– యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 31: ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులందరూ వేగవంతంగా పూర్తి చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు లబ్ధిదారులకు సూచించారు. డబ్బుల మంజూరు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి సోమవారం మీ ఖాతాలలో డబ్బులు జమ అవుతుంటాయని తెలిపారు. భువనగిరి మండలం హన్మాపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి, అవి ఏ దశలో ఉన్నాయని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పనులకు సంబంధించిన మెటీరియల్‌ను కూడా తక్కువ ధరలకు ఇచ్చేందుకు ప్రతి మండలంలో కమిటీలు వేశామని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఇంటి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.





