అమలులోకి ‘సీఏఏ’

 ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
నోటిఫికేషన్‌ జారీ ..దిల్లీలో పలుచోట్ల  భద్రత కట్టుదిట్టం
తమ రాష్ట్రంలో అనుమతించబోమని ఇదివరకే వెల్లడిరచిన పశ్చిమ బెంగాల్‌ సిఎం మమత

న్యూదిల్లీ, మార్చి 11 : చాలా కాలంగా పెండిరగ్‌లో ఉన్న పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వొచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని పౌరసత్వ సవరణ చట్టం-2019(సీఏఏ) అమలుకు సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సీఏఏ సోమవారం నుంచి అమలులోకి రాబోతుందంటూ కేంద్ర హోమ్‌ శాఖ గెజిట్‌ విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టం 1955కి 2019లో కేంద్రం సవరణ చేసిన సంగతి తెలిసిందే. 2016లో పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. 2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఆమోదం పొందిన బిల్లుకు..ఇప్పటి వరకు కేంద్రం నిబంధనలను ప్రకటించలేదు. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో సీఏఏను ప్రతిపాదించింది. 2019లో కేంద్రం చట్టం చేసింది. ఇప్పుడు అమలు చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయడం గమనార్హం.
లోక్‌సభ ఎన్నికల ముందే ఈ చట్టం తీసుకొస్తామని కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. దేశ విభజన జరిగినప్పుడు పొరుగు దేశంలో వేధింపులకు గురవుతున్న మైనారిటీల కోసం కాంగ్రెస్‌ పార్టీ పౌరసత్వం కల్పిస్తామన్న వాగ్దానం చేసింది.. కానీ అమలు చేయలేదు, చట్టం తీసుకురాలేదని ఆయన అన్నారు. ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలుకు మార్గం సుగమం చేస్తూ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిబంధనలను హోమ్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం రోజు నోటిఫై చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మరియు పాకిస్తాన్‌ నుండి వొచ్చిన హిందూ, సిక్కు, జైన్‌, బౌద్ధ, క్రిస్టియన్‌ మరియు పార్సీ శరణార్థులకు భారత పౌరసత్వం పొందడాన్ని ఈ చట్టం సులభతరం చేస్తుంది. పౌరసత్వం కోసం దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌ మోడ్‌లో సమర్పించబడతాయని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎక్స్‌ వేదికగా తెలిపారు.
పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్తాన్‌లలో హింసకు గురై మన దేశానికి శరణార్థులుగా వొచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం మంజూరు చేయడానికి ఉద్దేశించిన చట్టమే పౌరసత్వ సవరణ చట్టం. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్తాన్‌ల నుంచి వలస వొచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టం అనుమతించినుంది. 2014 డిసెంబర్‌ 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి వొచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు బౌద్ధులు, పార్శీలకు ఈ పౌరసత్వ సవరణ చట్టం వర్తించనుంది.
సీఏఏ నోటిఫికేషన్‌తో దిల్లీలో పలుచోట్ల భద్రత కట్టుదిట్టం
సీఏఏ నిబంధనలను కేంద్రం నోటిఫై చేయడంతో ముందు జాగ్రత్తగా దిల్లీలో పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని చోట్ల పోలీసులతో పాటు పారా మిలిటరీ బలగాలను కూడా మోహరించారు. 2019లో చట్టం అమలులోకి వచ్చిన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. 2020లో సీఏఏ, ఎస్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో దిల్లీలో మత ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.
తమ రాష్ట్రంలో అనుమతించబోమని ఇదివరకే వెల్లడిరచిన పశ్చిమ బెంగాల్‌ సిఎం మమత
ఇక పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం) లేదా ఎన్‌ఆర్‌సి (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌) అమలును తమ ప్రభుత్వం అనుమతించబోదని గురువారమ చెప్పారు. ‘‘మేము సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, లేదా ఉత్తరప్రదేశ్‌ మరియు పశ్చిమ బెంగాల్‌ విభజన రాజకీయాలను లేదా మానవ సమాజాన్ని విభజించే తప్పుడు రాజకీయాలను లేదా హిందువులు మరియు ముస్లింలను విభజించే తప్పుడు రాజకీయాలను అనుమతించము. మేము దీనిని అంగీకరించము.’’ అని ఆమె తన ప్రకటనలో వెల్లడిరచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *