కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాగానే అసలు సినిమా
పరిపాలనపై అతి శ్రద్ధ..పార్టీ నిర్మాణం సరిగా జరుగకనే ఓటమి
భువనగిరి పార్లమెంట్ సమీక్షలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12 : ఇప్పుడే ట్రైలర్ స్టార్ట్ అయింది…కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాగానే అసలు సినిమా స్టార్ట్ అవుతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హావిూలను అమలు చేసేంత వరకు ప్రజల తరుపున పోరాటం చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హావిూల పుస్తకంను బైబిల్, ఖురాన్, భగవద్గీత లాగా చదవి, అవి అమలు చేసేంత వరకు వదలొద్దని కార్యకర్తలకు కేటీఆర్ దిశా నిర్దేశర చేశారు. ఒక్క నెలలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు.
శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన భువనగిరి పార్లమెంట్ సవిూక్ష సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, గెలుపులు సహజమని, ఈరోజు మనం ఒడిపోయామని నిరాశ చెందాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని కరపత్రంలా మాట్లాడిరచారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఇష్టం వొచ్చినట్లు దుష్పచ్రారం చేయించారని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య తీర్చింది నిజం కాదా..ఇంటింటికీ మంచి నీళ్ళు ఇచ్చింది నిజం కాదా…అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. పదేండ్లల్లో చేసిన అభివృద్ధి కనిపిస్తుంటే, కళ్ళు లేని కబోదిలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని విమర్శించారు.
పరిపాలనపై అతి శ్రద్ధ..పార్టీ నిర్మాణం సరిగా జరుగకనే ఓటమి
పరిపాలనపై అతి శ్రద్ధ..పార్టీ సంస్థాగత నిర్మాణం సరిగా జరుగనందునే ఓటమి పాలయ్యామని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఓటమికి సంబంధించి పలు కారణాలను సమీక్షా సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు వివరించారు. అయినా బిఆర్ఎస్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని, ప్రజలు తప్పు చేశారని అనడం సరికాదని, ఇదే ప్రజలు తమను రెండు సార్లు గెలిపించారని అన్నారు. 14 చోట్ల కేవలం వందల్లో, వేలల్లో మాత్రమే మెజారిటీ తగ్గిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు సమీక్షించుకుని, వొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి పది కారణాలను ఆయన పార్టీ నేతలకు వివరించారు. పరిపాలనపై దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదన్నారు. అందుకు పూర్తి బాధ్యత తనదేనన్నారు. పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగా జరుగలేదని, ఇతర పార్టీల నుంచి వొచ్చిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయామన్నారు.
నియోజక వర్గాల్లో ఎమ్మేల్యేలే కేంద్రంగా మారి పార్టీని నడుపడం సరికాదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని కూడా సరిగా పట్టించుకోలేక పోయామన్నారు. ప్రభుత్వం లబ్దిదారుడికి పథకాల అందజేతకు మధ్య కార్యకర్త లేకుండా నేరుగా చేరడంతో లబ్దిదారుడికి, కార్యకర్తలకు మధ్య లింక్ తెగిపోయిందన్నారు. గత పదేళ్లలో 6 లక్షల రేషన్ కార్డులిచ్చినా…ప్రల్లోకి ఆ అంశాన్ని తీసుకుని వెళ్లలేకపోయామన్నారు. వందలో ఒక్కరికి రేషన్ కార్డు రాని విషయమే తమకు ప్రతికూలంగా ప్రచారమయిందని కెటిఆర్ అన్నారు. దళిత బంధు కొందరికే రావడంతో మిగితా వాళ్లు ఓపిక పట్టలేక పాయారని..దాంతో వారు తమకు వ్యతిరేకమయ్యారన్నారు. ఇక రైతు బంధు తీసుకున్న సామాన్య రైతు కూడా ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి ఇవ్వడాన్ని సహించలేదని కెటిఆర్ వివరించారు. ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, 6 నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.



