– కోల్డ్ రిఫ్ మరణాలతో కేంద్రం అప్రమత్తం
– తయారీ కంపెనీలకు అల్టిమేటమ్
న్యూదిల్లీ,నవంబర్10: జనవరి ఒకటి నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని ఔషధ తయారీ సంస్థలను కేంద్రం ఆదేశించింది.ఔషధ తయారీసంస్థలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్ధరించుకోవాలి. ‘కోల్డ్‌రిఫ్’ దగ్గు మందు వల్ల మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ‘కోల్డ్‌రిఫ్’ దగ్గు మందు వల్ల ఆయా రాష్ట్రల్లో పలువురు చిన్నారులు మృతి చెందిన ఘటన కలకలం సృష్టించిన నేపథ్యంలో సోమవారం ఔషధ తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చింది. లేకపోతే కంపెనీలు మూసుకోవాల్సిందేనని హెచ్చరించింది.ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆదేశాలు జారీచేసింది. జనవరి ఒకటి నాటికి ఔషధ తయారీసంస్థలు గ్లోబల్ గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ తేదీలో ఎలాంటి పొడిగింపులు ఉండవని తేల్చిచెప్పింది. భారత్‌లో తయారైన కొన్ని దగ్గుమందుల వల్ల స్వదేశంతో పాటు విదేశాల్లో పిల్లల మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ఎగుమతి అయిన ఈ మందుల వల్ల గాంబియా, ఉజ్బెకిస్థాన్, కామెరూన్ వంటి దేశాల్లో చిన్నారులు మృతి చెందిన ఘటనలు వెలుగుచూశాయి. ప్రభుత్వ నిబంధనల అమలులో నిర్లక్ష్యం, పాత తయారీ విధానాలు అనుసరిస్తోందంటూ భారత్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ దగ్గు మందును తమిళనాడు లోని కాంచీపురానికి చెందిన శ్రేసన్ ఫార్మా యూనిట్ తయారుచేసింది. మరణాల నేపథ్యంలో ఈ కంపెనీలో తనిఖీ చేయగా.. సిరప్‌లో 48.6 శాతం అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని తేలినట్లు విచారణాధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. దగ్గుమందు తయారీ విషయంలో సరైన పర్యవేక్షణ లేదని, సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో విషపూరితమైన సిరప్ మార్కెట్లోకి ప్రవేశించిందని, ఆ నిర్లక్ష్యం పిల్లల మరణాలకు దారితీసిందని దర్యాప్తులో భాగంగా గుర్తించారు. సరైన తయారీ పద్ధతులు అవలంబించడం లేదని, 300కు పైగా ఉల్లంఘనలను రికార్డు చేసినట్లు చెప్పారు. శ్రేసన్ ఫార్మా అనుమతులను తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





