ఫలించిన మాణిక్‌ ‌రావ్‌ ‌ఠాక్రే మంత్రాంగం

తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్‌ ‌రావు ఠాక్రే  మంత్రాంగం ఫలించింది. ఎట్టకేకలకు కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉన్న విభేదాలు ఒక కొలిక్కి వొ చ్చాయి. ఈ ఏడాదిలో వొస్తాయనుకుంటున్న శాసనసభ ఎన్నికలకు ఇప్పటినుండే కలిసికట్టుగా పనిచేయాలన్న సంకల్పం నాయకుల మధ్య వొచ్చే విధంగా ఆయన వారిని అనునయించగలిగారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అంటే ఏ ఒక్కరికో పరిమితం కాదని, అందరూ కలిసికట్టుగా విధాన నిర్ణయాలను తీసుకోవాలన్న ఆయన హితబోధ నాయకులపై బాగానే పనిచేసినట్లు కనిపిస్తున్నది. మహా సముద్రం లాంటి కాంగ్రెస్‌ ‌పార్టీలో సహజంగానే నాయకుల మధ్య భేదాభిప్రాయాలుంటాయి. అయితే వాటిని అంతర్ఘతంగానే చర్చించుకోవాలెగాని, బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయడం, విమర్శలు చేయడంవల్ల పార్టీ నష్టపోతుందని, అది పార్టీ మనుగడకే ప్రమాదాన్ని కలిగిస్తుందంటూ ఆయన చేసిన హితబోధ నాయకుల చెవికెక్కిందనే అనుకోవాలి.

ఇక ముందు నాయకులెవరైనా సరే తమకున్న అభిప్రాయాలను తనతో పంచుకోవాల్సిందిగా ఆయన వారికి సూచించారు. ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడిగా రేవంత్‌ ‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటినుండీ తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. నాయకుల మధ్య సమన్వయం పూర్తిగా లోపించింది. ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జరుపతలపెట్టిన పాదయాత్రపై ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాదాపు మూడు నెలలపాటు కొనసాగించాలనుకున్న పాదయాత్ర విషయంపై రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడంటూ పార్టీలోని సీనియర్‌ ‌నాయకులంతా అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. అంతేగాక పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న మానిక్కం ఠాకూర్‌ ‌రేవంత్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపించారు. దీంతో అధిష్ఠానం సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత దిగ్విజయ్‌సింగ్‌ను రంగంలోకి దింపింది. ఆయన తన రెండు రోజుల పర్యటనలో సీనియర్స్, ‌జూనియర్స్‌తో మాట్లాడిన అనంతరం పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జిని మారుస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

మాణిక్కం ఠాకూర్‌ ‌స్థానంలో మాణిక్‌ ‌రావు ఠాక్రే వొచ్చారు. ఇప్పటివరకు రెండు సార్లు హైదరాబాద్‌కు వొచ్చిన ఆయన సీనియర్స్, ఇతర పార్టీలనుండి వలస వొచ్చి న వారితో విడివిడిగా, కలగలుపుగా మాట్లాడి వాస్తవ పరిస్థితిని ఆకళింపు చేసుకుని పార్టీ నాయకులందరిని సమన్వయపర్చే నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టమవుతున్నది. ముఖ్యంగా రేవంత్‌ ‌రెడ్డి పాదయాత్ర విషయంలో వొ చ్చిన తగాదాను ఆయన సామరస్యపూర్వకంగా పరిష్కరించగలిగాడు. ఆయన చేసిన సూచనకు నిన్నటివరకు అలిగిన సీనియర్స్ అం‌తా తల ఊపడంతో ఆ పార్టీ ఇప్పుడు క్షేత్రస్ధాయిలో అడుగు పెట్టబోతున్నది. ఇంతకాలం పార్టీలో ఎవరికివారుగా ఉన్నవారంతా ఇకనుంచి కలిసికట్టుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేందుకు సన్నాహాలు ప్రారంభించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాదయాత్రల ద్వారా ప్రజలకు చేరువ కావాలని కాంగ్రెస్‌ ‌పార్టీ పథక రచన చేసింది. అంతేగాక రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర పూర్తికావస్తున్న నేపథ్యంలో దాన్ని కొనసాగింపుగా హాథ్‌ ‌సే హాథ్‌ ‌జోడో పేర రాష్ట్రంలో పాదయాత్రను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ యాత్రకు కేవలం పిసీసీ అధ్యక్షుడికే కాకుండా తమకు కూడా అనుమతివ్వాల్సిందేనని ఆ పార్టీ సీనియర్స్ ‌పట్టుపట్టడం కొంత గందరగోళానికి దారి తీసింది. దీంతో రేవంత్‌రెడ్డి  పాదయాత్ర మొత్తానికే నిలిచిపోతుందా అన్న భావన ఏర్పడింది. అయితే మాణిక్‌ ‌రావు ఠాక్రే దాన్ని ఒక విధంగా సామరస్యంగానే పరిష్కరించగలిగాడని చెప్పాలి. సీనియర్‌ల అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. నాయకులు ఎవరు అలిగినా పార్టీకి నష్టం వాటిల్లుతుందని, పార్టీ పరువు కాపాడాల్సిన బాధ్యత నాయకులదేనని వారికి హితబోధ చేశారు. రాష్ట్రంలో చేపట్టే పాదయాత్ర ఈ నెల 26న ప్రారంభించే క్రమంలో ఆ పార్టీ అధినాయకులైన సోనియాగాంధీని లేదా ప్రియాంకా గాంధీని తీసుకురావాలని సంకల్పించారు.

అధినేతలు రావడం వల్ల పార్టీలోని అన్ని వర్గాలవారు తప్పకుండా భాగస్వాములవుతారన్న ఆలోచన చేసినట్లుంది. అయితే యాత్రకు 26వ తేదీన చేస్తున్నది లాంఛన ప్రారంభోత్సవమే. వాస్తవంగా పాదయాత్ర ఫిబ్రవరి 6వ తేదీ నుండి వరుసగా కొనసాగుతుంది. రేవంత్‌రెడ్డి యాభై నియోజకవర్గాల్లో తన పాదయాత్రను కొనసాగిస్తున్న క్రమంలో మిగతా ఇరవై నుండి ముప్పై నియోజకవర్గాల్లో సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతలుకూడా పాదయాత్రను కొనసాగించేందుకు అధిష్ఠానం అనుమతిచ్చింది. ఇది ఒక విధంగా సీనియర్స్ ‌సాధించుకున్న విజయమే అయినా, సమస్య చిక్కుముడిని మాణిక్‌ ‌రావు ఠాక్రే సునాయాసంగా విప్పదీసారనే చెప్పాలె. పార్టీ అంతర్ఘత పోరాటంలో ఎవరు విజయం సాధించినా కాంగ్రెస్‌ ‌పార్టీ దాదాపు రెండు నెలల కాలం  ప్రజల మధ్య ఉండేందుకు ఈ పాదయాత్ర దోహదపడనుంది. ప్రజలకు పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంపొందించగలిగితే, ఆ తర్వాత ప్రజలే పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తారన్న లక్ష్యంగా పార్టీ ప్రచార కార్యక్రమాలను రూపొందించుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *