కాంగ్రెస్ 17, బిజెపి 10, బిఆర్ఎస్ మెజార్టీ స్థానాల లక్ష్యంగా కసరత్తు
అయోధ్య అంశం తమకు అనుకూలిస్తుందని బిజెపి ఆశాభావం
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు జోష్‌తో కాంగ్రెస్ అడుగులు
పార్లమెంటు ఎన్నికల్లోనైనా పట్టు నిలుపుకునేందుకు బిఆర్ఎస్ యత్నం
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జనవరి 25 : దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తీవ్రస్థాయిలో కసరత్తు మొదలుపెట్టాయి. దేశ వ్యాప్తంగా అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని బిజెపి లక్ష్యంగా పెట్టుకుంది. నరేంద్ర మోదీని మూడవసారి ప్రధానిని చేయాలని ఆపార్టీ ఇప్పటికే తీవ్రస్థాయిలో ప్రచారం మొదలుపెట్టింది. తాజాగా అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం తమకు అనుకూలంగా మారుతుందన్న ఆశాభావంలో ఆ పార్టీ వర్గాలున్నాయి. ఉత్తర భారత దేశం కన్నా దక్షిణాది రాష్ట్రాలపైన బిజెపి ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించింది. దక్షిణాదిలో కర్ణాటకతో బిజెపి విస్తరణకు శ్రీకారం చుట్టాలనుకున్న ఆ పార్టీ లక్ష్యం దెబ్బతిన్నది. అలాగే గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ పైన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించినప్పటికీ కోరిక నెరవేరకుండా పోయింది. దీంతో ఇప్పుడు అందివొచ్చిన పార్లమెంటు ఎన్నికల్లోనైనా తమ సత్తా చాటాలనుకుంటుంది ఆ పార్టీ. 2019 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అంతకు ముందుకన్నా ఎక్కువ స్థానాలనే సాధించుకుంది. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు పార్లమెంటు స్థానాలను సాధించుకోవడం విశేషం. అయితే ఈసారి అంతటితో తృప్తి పడకుండా కనీసం పది స్థానాల్లో నెగ్గే విధంగా ప్రణాళికను రచిస్తుంది. గడచిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్నే చేపడుతామనుకున్న బిజెపికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకోగలిగింది. అయితే చాలా నియోజకవర్గాల్లో రెండవ స్థానాన్ని సాధించుకున్న నేపథ్యంలో ప్రజలు తమ పార్టీ పట్ల విశ్వాసాన్ని ప్రకటించారన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉంది.
పార్టీలో అంతర్ఘత విభేదాల వల్ల ఆ ఎన్నికల్లో వెనుకబడిపోయిన కారణంగా ఈసారి అలాంటి పొరపాట్లు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలను పార్టీ తీసుకుంటున్నది. అందులో భాగంగా ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులను మార్చి కొత్త అధ్యక్షులను నియమించింది. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు చెక్‌పెట్టే విధంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా జనవరి మొదటి వారంలో వివిధ కమిటీలతో సమావేశాలను నిర్వహించింది. కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న వికసిత్ భారత్ కార్యక్రమాలతో పాటు నవయువ వోటర్ల కమిటీ, శ్రీ రామమందిర దర్శన కమిటీ, లాభర్సి అభియాన్ కమిటీ, మహిళ, స్వచ్ఛంద సంస్థల కమిటీ, గావ్ చలో..