- 40 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ లో డిమాండ్
- బీఆర్‌ఎస్ లో ముందుకొస్తున్న ‘వెనకబడిన’ నేతలు..
- బీజేపీలో కీలక పదవులతో వోటర్లకు ఎర..
అధికారంలోకి రావాలంటే బిసి మంత్రం అనివార్యంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఆ సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. పార్టీల గెలుపు ఓటములను శాసించే స్థాయిలో రాష్ట్రంలో బిసి జనగణన ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీరంతా భిన్నాభిప్రాయాలతో విభిన్న పార్టీల్లో మనుగడ సాగిస్తున్నారు. వీరందరినీ ఐక్యంచేసే విషయంలో రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కోటీ 39 లక్షల మందికి పైగా వోటర్లు ఉన్నట్లు ఓ అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న వీరి వోటు బ్యాంకును తమవైపుకు తిప్పుకునే ఎత్తుగడల్లో పార్టీలున్నాయి. ఇదిలా ఉంటే వాస్తవంగా రాజకీయ పార్టీల్లో బిసి లకు తగిన ప్రాధాన్యత లభించడంలేదని చాలా కాలంగా ఆ సామాజిక వర్గానికి చెందని పలువురు ఆందోళన చేస్తూనే ఉన్నారు. బిసి జనాభాను బట్టి సీట్ల కేటాయింపు ఉండాలంటూ దాదాపు ప్రతీ ఎన్నికల సమయంలో వారు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా మరో నాలుగు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగనుండగా మరోసారి బిసిల డిమాండ్ తెరమీదకు వొచ్చింది. వొచ్చే ఎన్నికల్లో తమకు కనీసం 40 స్థానాలనైనా కేటాయించాలని కాంగ్రెస్‌లోని బిసి వర్గాలు ఇప్పటి నుండే డిమాండ్ చేస్తున్నాయి. ఒక్కో లోకసభ పరిధిలో కనీసం మూడు శాసన సభ స్థానాలను తమకు కేటాయించాలంటున్నారు. అందుకు అవసరమైతే జనరల్ స్థానాల్లో కూడా బిసిలకు అవకాశం ఇవ్వాల్సిందేనంటున్నారు. ఇంత కాలంగా అగ్రవర్ణాలకే పెద్ద పీట వేస్తున్నారని, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంపైన వారు విరుచుకుపడుతున్నారు. పోనుపోను కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్‌గా మారుతున్నదంటూ వారు చేస్తున్న ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కులాలపోరు సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరంతా టీమ్ ఓబిసి పేరిట ఒక గ్రూపుగా ఏర్పడి, ఉదంపూర్ డిక్లరేషన్‌ను అమలు పర్చాలని డిమాండ్ చేస్తుండగా ఎస్సీ, ఎస్టీ నాయకులు కూడా జనరల్ సీట్లపైన దృష్టిపెట్టడం గమనార్హం. గత ఏడాది మే నెలలో ఉదంపూర్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
అందులో ఎస్సీ, ఎస్టీ, బిసీలతోపాటు ఇతర అణగారిన వర్గాలవారికి సమాన ప్రాధాన్యం కలిగించాలని తీర్మానించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే ఒక కుటుంబానికి ఒకే టికట్ అన్న ఫార్మూలాను కూడా ఆనాడు ఆమోదించడమైంది. అంతేగాక కుటుంబంలో మరొకరు రాజీకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ అయిదేళ్ళ తర్వాతే అతనికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందన్నది కూడా ఆనాటి డిక్లరేషన్‌లో పొందుపర్చారు. దీన్ని బట్టి సీట్లను కేటాయించాలని వారంటున్నారు. గత ఎన్నికల్లో బిసిలకు సీట్లు కేటాయించినప్పటికీ వారిని పార్టీ గెలిపించుకోలేకపోయిందన్న అపవాదు కూడా ఉంది. అందుకే కేటాయించిన స్థానాలను గెలిపించుకోవాల్సిన బాధ్యతను కూడా పార్టీ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బిసిలను అవమానించే విధంగా మాట్లాడాడంటూ అధికార బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన బిసి నాయకులంతా రేవంత్‌రెడ్డితో పాటు, కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే అదనుగా బిసిలను ఆకట్టుకునే కార్యక్రమాన్ని బిఆర్‌ఎస్ చేపట్టింది. తాజాగా బుధవారం రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కార్యాలయంలో బిసి మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, పలువురు ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ సంస్థల చైర్మన్‌లు, ఇతర ప్రజాప్రతినిధులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. గడచిన తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం బిసిల కోసం చేపట్టిన పథకాలు, చేకూరిన లబ్ధి, విధానాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని ఆ సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంతోపాటు, అన్ని జిల్లాల్లో బిసి గర్జన సభలను నిర్వహించాలని కూడా సమావేశం అభిప్రాయపడింది. బిసి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న బిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విషయంలో అనుసరించాల్సిన విధానలపై మరింత సుదీర్ఘంగా చర్చించేందుకు ఈ నెల 25న మరోసారి సమావేశం కావాలని, ఇందులో బిసికి చెందిన 93 కుల సంఘాల నేతలను ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు.
ఇకపోతే బిజెపి కూడా అదే ఆలోచనలో ఉంది. తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేయాలంటే ఇక్కడ అధికంగా ఉన్న బిసి సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న లక్ష్యంగా ముందుకు పోతున్నది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి అక్కడ ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ బిసిలకు కేటాయించడమేన్న విషయాన్ని బిజెపి పరిగణలోకి తీసుకునే అవకావం లేకపోలేదు. ఇప్పటికే ఆ పార్టీ ఆ ఆలోచనపై ఫోకస్ పెట్టిందనే చెప్పుకోవాలె. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌కు, ఇప్పటికే ఉన్న చేర్పుల కమిటీ చైర్మన్ పదవికి తోడు కీలకమైన ఎన్నికల కమిటి చైర్మన్ పదవిని కూడా బిజెపి అప్పగించింది. అలాగే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆ పారీ్ట రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌కు జాతీయ స్థాయిలో కీలకమైన పార్లమెంట్ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్కుడిగా, ఎన్నికల జాతీయ కమిటీలో చోటు కల్పించారు. అయితే అంతకు ముందే ఇదే సామాజిక వర్గానికి చెందిన ఎంపి బండి సంజయ్‌కి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవిని కట్టబెట్టినప్పటికీ ఏం కారణంతోనో ఆ పదవినుండి తొలగించారు. అయినా కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.. దీనికి తోడు ఎస్సీ, ఎస్టీల వోట్లపైన కూడా బిజెపి దృష్టి సారించింది. ఇప్పటికే ఎంఆర్‌పిఎస్ అధినేత మంద కృష్ణ మాదిగతో ప్రధాని మోదీ ఒకసారి సమావేశం కావడం మరో కీలక పరిణామం. మొత్తం మీద అన్ని పార్టీలు రాష్ట్రంలో అధిక జనాభా గల బిసి వోటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.




