వైటీపీఎస్‌ యూనిట్‌-1 జాతికి అంకితం

నల్గొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 1: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(వైటీపీఎస్‌)లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్‌-1ని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లో కలిసి శుక్రవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్లాంటుకు మూడు కిలోమీటర్ల దూరంలో దుబ్బతండా వద్ద రూ.970 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పవర్‌ ప్లాంట్‌ ఉద్యోగుల ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ విద్యుత్‌ కేంద్రాన్ని పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఇంధన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌, జెన్‌కో సీిఎండీ డాక్టర్‌ హరీష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు. జనవరిలో యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ను పూర్తిగా జాతికి అంకితం చేస్తామని, ఇది నాలుగు మెగావాట్ల విద్యుత్‌ అవసరాలు తీర్చే మంచి కార్యక్రమమని భట్టి చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనుల్లో రెండేళ్ల జాప్యం జరిగిందని విమర్శించారు. పవర్‌ ప్లాంట్‌ ప్రాంత ప్రజలకు ఉచితంగా విద్య, వైద్య సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 15లోగా యాదాద్రి, పులిచింతల భూ నిర్వాసితులకు ఉద్యోగాలు, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అందజేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *