అమిత్షా సభతో తెలంగాణలో మార్పులు
ఉప ఎన్నికతో నిధులు కేటాయిస్తున్నారు
ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా రాజగోపాల్ రెడ్డి, వివేక్
నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ గ్రాఫ్ మరింతగా దిగజారుతుందని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. మునుగోడులో అమిత్ షా సభ తర్వాత మార్పు వొస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా మాట్లాడుతూ ఉప ఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్కు నియోజకవర్గం గుర్తుకు వొస్తుందని వివేక్ మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వోట్లేసిన ప్రజలను కేసీఆర్ మర్చిపోతారని విమర్శించారు. కవి•షన్లతో కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు సంపాదిస్తుందని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అవినీతి జరిగిందన్నారు. కేంద్రమంత్రే స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పందిస్తూ అక్రమాలు జరిగాయని చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు. కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం బందీ అయిందని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కుని ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించామన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ..సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతే మునుగోడులో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21వ తేదీన మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగసభ ఉంటుందని ముందే చెప్పామని.. అయినా కుట్రపూరితంగా సీఎం కేసీఆర్ శనివారం సభ నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఏం అభివృద్ధి చేశారని సీఎం మునుగోడుకు వస్తారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఎక్కడ ఉప ఎన్నిక ఉంటే అక్కడ నిధులు కేటాయిస్తున్నారని, మునుగోడు బై పోల్ వస్తుందనే కొత్త పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. మునుగోడు నియోజకవర్గం అంటే సీఎంకు అంత చిన్నచూపు ఎందుకని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. సిరిసిల్ల, సిద్దిపేట అభివృద్ధికి పెట్టిన ఖర్చు, మునుగోడు అభివృద్దికి పెట్టిన ఖర్చు వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కల్వకుంట్ల కుటుంబంలో తెలంగాణ బందీ అయిందని.. ప్రస్తుతం విముక్తి కోరుకొంటోందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తుతరాలకోసం సరైన నిర్ణయం తీసుకొని ఉపఎన్నికలో కేసీఆర్ కి బుద్ది చెప్పాలని మునుగోడు ప్రజలకు పిలుపునిచ్చారు. భూ నిర్వాసితులు 6 సంవత్సరాలుగా పరిహారం కోసం తిరుగుతున్నా, నాలుగు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ సర్కారు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వివేక్ వెంకటస్వామితో కలిసి పోరాటం చేసి రాష్ట్ర సాధనలో ముందున్నామన్నారు. మెజారిటీ ప్రజల అభిప్రాయం తీసుకుని మునుగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.



