ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు
హైదారబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: హైదరాబాద్‌లో ఐదారు సంవత్సరాలుగా పెద్దఎత్తున అంతర్జాతీయ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈసారి కూడా ఈనెల 21న యోగా జేఏసీ అనే సంస్థ యోగా వేడుకల కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో 24 గంటల ముందు కౌంట్ డౌన్ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు , ఈ వేడుకల్లో ప్రముఖ యోగా సంస్థలు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు భాగస్వామ్యమవుతున్నాయని, ముఖ్య అతిథులుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, పార్లమెంటు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, కృష్ణయ్య, ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ఎన్జీవోలు, డిఫెన్స్, పారా మిలిటరీ అధికారులు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. యోగాకు సంబంధించిన ఆర్గనైజేషన్స్ అసోసియేషన్ సభ్యులు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ, సినీ ప్రముఖులు మీనాక్షి చౌదరి, సాయి ధరమ్ తేజ్, తేజ పాల్గొంటారని కూడా తెలిపారు. అన్ని యోగా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖల తరఫున 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖలో యోగా వేడుకల్లో స్వయంగా పాల్గొంటారని వివరించారు.
ఏర్పాట్లు పరిశీలించిన కిేషన్ రెడ్డి
అంతర్జాతీయ యోగా దినోత్సవం-2025ను పురస్కరించుకుని ఎల్బీ స్టేడియంలో 20న ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే 24 గంటల కౌంట్‌డౌన్ వేడుకలకు భారీ ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో మంత్రి కిషన్ రెడ్డి స్టేడియాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. కార్యక్రమ నిర్వహణ, భద్రత, సదుపాయాలు, వేదిక ఏర్పాట్లపై అవసరమైన సూచనలు చేశారు.