బస్తీ చలో లాంటి పలు కమిటీలతో సమీక్షలు నిర్వహించింది. కాగా గత శాసనసభ ఎన్నికలమాదిరిగానే పార్లమెంటు ఎన్నికల కోసం కేంద్ర నాయకత్వం ఈసారి కూడా రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాన్ని మరోసారి భుజానికెత్తుకోబుతున్నది. ఆ పార్టీ ముఖ్య నాయకుడు, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌షా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 28న రాష్ట్రంలో పర్యటించనున్నట్లు వార్త. ఈ సందర్భంగా ఆయన కరీంనగర్లో కార్యకర్తల సమావేశంలో, మహబూబ్‌నగర్‌లో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీతో, అలాగే హైదరాబాద్‌లో వివిధ వర్గాలకు చెందిన నిపుణులతో సమావేశం కానున్నట్లు తెలుస్తున్నది. అలాగే ప్రధాని మోదీ దక్షిణాదిలో కేరళ నుండి తన ప్రచారం ప్రారంభించే అవకాశాలున్నట్లు ఆ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వొచ్చే ఫిబ్రవరి 5వ తేదీ నుండి 14 వరకు అయిదు పార్లమెంటు క్లస్టర్స్ పరిధిలో ప్రతీ రోజు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రథయాత్రను కొనసాగించాలని బిజెపి నిర్ణయించింది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ కూడా దూకుడుగానే ముందుకుపోతున్నది. పదేళ్ళ తర్వాత తిరిగి రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న జోష్‌ను అలానే కొనసాగించే క్రియలో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఇన్‌ఛార్జిలను, కోఆర్డినేటర్లను నియమించింది. ముఖ్యంగా ఆ పార్టీ తెలంగాణలో లక్ష్యంగా పెట్టుకున్న 17 పార్లమెంటు స్థానాలను గెలిపించుకోవడం కోసం మంత్రులను, సీనియర్ నాయకులను కోఆర్డినేటర్లుగా పెట్టుకుంది. తెలంగాణలో మాదిరిగానే కేంద్రంలో కూడా తమ పార్టీ అధికారంలోకి వొచ్చేందుకు గాను బిజెపి కేంద్ర నాయకత్వం మాదిరిగానే కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంకూడా తెలంగాణ పైన ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తాజాగా గురువారం రాష్ట్ర రాజధానిలోని ఎల్బీ స్టేడియంలో బూత్‌స్థాయి ఏజంట్ల సమావేశం ఏర్పాటు చేసింది. సుమారు నలభైైవేల మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానంపైన దిశానిర్దేశం చేసేందుకు స్వయంగా ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే విచ్చేశారు.
గత ఎన్నికల్లో పరాజయంపాలైన భారత రాష్ట్ర సమితి ఈ ఎన్నికల ద్వారా తన పరువు నిలబెట్టుకోవాలనుకుంటున్నది. మెజార్టీ స్థానాలను సొంతం చేసుకోవడం ద్వారా ప్రజలు తమ వెంటే ఉన్నారని చాటి చెప్పాలనుకుంటున్నది.
ఇప్పటికే పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహించిన ఆ పార్టీ, వొచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి సమావేశాలను జరిపే కార్యక్రమాన్ని రూపొందించింది. క్షేత్రస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు, శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటున్నది. పార్టీని అన్ని స్థాయిల్లో పటిష్టపర్చకపోవడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వొచ్చిందన్న విషయాన్ని ఆ పార్టీ గుర్తించింది. లోకసభ ఆఖరి సమావేశాలు జరుగనున్న క్రమంలో పార్టీ అనుసరించాల్సిన తీరుపై శుక్రవారం పార్టీ అధినేత కెసిఆర్ తమ పార్టీకి చెందిన లోకసభ, రాజ్యపభ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. విభజన హామీలను గత పది సంవత్సరాలుగా కేంద్రం అమలుచేయని తీరుపై సభలో చర్చకు తీసుకురావాలన్న అంశంతో పాటుగా, పార్లమెంటు అభ్యర్ధులను సూచనప్రాయంగా ప్రకటించే అవకాశం ఉందను కుంటున్నారు. ప్రధానంగా ‘తెలంగాణ ప్రజల పరిరక్షణ’ నినాదంగానే ఈసారి బరిలోకి దిగాలని ఆ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. మొత్తానికి ఈసారి జరిగే పార్లమెంటు ఎన్నికలు ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.



