తెలంగాణ తేజస్సుకు ప్రతిబింబం‘ యాసంగి ముచ్చట్లు ‘

( హనుమకొండ,వాగ్దేవి డిగ్రీ,పీజీ కళాశాల సెమినార్ హాల్ లోనవంబర్ 16, ఆదివారం పొద్దున 9.30 ని లకు  డా.వాణి దేవులపల్లి ‘ యాసంగి ముచ్చట్లు ‘ పుస్తకావిష్కరణ సందర్భంగా..పుస్తకం ముందు మాట లో కొంత భాగం )

1968 మొదలు 2014 వరకు ఆగుతూ సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా ‘సంస్కృతి’ అంటే సంప్రదాయాలు, విశ్వాసాలు, అలవాట్లు, ఆచార వ్యవహారాలు, పండుగలు, అంగడి- జాతర్లుగానే మెజారిటీ సమాజం భావించడం జరిగింది. ఈ ప్రచారానికే ప్రాచుర్యముండింది. అయితే ఇదే ఉద్యమం 1995 తర్వాత భిన్న పాయలుగా సాగింది. కేవలం భౌగోళిక రాష్ట్రం కోసమే గాకుండా ప్రజాస్వామిక, సామాజిక, బహుజన, బంగారు ‘తెలంగాణ” కోసం కూడా జరిగింది. చిన్న రాష్ర్టాలకు మార్గదర్శి అంబేడ్కర్‌ ఆలోచనలు అని చెప్పుకున్నారు. అంబేడ్కర్‌ మార్గమే తెలంగాణ మార్గము అని దాదాపు అందరూ నినదించారు. శ్రీకృష్ణ కమిటీ ముందు వాదనలు వినిపించారు. ఇట్లా ఈ ఆలోచనలకు అనుగుణంగా (ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధాన పాయగా హేతుబద్ధత, తార్మికత, స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం, త్యాగం, ఘనత,ప్రతిభ, వైతాళికులు, సాహిత్యం అనే భావన పెంపొందింది. ఇది భిన్న సామాజిక వర్గాల వారిని ఒక్కతాటి మీదికి తీసుకువచ్చే ‘సంస్కృతి”గా పరిణామం చెందింది. ‘బతుకమ్మ, బోనాలు” సమిష్టి ఆచారాలుగా వాసికెక్కాయి.

“నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదానికి తోడు ఈ పై అంశాలన్నీ కలగలిసిన ఆత్మగౌరవ భావన ఇరుసుగా పనిచేసింది. సురవరం ప్రతాపరెడ్డి చెప్పినట్టు ‘మనమూ చరిత్రకెక్కదగ్గవారమే’ అని నాలుగు కోట్ల తెలంగాణ జనం గానం చేసిండ్రు. ఈ ఘనతను, వైభవాన్ని అక్షరబద్ధం చేసిన 78 మంది కవుల కవిత్వాన్ని ‘యాసంగి ముచ్చట్లు’  పేరిట తెలంగాణ తల్లికి భిన్న తోటల నుంచి, భిన్న కాలాల్లో ఏరిన మంచి పుష్పాలను మాలగా అల్లి అర్పిస్తున్నారు దేవులపల్లి వాణీ దేవి.  వాణి అంటే గాత్రమే గాదు సాహిత్యము, సంగీతమూ మేళవించిన మేల్కొలుపు. అంతేగాదు యాది, మనాదితో పాటు సకలాధిపత్య ధిక్కారం అని చెబుతున్న సంకలనమిది.

ప్రస్తుతం ఇక్కడి పాలకవర్గాలు ‘జై తెలంగాణ” అని నినదించడానికే సంశయిస్తున్నాయి. పోరాటం, త్యాగం నొప్పి తెలియని కుప్పమీద పొర్లి వీరికి మనం నడిచొచ్చిన తొవ్వలో మన కాళ్లకు, హృదయాలకు గుచ్చుకున్న ముండ్ల బాధను చూపించాలి. ఈ ముండ్లు ఎవ్వరు పరిచిండ్రో కూడా ఎరుకతో ఉండాలి. అట్లాగే తమను తాము ఆహుతి చేసుకున్న శ్రీకాంతచారి, యాదయ్యల ‘జై తెలంగాణ’ నినాదాన్ని మళ్ళీ మళ్ళీ వినిపించాలి. ఆత్మగౌరవం కోసం కాళోజి మొదలు కొండా లక్ష్మణ్‌ బాపూజీ, జయశంకర్‌ సారు వరకు ప్రోది చేసిన చైతన్యాన్ని కాగడాగా వెలిగించాలి. ఆరిపోకుండా చూడాలి. తెలంగాణ కోసం కొట్లాడిన  సకల మానవులను సమున్నతంగా నిలబెట్టాలి.

