నిరుద్యోగుల పట్ల పోలీసుల తీరు ఇదేనా

  • పరామర్శకు వెళ్లిన వారిపై లాఠీఛార్జీయా
  • గాంధీ హాస్పిటల్‌ ఘటనపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆగ్రహం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1 : తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ హాస్పిటల్‌ వద్ద నిరుద్యోగ యువకులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నిరుద్యోగ హక్కుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్‌ను పరామర్శించేందుకు వెళితే నిరుద్యోగ యువకులపై లాఠీ ఛార్జ్‌ చేయడం ఏంటని మండిపడ్డారు. ప్రజాపాలనలో పరామర్శించటం, నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకే నిరుద్యోగులను తరుముతూ పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారని ఆరోపించారు. అటు నిరుద్యోగ యువకుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్‌ పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు రాకేష్‌ రెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధులకు కూడా పోలీసులు అడ్డుకున్నారు. మోతీలాల్‌ను కలవకుండా అడ్డుకొని వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీనిపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న పార్టీ నాయకులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

నిరుద్యోగ యువకుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా వారికి సంఫీుభావం తెలుపుతున్న యువకులు, ప్రతిపక్షాల నాయకులను అడ్డుకోవడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి అప్రజాస్వామ్య చర్యలను మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగులు, యువకులు డిమాండ్‌ చేస్తున్నట్లుగా ఉద్యోగ నోటిఫికేషన్‌లను వెంటనే జారీ చేయాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హావ్ని ప్రకారం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పక్రియ ప్రారంభించాలని రేవంత్‌ రెడ్డి సర్కార్‌ను కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *