ప్రపంచానికి మోదీ ఇచ్చిన బహుమతి యోగా
అందరూ ఆచరించి ఆరోగ్యవంతులు కావాలి
కౌంట్‌డౌన్ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది.. మన కుటుంబం, సమాజం, ప్రపంచం బాగుంటుంది.. యోగానే మనకు ప్రథమ వైద్యుడు.. యోగా సర్వరోగ నివారిణి అని కేంద బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా అని చెప్పారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో వేడుకలు జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యోగా 24 గంటల కౌంట్ డౌన్ వేడుకలను ఎల్బీ స్టేడియంలో శుక్రవారం మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో యోగాను గుర్తించి, ఆచరిస్తున్నాంని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన అంశమని కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. రేపు (శనివారం) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలుగు నేల విశాఖపట్నంలో 5 లక్షల మందితో కలిసి యోగాలో ప్రధాని పాల్గొననున్నారని తెలిపారు. ఇది తెలుగు ప్రజలు గర్వించాల్సిన విషయమంటూ యోగాతో జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయని యోగాను ప్రతిఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కారక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు యోగాసనాలు వేశారు.