అయితే ఈ త్యాగాలకు ఇవ్వాళ గుర్తింపు లేకుండా పోయింది. తెలంగాణ అమరవీరుల స్మారక క్షేత్రం పాడుపడి పోతోంది. తెలంగాణ తల్లి నగలన్నీ దోచుకున్నరు. దివాలా  తీసిన బోసిపోయిన తల్లిని ప్రతీకగా చూపిస్తున్నరు. జీవం తీసేసిన తెలంగాణ పాటను రాష్ట్రగీతంగా మార్చి మరింత అవమానిస్తున్నరు. అంతెందుకు విభజన జరిగిన పదేండ్ల తర్వాత మళ్ళీ పదో షెడ్యూల్‌ సంస్థల పునర్విభజన కుట్రలకు కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ కోసం తెరలేపింది. తెలంగాణ పట్ల సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నది. ఇట్లాంటి సమయంలో మళ్ళీ మన మూలాల్లోకి వెళ్ళి మనల్ని మనం పునరుజ్జీవింపచేసుకోవాలి. తెగువకు పదును పెట్టుకోవాలి. అందుకు ఈ సంకలనం ఒక దరి. దగ్గరి దారి. ఆయుధం కూడా!

ఎనుకట వద్దనుకున్న విగ్రహాలే ప్రభుత్వాలు తెలంగాణ గుండెల మీద గునపాలుగా రోశయ్య, ఎన్టీఆర్‌ల పేరిట నిలబెడుతున్న ప్రస్తుత సందర్భంలో ఈ సంకలనం నిద్రబోతున్న సమాజాన్ని తట్టి లేపుతున్నది. తట్టినా లేవనోణ్ణి తన్ని లేపమని చెబుతుంది.తెలంగాణ ఘనతను, జ్ఞానాన్ని, చరిత్రను, సంస్కృతిని, చైతన్యాన్ని, వైతాళిక పరంపరను, త్యాగనిరతిని  ఎనుకటి ఎతలను, అధిగమించిన అవరోధాలను, ఖ్యాతికెక్కిన కళలను, ధిక్కార గొంతుకను ఈ సంకలనంలో విద్వన్మణి వాణీదేవి గారు ఒక్కదగ్గరికి తెచ్చారు.

దేవులపల్లి-వాణీదేవి. ఈ “యాసంగి ముచ్చట్లు” కవిత్వపంటలో గతంలో వెలువడ్డ  అన్ని సంకలనాల్లో కన్నా ఎక్కువ మంది కవయిత్రులకు చోటు దక్కింది. ఆకాశంలో సగం అని చెప్పడం కాదు. అక్షరాల్లోనూ మహిళలు సగం అని నిరూపించిన సంకలనమిది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 45 మందికి పైగా కవయిత్రులు ఇందులో ఉన్నారు. ఇది సగానికన్నా ఎక్కువ. రంగరాజు పద్మజల లాంటి సీనియర్‌ కవయిత్రులకు ఇందులో చోటు దక్కింది.ఇంతకుముందే చెప్పుకున్నట్లు దాశరథి కృష్ణమాచార్య మొదలు ఇష్రత్  సుల్తానా వరకు మొత్తం 78 మంది కవులు తెలంగాణ వైభవాన్ని ఇందులో గానం చేసిండ్రు. ఘనతను చాటి చెప్పింన్రు.  నడిచొచ్చిన తొవ్వను యాది చేసుకున్నరు.  లబ్ధప్రతిష్టులైన కవులు మొదలు బెత్సాహికుల వరకు, ఆదిలాబాద్‌ నుంచి పాలమూరు వరకు అన్ని జిల్లాలు, అన్ని వర్గాలు, పాత-కొత్త, యువ-వృద్ధ, హిందూ-ముస్లిం, (స్త్రీ-పురుష ఇట్లా అందరూ భిన్న మార్గాల్లో తెలంగాణ కేంద్రంగా కవిత్వాన్ని అల్లిండ్రు. ఆత్మల్ని ఆవిష్కరించిండ్రు. ప్రతి కవీ తనదైన పంథాలో తెలంగాణ బెన్నత్యాన్ని, ఖ్యాతిని అక్షరాల్లో రికార్డు చేసిండు.

తెలంగాణ తల్లి గురించి ఘనంగా చెప్పిన వారిలో ముందువరుసలో పేర్కొనాల్సింది దాశరథిని. ఆయన 1949 ఆప్రాంతంలో రాసిన గేయంతో ఈ సంకలనం (ప్రారంభమయింది. “నా తెలంగాణ తల్లి; కంజాతవల్లి” అని రాసిండు. తెలంగాణ  ప్రభుత్వ ‘దాశరథి’ అవార్డుని అందుకున్న తిరునగరి (రామానుజయ్య) తెలంగాణ మనిషి ఫిత్‌రత్‌ని అక్షరబద్ధం చేసిండు. ఇక్కడి పౌరుడి పౌరుషాన్ని, దయార్ద్ర హృదయాన్ని ఏక కాలంలో ఇట్లా రికార్డు చేసిండు.

“నలుగురినీ వెలుగులోకి

నడుపును తెలంగాణ బిడ్డ

పౌరుషమ్ము ఉన్నవాడు

వంచకులకు సింహమురా

కారుణ్యము ఉన్నవాడు

ఆర్తజనుల బంధువురా” అన్చాడు. ఈ వాక్యాల్లో కవిత్వం కన్నా హృదయం కనబడుతుంది.  తెలంగాణ భాష గురించి ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనాలి. ఈ సంకలనంలోని మెజారిటీ కవులు తెలంగాణ భాషా మాధుర్యాన్ని అక్షరాల్లో తల్లికి నైవేద్యంగా సమర్పించారు. ఎన్ని చెప్పుకున్నా  తెలంగాణ శత్రువులు మన వేలితోనే మనకన్నును పొడిపించే ప్రయత్నం చేస్తారు. జాగరూకతతో లేకుంటే మనమూ బలయ్యే ప్రమాదమున్నది. ఈ ప్రమాద ఘంటికలు తెలుగు” భాష పేరిట మన మీద కత్తిలా వేలాడుతున్నది. తెలంగాణ భాషను, యాసను కాపాడుకోవాల్సిన అవసరమున్నది. పాఠశాల స్థాయి నుంచే ఒక ప్రామాణిక తెలంగాణ భాషలో బోధించాల్సిన అవసరమున్నది. పరాయి వారి భజన మాని మన బెన్నత్యాన్ని ఘనంగా చాటి చెప్పాల్సిన అవసరమున్నది. ప్రాణాలు త్యాగం చేసి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన హక్కులకు భంగం కలిగితే నిలదీసే సత్తువ కావాలి. ప్రశ్నించడమే గాదు జవాబులు చూపించాలి. నిర్భయంగా నిజాన్ని చాట గలగాలి. అందుకే ఇందులో కాళోజి చెప్పిన కవిత సదా స్మరణీయం. అదిలా ఉన్నది.

“దోపిడి చేసే ప్రాంతేతరులను

దూరం దాకా తన్ని తరుముతం

ప్రాంతం వాడే దోపిడి చేస్తే

ప్రాణంతోనే పాతర వేస్తం” అని కాళోజి దారి చూపించిండు. ఆ దారిన కవులు నడవాల్సిన సందర్భమిది. ఈ సందర్భంలో అవసరమైన “యాసంగి ముచ్చట్లు’ని తరాల అంతరాలు లేకుండా అందించిన వాణీదేవి గారికి అభినందనలు. ఈ మాట రాసే అవకాశమిచ్చినందుకు వారికి శనార్తులు.

డా. సంగిశెట్టి శ్రీనివాస్‌

తేది: 07-11-2025

హైదరాబాద్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *