ఆయారామ్‌.. గయారామ్‌లతో ఒరిగేదేముంది..?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఇతర పార్టీలనుండి వొచ్చి చేరుతున్న నాయకులతో దాదాపు అన్ని పార్టీలు హడావిడిగానే ఉన్నాయి. రానున్న అవకాశాలకోసం ఆశతో దశాబ్దాలుగా పార్టీని పట్టుకుని ఉన్నప్పటికీ తమకు నిరాశ ఎదురవడంతో అవమానభారంతో ఇక పార్టీలో ఉండ లేమంటూ పలువురు నాయకులు తామున్న పార్టీ నుండి నిష్క్రమిస్తున్నారు. నిరాశతో రగిలిపోతున్న వీరు వెంటనే మరో పార్టీ కండువ కప్పుకుంటున్నారు. వీరిని చేర్చుకుంటున్న ఇతర పార్టీ అధినేతలు వారికి ఎలాంటి హామీ ఇస్తున్నారో తెలియదుకాని, అంతవరకు ఏ పార్టీపైనైతే దుమ్మెత్తి పోశారో తగుదునమ్మా అంటూ వీరు ఏమాత్రం తడబాటు లేకుండా, సిగ్గుపడకుండా మళ్ళీ అదే పార్టీని పొగుడుతూ ఆ గూటికి చేరిపోతున్నారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వొచ్చినవారైతే వారికి పార్టీ సిద్ధాంతాల పట్ల పెద్దగా అవగాహన లేదనుకోవొచ్చు. కాని, నాలుగు, అయిదు దశాద్ధాలుగా ఒకే పార్టీలో ఉన్నవారు కూడా క్షణాల్లో పార్టీ ఫిరాయించేస్తున్నారు. తాము చేరుతున్న పార్టీ అధినాయకుడిని నిన్నటివరకు తిట్టిపోశామే, ఆ పార్టీలోకి ఎలా వెళ్తామన్న ఇసుమంత సంశయం కూడా వారిలో కనిపించడంలేదు. అయితే ఈ అయారామ్‌:.. ‌గయారామ్‌ల వల్ల ఆ పార్టీలకు ఏమైన ఉపయోగం ఉంటుందా అంటే అదీ అనుమానమే. నాయకుడే పార్టీ మారుతున్నాడుగాని, క్యాడర్‌ ‌మారటంలేదని, కార్యకర్తలంతా తమతోనే ఉన్నారని ఆయా పార్టీలు సర్దిచెప్పుకుంటున్నాయి.

తెలంగాణ ఎన్నికలను పరిశీలిస్తే.. ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలైనప్పటి నుండి రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, ‌బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌ల నుండి ఫిరాయింపుల జోరు గతంలోకన్నా ఎక్కువగానే కనిపిస్తున్నది. ముఖ్యంగా పోటీ అభ్యర్ధుల జాబితాలో తమ పేర్లు కనిపించక పోవడంతో పార్టీ మార్పిడిల పర్వం పెరుగుతున్నది. తమకు టికెట్‌ ‌లభించకోవడంతో వారు తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారు. నిన్నటివరకు మోసిన కాడిని కిందపడేసి, స్వీయపార్టీపైన విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని, సర్వేల్లో తమ గెలుపుఖాయమని వొచ్చినా తమకు అన్యాయం చేశారని, తమ అనుయాయులకే సీట్లు కేటాయిస్తున్నారని ఇలా రకరకాలుగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌దాదాపుగా అన్ని స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కొన్ని స్థానాలను మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఒకటి, రెండు జాబితాల్లో కూడా తమ పేర్లు కనిపించకపోవడంతో ఆశావహులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. దీంతో అలిగిన పలువురు ఇతర పార్టీ కండువను కప్పుకుంటున్నారు. ముఖ్యంగా సుమారు నాలుగున్నర దశాబ్దాల కాలంగా కాంగ్రెస్‌కు సేవలందిస్తూ వొచ్చిన పొన్నాల లక్ష్మయ్య, ఇటీవల పార్టీలో చేరిన నాగం జనార్ధన్‌రెడ్డి లాంటి సీనియర్స్ ‌నాయ కులు కూడా పార్టీ మారడం పలువురిని ఆశ్చర్యపరిచిన అంశం. రాజకీయాల్లో తలలు పండిన వీరు ఆ పార్టీలో ఇమడలేక బిఆర్‌ఎస్‌లో చేరారంటే కాంగ్రెస్‌లో వారు ఎంత అవమానానికి, అసంతృప్తికి లోనైనారన్నది అర్థమవుతున్నది.
వీరిద్దరుకూడా బిఆర్‌ఎస్‌ అధినాయకుడు కెసిఆర్‌పైన కత్తికట్టిన వారె. కెసిఆర్‌ అవినీతిపైన ధ్వజమెత్తిన వారు… ఆయనను ఈ ఎన్నికల్లో ఓడించడమే తమ లక్ష్యమని పేర్కొన్న వీరిప్పుడు అదే గులాబి గూటికి చేరిపోయారు. బిఆర్‌ఎస్‌పార్టీ ముఖ్యనాయకులు కెటిఆర్‌, ‌హరీష్‌రావులు వీళ్ళవద్దకు వెళ్ళి మర్యాదపూర్వకంగా తమ పార్టీకి ఆహ్వానించారు. తాజాగా విష్ణువర్ధన్‌రెడ్డి కూడా కారెక్కెందుకు సన్నద్దంగా ఉన్నట్లు మీడియా ముందు తెలిపాడు. తన తండ్రి కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ ప్రెసిడెంట్‌ ‌గా చేసిన స్వర్గీయ జనార్ధన్‌రెడ్డి నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు సేవచేశాడని, తాను పదిహేడు సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని అలాంటి తనను పార్టీ పట్టించుకోవడం మానివేసిందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ, ఆ కారణంగానే తాను కారెక్కాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు.

