అమరావతి, డిసెంబర్ 22 : తూర్పు భూమధ్య రేఖా ప్రాంతం, హిందూ మహాసముద్రానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అనంతరం ఆ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక దుగా కొమరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని వెల్లడించింది .
దీని ప్రభావం ఏపీపై నామమాత్రంగానే ఉండనుంది. మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య, ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల వల్ల రాష్ట్రంలో పొగమంచు కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్షీణిస్తుండడంతో చలి ప్రభావం అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని ఐఎండీ పేర్కొంది.



