‘‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం మూడంటే మూడే డయాలసిస్ సెంటర్లు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం పేషంట్లు పడుతున్న బాధలను గుర్తించి 104 డయాలసిస్ సెంటర్లను అందుబాటు లోకి తెచ్చింది. కేసీఆర్ ఉదార హృదయంతో డయాలసిస్ పేషంట్లకు ఆసరా పింఛన్లు సైతం అందిస్తుండటంతో వారికెంతో ఊరట లభించింది. వీరికి ఉచిత బస్ పాస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.’’
నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీ సిస్టంను పరిశీలిస్తున్న మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యుత్తమ వైద్య సేవలందిస్తు గొప్ప ప్రగతిని సాధించింది. పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ పేర్కొన్నది రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి వల్ల 2014 సంవత్సరం లో 92 గా ఉన్న మాతృ మరణాల రేటు 2022 నాటికి గణనీయంగా తగ్గి 43 కు చేరింది. ఈరోజు దేశంలో అతి తక్కువ మాతృ మరణాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉన్నది. అదేవిధంగా శిశుమరణాలరేటు (ఐఎంఆర్) 2014లో ముప్పై తొమ్మిది ఉండగా, ప్రస్తుతం అది ఇరవై ఒకటికి తగ్గింది.
ప్రతి లక్ష జనాభాకు సగటున 19 ఎంబీబీఎస్ సీట్లతో వైద్యవిద్యలో తెలంగాణ ప్రప్రథమస్థానంలో ఉన్నది. అదే విధంగా మెడికల్ పీజీ సీట్లలో ప్రతి లక్ష జనాభాకు 7 సీట్లతో దేశంలో రెండోస్థానంలో ఉన్నది.
రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 1400 ఆక్సిజన్ బెడ్ లు ఉండేవి వాటి సంఖ్యను ఇరవై రెట్లు పెంచి 27,966 బెడ్‌లకు పెంచడం జరిగింది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని ఆర్యోక్తి. చూపు తగ్గితే జీవితం మసకబారి పోతుంది. రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నవారి కష్టాలు తీర్చడం కోసం ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నది. మొదటి దశ విజయ స్ఫూర్తితో రెండవదశ కంటివెలుగు నేత్రవైద్యం నిరాటంకంగా కొనసాగింది. కంటిచూపు సమస్యల నివారణ కోసం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఉచిత కంటి పరీక్షలు జరిపి కళ్లద్దాలను సైతం అందిస్తున్న కంటి వెలుగు పథకం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది.
2018లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం 1 కోటి 54 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి, 40 లక్షలకు పైగా కళ్ళద్దాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. ఈ కంటి వెలుగు కార్యక్రమం చూసి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తమ తమ రాష్ట్రాల్లోనూ కంటివెలుగును అమలు చేస్తామని ప్రకటించడం మనకు గర్వకారణం.
తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హెల్త్ సిటీ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా 1100 కోట్ల ఖర్చుతో రెండు వేల బెడ్ల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే దీన్ని పూర్తిచేసి, ప్రారంభించాలని ప్రభుత్వం బలమైన సంకల్పంతో ఉంది. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలని, అందుకు తగిన స్థాయిలో భవనాలు, వసతులు ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు వైద్య విద్యను చేరువచేస్తూ వైద్య సేవలను మరింత విస్తృత పరిచేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో కేవలం మూడే మెడికల్ కాలేజీలు ఉండేవి.
రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తరించాలని, పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పెద్దఎత్తున సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మిస్తున్నది. రాజధాని నగరం హైదరాబాద్ నలువైపులా గచ్చిబౌలి, ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్ ప్రాంతాల్లో ప్రభుత్వం భారీ ఎత్తునసూపర్ స్పెషాల్టీ దవాఖానాల నిర్మాణం చేపట్టింది. వీటి నిర్మాణంతో 4,200 పడకలు అందుబాటులోకి వస్తాయి. వీటితో పాటు నిమ్స్ లో మరో 2 వేల పడకలు కోసం అదనంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలనే శంకుస్థాపన చేసినారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం మూడంటే మూడే డయాలసిస్ సెంటర్లు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం పేషంట్లు పడుతున్న బాధలను గుర్తించి 104 డయాలసిస్ సెంటర్లను అందుబాటు లోకి తెచ్చింది. కేసీఆర్ ఉదార హృదయంతో డయాలసిస్ పేషంట్లకు ఆసరా పింఛన్లు సైతం అందిస్తుండటంతో వారికెంతో ఊరట లభించింది. వీరికి ఉచిత బస్ పాస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
గర్భం ధరించిన దశలో రెక్కాడితే గాని డొక్కాడని నిత్యం కష్టపడే మహిళలు కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో కేసీఆర్ కిట్ పథకం ప్రారంభించినారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మహిళలు సురక్షితంగా ప్రసవించాలనే లక్ష్యం కూడా ఈ పథకంలో ఒక భాగం.
కేసీఆర్ కిట్‌లో తల్లీబిడ్డలకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్‌ను ప్రభుత్వం అందిస్తున్నది. కేసీఆర్ కిట్ పథకం అమలుతోపాటు, ఎంసీహెచ్ హాస్పిటళ్లను బలోపేతం చేయడంతో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య రెట్టింపై 61 శాతానికి పెరిగింది.
గర్భవతులలో పోషకాహారలోపం తలెత్తకుండా ఉండేందుకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గర్భిణుల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కుమురంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూలు, వికారాబాద్‌లలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
మానవతవాది సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులతో అవసాన దశకు చేరిన పేషంట్ల కోసం ప్రభుత్వం పాలియేటివ్ కేర్ చేపట్టింది. వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ, చివరి రోజులను ప్రశాంతంగా గడిపేందుకు ఈ కేంద్రాలు సేవలందిస్తాయి. ఇప్పటివరకు 33 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు మొత్తం 168 ఉండగా వాటిలో ఐదో వంతు తెలంగాణలోనే ఉన్నవి.
గతంలో హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు సుస్తీ చేస్తే ప్రైవేటు దవాఖానాలే దిక్కయ్యేవి. ప్రభుత్వ వైద్యసేవలు అందుబాటులో ఉండేవి కావు. నిరుపేదల బస్తీలలో చక్కని సౌకర్యాలతో వైద్యశాలలను ప్రారంభించిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 342 బస్తీ దవాఖానలు పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలనందిస్తున్నాయి.
ఇంతే కాక రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో బస్తీ దవాఖానలు ప్రారంభిస్తున్నారు విజయవంతమైన బస్తీ దవాఖానాల స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఏఎన్‌ఎం సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా అప్ గ్రేడ్‌గా మారుస్తున్నారు. దీనితో ప్రాథమిక వైద్య సేవలు, గ్రామీణ ప్రజలకు మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తాయి.
మాతృమరణాలు ప్రతి లక్ష ప్రసవాలకు అతి తక్కువగా ఉండాలని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక చెప్తున్నది. రాష్ట్రంలో ఎంఎంఆర్ ఈ రోజున నలభ్కెమూడుగా ఉంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని చేరుకొన్నది. చిత్తశుద్ధితో, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తీసుకొన్న కార్యాచరణ మూలంగానే ఇది సాధ్యపడింది.
– దండంరాజు రాంచందర్ రావు
రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్
సింగరేణిభవన్ హైదరాబాద్
9849592958




