా సిఎం కేసీఆర్‌ ఆలోచన, అడుగులు పడుతున్నాయి.

Leave a Reply