అస్తిత్వం, నిర్ధారిత స్థానమంటూ లేని అభౌతిక తత్వం ఆత్మ. దేహంలో అతి చైతన్యవంతమైన లోపలి శృతమేదో అనుక్షణం మనల్ని పథగాముల్ని చేస్తున్నట్టు జాగ్రత్తగా అవలోకిస్తే తెలుస్తుంది. భౌతిక స్వభావం లేని అనైరూప్య చర్య వింతగా, అరూపక్రియగా, అవ్యక్తానుభవంగా ఆత్మానుగతమైన అతిసూక్ష్మ గమనింపుగా అనుభూతించాలి. ప్రతిమనిషికి రెండు ప్రపంచాలుంటాయి. ఒకటి తనకు మాత్రమే చెందిన తనలోని గుప్త ప్రపంచం, రెండవది అందరికీ చెంది అందులో తాను కేవలం ఒక పాత్రగా మాత్రమే జీవిస్తున్న అందరి ప్రపంచం. నిజానికి బహుళ అనుభూతులకు ఆత్మసాక్షి కవిత్వం. మనిషి జీవిస్తూ పొందే రహస్యోన్మీలన, రసోన్మీలనలను రంగరించి రామాచంద్రమౌళి అందించిన కవిత్వమే ఆత్మ.
కాలిబాటన నడిచి వెళ్ళే మనిషికి ప్రకృతిని గర్భీకరించుకున్న గ్రామం అసలైన ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతుందన్నారు. ఆకాశానికి వేలాడే సూర్యుడు, చంద్రుడు, నిరంతరం గాలిలో ఎగిరే పక్షి, మట్టిగోడపై నుండి రాలిపడే ఎండిన పిడుకను ప్రతీకలుగా చేసి ప్రతిచర్యకు హేతువులుగా చూపారు. అర్థమిధ్య, అర్థ సత్యాలుగా సైడ్ మిర్రర్‌లో కన్పిస్తున్న దృశ్యాలు నీడలు, వెలుగులై విరుగుతూ, రాలిపోతూ, చిట్లిపోతున్నాయన్నారు. ప్రతిఘటించే ఆమె గాయాలను తలపోసి కన్నీళ్ళే మాన్పుతాయా అని ప్రశ్నిస్తారు. శాస్త్ర రహస్యాన్ని తెలుసుకుని పచ్చని జీవపరిమళాన్ని ఆస్వాదించమన్నారు. పెరుగుతున్న సాంకేతికతతో నిరంతర కాలుష్య దుర్గంధ స్రావం ప్రవహించి మనిషి ఊపిరాడక అంతరించిపోతున్నాడని వేదన చెందారు.
నీకు నువ్వు మృత నక్షత్రానివి కావని గ్రహించిన రోజు జలపాతోధృతిని తట్టుకుంటావంటారు. మనిషిలోకి మనిషి దిగడమంటే సముద్రంలోకి దిగుతున్నావని తెలుసుకొమ్మంటారు. శరీరం ఒక ప్రాణ సంహిత అయితే హృదయం కాంతిపుటల యోగ సంపుటవుతుందని చెప్పారు. జీవితమంతా నడిచీనడిచీ అసలు నడవాల్సిన దారేదో బోధపడడం లేదంటారు. తక్కువ జన్మించడాలు, లెక్కకు మిక్కిలి మరణించడాలు అని కొన్ని నగరాలు… మరికొన్ని రాత్రులను విశ్లేషించారు. ఖాళీ తనమే (Emptiness) నిజమైన జీవితమని పక్షికి తెలుసన్నారు. కరోనా కాటుకు ప్రపంచం మృత్యులోయలో స్తంభిస్తూ కూలిపోయిందని, చావుకు ప్రాంతీయభేదం లేదని చెప్పారు. ప్రతి యుద్ధంలోనూ అసలు యుద్ధం జరగక ముందే గెలుపు నిర్ధారింపబడుతుంది అన్న ఆలోచనాత్మక అంశాన్ని మరణ రహస్యం కవితలో చెప్పారు. శత్రువుతో యుద్ధం చేయకుండానే గెలవడం అత్యున్నతమైన యుద్ధకళ అంటారు. అగ్రాధిపత్య యుద్ధవ్యూహంలో ప్రపంచ ప్రజలంతా ప్రాణాలప్పగించి మౌనంగా మరణిస్తున్నారని చెప్పారు. పిడికెడు నిద్రని వర్షించమని ఒక నిర్వ్యాపక రాత్రిని అర్థించారు. జీవితం ఒక్కోసారి మిణుకు లాంతరులా, మరోసారి అగ్గిపుల్ల మంటలా ఉంటుందని చెప్పారు. జన్మను ప్రపంచంలోకి ప్రవేశించే అవకాశంగా చూపారు. నాన్నను నదితో పోల్చారు. ప్రాణ, జ్ఞాన స్పృహ అవసరమని తెలిపారు.