అలాగే కాంగ్రెస్‌లోకూడా చేరికల పర్వం కొనసాగుతున్నది. కాంగ్రెస్‌పార్టీలో అనేక పదవులు అలంకరించిన కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అలిగి కాషాయ కండువ కప్పుకుని ఆరునెలలు కూడా కాలేదు తిరిగి కాంగ్రెస్‌ ‌గూటికి చేరిపోయారు. అయనతోపాటు బిఆర్‌ఎస్‌ ‌తనను నిర్లక్ష్యం చేసిందంటున్న మోత్కుపల్లి నర్సింహులు, ఏనుగు రవీందర్‌రెడ్డి,ఆకుల లలిత, రేఖా నాయక్‌ ‌లాంటివారు కూడా కాంగ్రెస్‌లో కలిసిపోయారు. నేతి విద్యాసాగర్‌రావు, నీలం మధులు, బిజెపి నుండి కపిలవాయి దిలీప్‌కుమార్‌లు కూడా కాంగ్రెస్‌ ‌గూటికి చేరిపోయారు. ఇదిలా ఉంటే బిజెపిలో ప్రధాన నాయకుల చేరిక మాత్రం తగ్గిపోయింది. బిఆర్‌ఎస్‌నుండి బహిష్కృతుడైన ఈటల రాజేందర్‌ ‌బిజెపిలో చేరి తిరిగి తన శాసనసభ స్థానాన్ని సాధించుకున్న తర్వాత, ఆపార్టీ చేర్పుల కమిటీ చైర్మన్‌ ‌గా బడా నాయకులనెవరినీ చేర్పించలేకపోయాడన్న అపవాద ఉంది. ఏదిఏమైనా ఆయన ఇప్పుడు కెసిఆర్‌పై గజ్వెల్‌లో యుద్దం ప్రకటించిన సందర్భంగా వివిధ పార్టీలనుండి కిందిస్థాయి నాయకులు పలువురు కాషాయ కండువ కప్పుకుంటున్నారు. ఇప్పటివరకు బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌నుండి బిజెపి చేరిన వారిలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డికె అరుణ, వివేక్‌, ‌బూరా నర్సయ్యగౌడ్‌, ‌జితేందర్‌రెడ్డి లాంటి మరికొందరు బిజెపిలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికలు అయ్యేలోగా వీరిలో ఎంతమంది ఆ పార్ట్టీనుండి మారుతారో తెలియదు.

ఒక విధంగా అన్ని పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్ధులను ఖరారు చేశాయి. అభ్యర్ధులంతా ప్రచారంలో తలమునకలై ఉన్నారు. కొద్ది స్థానాల్లో మాత్రమే ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు పార్టీలు మార్చినంత మాత్రాన వారికి టికెట్‌• ‌లభిస్తుందన్న గ్యారెంటీ లేదు. అయినా తమను నిరాదరణకు గురిచేసిన పార్టీకి ఈ ఎన్నికల్లో తమ తడాఖా ఎంటో చూపించాలన్న ఉద్దేశ్యంగా పార్టీ ఫిరాయించిన, ఫిరాయిస్తున్నవారితో ఇతర పార్టీలకు లాభమా, నష్టమా అన్నది మాత్రం ఎవరికీ అంతుబట్టని విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *