కవి తన సృజన ప్రపంచంలో శ్రద్ధతో విత్తుకునే విత్తనం కవిత్వం. అది మొలకెత్తి, వృక్షంగా మారి, విస్తారంగా ఎదిగి కవికి చిరునామాగా మారుతుంది. తన హృదయం నుండి కురిసే విభిన్న భావాలను అక్షరీకరించి శబ్దవేదిగా కవిత్వాన్ని కవి నిపుణతతో మలుస్తాడు. కవికి చివరకు మిగిలే నిజమైన ఆస్తి ఒక్క కవిత్వమే. సమాజాన్ని అనేక కోణాల్లో లోతుగా పరిశీలించి సత్వరమే స్పందించే కవి కవిత్వం మానవ జీవన దృశ్యాలను ఎంతో స్పష్టంగా ఆవిష్‌లరిస్తుంది. సామాజిక, మానవీయ స్పర్శతో కవిత్వాన్ని అందిస్తున్న నిరంతర కవి డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు. పలు సమకాలీన అంశాలను, సంఘటనలను, జీవన కోణాలను వస్తువులుగా తీసుకొని ఆంజనేయులు ఇటీవల రాసిన అనేక కవితల సమాహారంతో మరో మజిలీ సంపుటి రూపొందింది. సహస్ర స్వరాల సమస్యల బింబ ప్రతిబింబాల్లా ఇందులోని అనేక కవితలు కదం తొక్కాయి.
జ్ఞానోదయం కావాలి కొందరికి అన్న కవితలో నీలో నీకు తెలియంది చాలా ఉందని, ఇప్పటికైనా వికాసోదయం వైపు మనిషి నడక ప్రారంభించాలని చెప్పారు. జీవితపు గుణపాఠాలను వడబోసుకుని, కీర్తి ప్రతిష్టల కోసం అనవసర వెంపర్లాటలు వదిలి చరిత్రలో రాయదగ్గ నిజాయితీ గల సంస్కారాన్ని మనిషి పుణికి పుచ్చుకోవాలని సూచించారు. ఓటమి గెలుపులు జీవితంలో సహజమేనని, గుండె ధైర్యంతో కూడిన ఒకే ఒక్క చిరునవ్వు మనిషిని శిఖరానికి చేరుస్తుందని చెప్పారు. నిరంతర శ్రమ జీవిగా అమ్మను అభివర్ణించి నిండు మనస్సుతో ప్రణతులర్పించారు. విశ్వాసాన్ని శ్వాసగా మార్చుకుంటే ఉన్నత శిఖరాలు స్వంతమవుతాయన్నారు. ప్రాణాపాయ స్థితిలో కాపాడే అమ్మ దేవతలే మన నర్సులని కొనియాడారు. ఒక అంతులేని ఆనంద గీతిక అరుదెంచి చైతన్య శిఖరాల్ని వెలిగించాలని ఆకాంక్షించారు. కండ బలం, బుద్ధి బలం, గుండె బలంలలో చీకటి ఎంత చిక్కనిదైనా బుద్ధిబలమే అప్రతిహతంగా చీల్చుకుంటూ ముందుకు వెళ్లగలుగుతుందన్నారు. మనసు మల్లె తోటకు ఆనంద భావావేశాలు నిత్య కృత్యాలని చెప్పారు.
కాలం గీసిన చిత్రంలో కష్టాల కడలిని ఈది నిలిచి గెలిచిన వారే కాలాతీత వ్యక్తులన్నారు. అతని భావాలు సామ్యవాద శిఖరాలంటూ పాత్రికేయ దినోత్సవం సందర్భంగా రాసిన అతడు నిత్య వార్తలతో అన్న కవితలో సీనియర్ పాత్రికేయులు ఏబికె ప్రసాద్‌ను ప్రస్తావిస్తూ చెప్పారు. సంస్కృత, తెలుగు భాషల మేళవింపుతో వెలుగొందిన విజ్ఞాన సర్వస్వంగా ఆచార్య రవ్వా శ్రీహరిని ప్రస్తుతించారు. నగర జీవనంలో మనిషి తన చిరునామాను ఎక్కడో పోగొట్టుకున్నాడని తెలిపారు. ప్రపంచమంతా చీకటి నిండిన వేళ/ మిణుగురులు వెదజల్లే కాంతి చాలు మనిషి శక్తిమయంగా మునుముందుకు సాగిపోవడానికి అన్నారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్‌ను భారత జాతి ప్రగతికి దిక్సూచిగా చూపారు. యంత్ర భూతాలు, విలువల చక్రంపై ప్రపంచం, మానవత నా ఆభరణం, నైరుతి రాక కోసం, ఇవాళ, రెక్కలు వచ్చిన పక్షి లెక్క, అప్పు చేసి పప్పు కూడు, కిటికీలోంచి, గ్రహణం విడిచిన వేళ, చీకటి కాబోతుంది, వలస బతుకు, మంచుకప్పిన ఉదయం, నవమానవ గీతం, ఒక్కొక్కరు, నా గీతం వంటి కవితలు సరకొత్త దృక్పథంతో ఎంతో ఆలోచనాత్మకంగా సాగాయి.
మనిషి నదిపాయలాగా, చల్లని మేఘమాల మాదిరిగా సాగిపోవాలని భావించారు. ఇవాళ జీవితం పరుగెత్తే ప్రయాణమని చెప్పారు. మనిషి సుదీర్ఘ ప్రయాణంలో ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడన్నారు. పసందైన భావాలే పరిమళిస్తాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు అన్నది ఎంతో కీలకమని చెప్పారు. నడిచే దైవంతో సమానంగా మనిషి ఎదగాలని చెప్పారు. విలువైన జీవన సందేశం అందించే సాధనంగా జీవితం మారాలని తెలిపారు. అప్పుల అంగడితో బతుకులు ఆగం కావొద్దని హెచ్చరించారు. ఉత్తేజకరమైన ప్రతి సన్నివేశం విశిష్ట ఆలోచనల సృష్టికి కారణమవుతుందని తెలిపారు. జాతిని నడిపించిన మహనీయులు నిత్య స్మరణీయులని చెప్పారు. కవిత్వం అభ్యుదయ పథానికి దిక్సూచి అన్నారు. దేహం పటుత్వాన్ని కోల్పోయి ఈ జీవితం ఎందుకున్న ప్రశ్న మనిషికి ఎదురవడం తప్పదని చెప్పారు. సాగిపోవాల్సిన దారిని మనిషి జాగరూకుడై కనుక్కోవాలని తెలిపారు. జీవన తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని సూచించారు. ఎదుటి వారిని మానవీయ కోణంలో ఆదరించాలని తెలిపారు. మనిషిలో రాక్షసత్వం వద్దని చెప్పారు. జీవితం ఆనందకేళి కావాలని కోరుకున్నారు. మనిషి మనిషికోధోరణి ఉంటుందని తెలిపారు. ప్రపంచమంతా వింతలమయం అన్నారు. సమాజం కోసం జీవితాలను త్యాగం చేసిన వారు మహనీయులుగా నిలిచిపోయారని చెప్పారు. జీవిత పాఠశాలలో ప్రతి గుణపాఠాన్ని మనిషి గమనించి తనను తాను సంస్కరించుకోవాలని తెలిపారు. తన గీతానికి మనిషి మదిలో వెలుగు దివిటీలు వెలిగించాలన్న లక్ష్యం ఉందని చెప్పారు. అపజయాల నుండి విజయం వైపు మొక్కవోని ధైర్యంతో సాగిపోవాలని తెలిపారు.
మాధుర్యవంతమైన మనస్సున్న మనుష్యుల తీపి జ్ఞాపకాలు వినిపించే నిష్కల్మశ, నిశ్చల, నిరాడంబరమైన మల్లెల పరిమళం లాంటి లోకాన్ని కవి ప్రగాఢంగా ఆకాంక్షించారు. మానవీయ భావాలతో మమతానురాగాలను పలికించే మనుషులు వర్తమానానికి తప్పనిసరిగా కావాలన్నారు. స్వార్థపు వలయాల సరిహద్దులు చెరిగిపోవాలన్నారు. అనుకున్న వాళ్ళకు దూరమైనా గుండె చెలిమే నుండి పుట్టే కాసింత ధైర్యమే ఆలంబనగా మనిషి ముందుకు సాగిపోవాలని చెప్పారు. దృశ్యాదృశ్య జగత్తును వర్ణించడమే కాదు యుక్తాయుక్త విచక్షణను కూడా ఎంతో సంయమనంతో కవి పాటించిన తీరుకు ఈ సంపుటిలోని పలు కవితలు ప్రబల నిదర్శనాలుగా నిలిచాయి.
-డా.తిరునగరి శ్రీనివాస్
9441464764