అన్నం గిన్నె మన తెలంగాణ కవితలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ఎలా ఎదురొడ్డి నిలబడ్డదో వివరించారు. మనిషి ప్రతిరోజూ పదే పదే చచ్చి మళ్ళీ తిరిగి పుడుతున్నాడని సంక్లిష్ట సమాజాన్ని తలపోస్తూ వేదన చెందారు. ఏకత్వ భిన్నత్వ భిన్నతల మీ మాంసలు/ రిక్తతల అరిక్తతల నడుమ శూన్యరేఖ/ ఎక్కడి నుండో రావాల్సిన వన్‌టైమ్ పాస్‌వర్డ్ – OTP కోసం నిరీక్షణ అంటూ జీవిత కృత్యాద్యవస్థను తెలిపారు. రాజకీయం అరాచకీయంగా మారిందంటూ మొద్దు నిద్రలోనే సమాధై శాశ్వతంగా మరణిద్దామా లేక కళ్ళు తెరుద్దామా అని ప్రశ్నిస్తారు. మహాకవి సినారెను తన నిత్య జ్వలిత కవితాస్ఫూర్తిగా చెప్పుకున్నారు. మనిషి ఒక ఆయుధమై ఆకాశమెత్తు లేచి నిలబడి తనను తానే రక్షించుకునే పరిస్థితిని తెలిపారు. సమయం మించి పోతున్నందున అగ్ని చికిత్సతో ప్రక్షాళించాలని చెప్పారు.
వలస కూలీలు నిశ్శబ్దంగా దుఃఖిస్తూనే గుండెల్లో రాచపుండును మోస్తూ విరామమెరుగక నడుస్తూనే ఉన్నారని తెలిపారు. నీ నుండి నువ్వు ఒక్కసారైనా నిర్గమించలేనప్పుడు మెల్లమెల్లగా మరణిస్తుంటావని మనిషిని హెచ్చరించారు. పరిమళ నిశ్శబ్ద సంగీతాన్ని ప్రాతః దేవత రాకతో విన్నారు. రాతి నేలలో నుండి ఒక మొలకలా అంతిమంగా మనిషి మళ్ళీ వికసించి పొలిమేరలోని మట్టిలో వరిమొక్కై పల్లవించాలంటారు. ఒంటరి రాత్రి నిద్రను మింగేసి ముంచుకొచ్చిన దుఃఖాన్ని జీవన గతులకు జతచేసి విశ్లేషించారు. భూమి చెప్పే పరమ పాఠాలను మనిషి గ్రహించాలన్నారు. దేహమే ఎన్నడూ మానని గాయమని జీవితమంతా నడుస్తూ నడుస్తూ అన్న కవితలో తెలిపారు. రక్తసిక్త పాదాలను మళ్ళీ సంధించేందుకు లోపల ఏదో దహించబడ్తోంది అన్నారు. జీవిత వినిర్మాణ రహస్యాన్ని పిల్లలకు విడమర్చి చెప్పారు.
హైదారాబాదీని ముత్యపు చిప్పలో వర్షించిన స్వాతి చినుకై ఆ మహోన్నత నగర వాసిగా పులకించిపొమ్మన్నారు. పీవీని మౌనయోగిగా, సంస్కరణల రూపశిల్పిగా అభివర్ణించారు. ముగింపు ఎప్పుడూ మరో ఆరంభానికి ఆదిబిందువని చెప్పారు. అర్థంకాని విమోహ సంవేదనలే రహస్యమన్నారు. మేడిపండు పగిలిన తర్వాత గుడిసెల్లో కొత్త సూర్యోదయం కావాలిక అని ఆకాంక్షించారు. కరోనా లాక్‌డౌన్‌లో ఒకప్పుడు రణస్థలి అనిపించే ఇల్లు సురక్షిత గృహంగా మారిందని ఇంట్లో ఉన్న మనిషంటే కరోనాకు చచ్చేంత భయమని అన్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో కార్పోరేట్ ఆస్పత్రులు బాధితుల దుఃఖ దాహాన్ని శ్వాసిస్తూ బుస కొడుతుంటే రాజ్యాంగం ఘోషించే విద్య, వైద్యం, న్యాయం ప్రాథమిక పౌర హక్కులేమయ్యాయని ప్రశ్నించారు. తలనిమిరే రెండు చేతుల ఆప్యాయతను కోరుకున్నారు. రణమో… మరణమో వీరునికి రెండే లక్ష్యాలని చెప్పారు. అత్యాధునికుడు కాలాన్ని తనవెంట కుక్కపిల్ల వలె నడిపించుకు వెళ్తున్న ఋషి అంటారు. ఎప్పుడూ ఉజ్వలించే శక్తిచ్ఛక్రమే ధరణి అన్నారు. దుఃఖ మూలాన్ని మనిషి కనుక్కోవాలన్నారు.
మనలోపల నిండడం, ఖాళీ కావడమే జీవితమని చెప్పారు. జీవితమంటే ఒక ఉత్సవమని గమనించమంటారు. తపోముద్రల వెనక రహస్యాల్ని శోధించమని చెప్పారు. నిర్విరామ అవిశ్రాంత పోరాటంలో ప్రతి మనిషి ఒక నిప్పుకణికే అన్నారు. నిశ్శబ్ద మృత్యుగృహలాంటి ఆస్పత్రిలో ఆమె నిస్సహాయంగా మృత్యువుతో యుద్ధం చేస్తూ గాజు పలకపై నీటి బిందువై జారిపోతుందని చెప్పారు. రెక్కలు మొలువని పక్షికూనల కువకువలతో ప్రకృతి మాతృ పరిమళంతో పులకించి పోతోందన్నారు. ఇంకొకరోజు నీ కోసం ఉందని మర్చిపోకని చెప్పారు. సుడిగాలిలో సుళ్ళు తిరుగుతూ ఎగిరిపోతూ మనిషి ఒక చిత్తుకాగితం అన్నారు. నువ్వు icon వే కావచ్చు కాని/ ఒక నాటికి Delete చేయబడ్తావు తప్పక అంటూనే సత్యమొక్కటే సత్యం అని చెప్తారు. పాలకుడెప్పుడూ గరళ కంఠుడే కావాలె/ లేకుంటే కొట్టుకుపోతాడు పిపీలికమై అని కుండబద్ధలు కొట్టారు. అంతః చేతనలోకి, అర్థ సుషుప్తిలోకి ఒక తెగిన బొక్కెనలా జారిపోతుంటావు నువ్వు అని ఆలోచింపజేస్తారు. అన్నీ కోల్పోయిన తర్వాత మిగిలే ఒట్టి ఖాళీ ధనావేశమే అంటూ ఆ ఖాళీ ఎప్పటికైనా నింపబడి స్పృహగా పిలువబడుతుందన్నారు.
పర్వతాన్ని స్పృశిస్తూ ప్రవహించే నదికీ, నీటికీ మట్టికీ మధ్య అంతః సంబంధం ఏమిటని ప్రశ్న వేశారు. లోపలి నిశ్శబ్ద హృదయోత్పాతంతో ఏదో వెలిసి పోతుంది అంటారు. ప్రజాకవి కాళోజీ దుః ఖించిన అశ్రుజీరలో ఎంతో నిఖార్సైన చిక్కని కవిత్వముందని చెప్పారు. ప్రపంచ పేదలంతా నిర్వాసితులేనని తెలిపారు. అతి వికృత పుతిన్ ముఖ చిత్రంలో యుద్ధ ముఖాన్ని విశ్లేషించారు. చిన్న చిర్నవ్వు చాలు ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవడానికి అని చెప్పారు. పోగొట్టుకున్న పుస్తకం దొరికినప్పుడు ప్రాణం మళ్ళీ ప్రాణదీపమై ప్రకాశిస్తుందన్నారు. పిడికెడు పిట్టకున్న స్వేచ్ఛ మనిషికి ఎక్కడిదని అన్నారు. శాంతిపతాకాన్ని ఈ ప్రపంచాకాశంలో ఎగరేసిన ఆఖరు యుగకర్త గాంధీ అన్నారు. దూరాలన్నీ పొగమంచులా అంతరించిపోతున్నా పాదాలు నడుస్తూనే ఉంటాయని చెప్పారు. చిటికెడు సహనాన్ని సహజ నిరంతర నిర్మాణ క్రియ అన్నారు. మనం వంతెనలను నిర్మించాలి/ కాని గోడలను కాదంటారు. హృదయం ఒట్టి అగ్ని, హిమాగ్ని అని, కళ్ళంటే ఆకాశాలని తేల్చి చెప్పారు. అంతిమంగా కొన్ని ఖడ్గ ప్రహారాలు, కొన్ని శిథిల శబ్దాలు అంటూ పురోగమనం తిరోగమన రూపంలో కూడా ఉంటుందని తెలిపారు. అస్తమయా ఉదయానికి ముగింపు కాదు / ఉదయానికి మరో ఉదయ బీజమే అన్నారు. ఈ కవిత్వం బహుళ అనుభూతుల ఆత్మసాక్షి.
– డా. తిరునగరి శ్రీనివాస్
8466053933




