భట్టికి బ్రహ్మరథం

  • డప్పుల మోతలతో దద్దరిల్లిన ఖమ్మం
  • గజ్జె కట్టి నాట్యమాడిన డప్పు కళాకారులు

ఖమ్మం టౌన్‌, ‌ప్రజాతంత్ర, జూలై1 :  తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే మీ సమస్యలు అన్నీ తీర్చుతామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర శనివారం ఖమ్మం చేరుకున్న సందర్భంగా ప్రజలు ఘనస్వాగతం పలికారు. 108వ రోజు పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర కోదాడ ఎక్స్ ‌రోడ్డు నుంచి ప్రారంభమై వరంగల్‌ ఎక్స్ ‌రోడ్‌ ‌మున్నేరు బ్రిడ్జి డిసిసి ఆఫీస్‌ ఇల్లందు ఎక్స్ ‌రోడ్‌ ‌శ్రీ శ్రీ సెంటర్‌ ‌వరకు కొనసాగింది. ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా ఆదిలాబాద్‌ ‌నుంచి ఖమ్మం వరకు 108 రోజుల పాటు పాదయాత్ర చేసి ఖమ్మం గుమ్మంలో అడుగుపెట్టిన జన నాయకుడికి ప్రజలు జేజేలు పలికారు. కోదాడ ఎక్స్ ‌రోడ్‌ ‌నుంచి డప్పు, డోలు కళాకారులు గజ్జె కట్టి నృత్యాలు చేస్తూ పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్రలో కొట్టిన డప్పుల మూతలు ఖమ్మం గుమ్మంలో దద్దరిల్లాయి.

ఒగ్గు డోలు కళాకారులు తమ విన్యాసాలను ప్రదర్శించగా మహిళా డప్పు కళాకారులు ఆటపాటలతో అందరిని విశేషంగా ఆకట్టుకున్నారు. పాదయాత్రలో   ఆడ బిడ్డలు, అక్క చెల్లమ్మలు పెద్ద ఎత్తున పాల్గొని భట్టి కరచాలనం ఇచ్చేందుకు పోటీపడ్డారు. జై కాంగ్రెస్‌.. ‌జై సోనియమ్మ.. అంటూ నినాదాలతో ఖమ్మం పట్టణం మార్మోగింది. స్వచ్ఛందంగా తరలివచ్చిన వేలాది మంది ప్రజలు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు, అభిమానులు భట్టి విక్రమార్క పాదయాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో దారి పొడవున ప్రజలకు అభివాదం చేశారు. రోడ్డు కిరువైపులున్న మహిళలను రైతులను, కర్షకులను, కార్మికులను, ప్రయాణికులను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పాదయాత్ర ప్రారంభానికి ముందు శిబిరంలో ఖమ్మం జిల్లా జర్నలిస్టులు వచ్చి భట్టి విక్రమార్కకు పూల బొకే అందజేసి పాదయాత్ర విజయవంతం చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను కూడా పాదయాత్రలో ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించడానికి కృషి చేయాలని కోరగా నాలుగు నెలల్లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉండకూడదని లక్ష్యంతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పని చేస్తుందని వారికి హామీ ఇచ్చారు.  ఇండ్లు లేనివారికి ఇండ్ల నిర్మాణం చేసి ఇవ్వడమే మొదటి ప్రాధాన్యతగా పెట్టుకుంటామని చెప్పారు. అదేవిధంగా ర్యాలీలో హమాలీ కార్మికులు వారి సమస్యలు చెప్పగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భట్టి విక్రమార్క పాదయాత్రకు పీరల్స్ ‌లో పనిచేస్తున్న సిబ్బంది ఖమ్మం రూరల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌వద్దకు వచ్చి పెద్ద ఎత్తున భట్టి విక్రమార్క పాదయాత్రకు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *