– ప్రారంభించిన మంత్రులు సీతక్క, అజారుద్దీన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఉరుగ్వే, ఆస్ట్రియా జట్ల మధ్య మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌ను రాష్ట్ర మంత్రులు సీతక్క, అజారుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. అంతర్జాతీయస్థాయి క్రీడా పోటీలు తెలంగాణలో నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మంత్రి సీతక్క ఇరు జట్ల క్రీడాకారిణులను పరిచయం చేసుకుని వారికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. క్రీడాస్ఫూర్తితో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని, ఈ పోటీలు అంతర్జాతీయస్థాయిలో మహిళల హాకీ అభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడల ద్వారా దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడతాయని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఆధునిక క్రీడా మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడా పోటీలను తెలంగాణలో నిర్వహించడం ద్వారా రాష్ట్రం అంతర్జాతీయ క్రీడా పటంలో ప్రత్యేక గుర్తింపు పొందుతోందన్నారు. క్రీడాకారిణులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. క్రీడలు యువతకు ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయన్నారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీలను రాష్ట్రంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశంలోని తొలి క్రీడ యూనివర్సిటీని తెలంగాణలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సాట్ జి చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవి, తెలంగాణ హాకీ అసోసియేషన్ సెక్రటరీ భీమ్ సింగ్, క్రీడా శాఖ అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు హాజరై క్రీడాకారిణులను ఉత్సాహపరిచారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





