మహిళా సంక్షేమానికే మా ప్రాధాన్యం

– రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు

పెద్దపల్లి టౌన్ , ప్రజాతంత్ర, నవంబర్ 24: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం పెద్దపల్లిలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళలకు ఉచితంగా బస్సు రవాణా కల్పిస్తే ప్రతిపక్షాలు తట్టుకోలేక పోతున్నాయని, దీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వీరికి జూబ్లీహిల్స్ మహిళలు కర్రు కాల్చి వాత పెట్టారని తెలిపారు. గత పదేళ్లలో ఎప్పుడైనా వడ్డీ లేని రుణాలు అం దించాలని ఆలోచన పాలకులకు రాలేదని, తమ ప్రభుత్వం ఐదేల్లలో రూ. లక్ష కోట్ల బ్యాంకు లింకేజ్ ద్వారా వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో మొదటి ఏడాది వడ్డీ లేని రుణాలు కింద 9 కోట్ల రూపాయలు విడుదల చేసామని, ప్రస్తుత సంవత్సరం మరో 10 కోట్లు విడుదల చేయబో తున్నామని అన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. రేషన్ కార్డు లో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ చేస్తామని అన్నారు. పట్టణ ప్రాంతంలోని మహిళలకు వొచ్చే సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు పంపిణీ చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ చీరల పంపిణీ మొదటి విడత గ్రామీణ ప్రాంతాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట నాసిరకం చీరలు పంపిణీ చేసి మహిళలను అగౌరవ పరిచారని అన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మంచి డిజైన్ తో నాణ్యమైన చీరలను మహిళలకు అందిస్తున్నామని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసి రూ.4 కోట్ల 73 లక్షల వడ్డీ డబ్బులు మహిళా బ్యాంక్ ఖాతాలలో జమ చేశామని, ప్రస్తుత సంవత్సరానికి మరో రూ.5 కోట్ల 23 లక్షల పైగా వడ్డీ డబ్బులను కూడా మహిళా సంఘాల ఖాతాలలో జమ చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రతి మహిళ మరో 10 మందికి ఉపాధి అందించే స్థాయికి ఎదిగే దిశగా సహకారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రైతులు, యువత, కార్మికులు, మహిళల సంక్షేమమే అభ్యున్నతిగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మహిళా సంఘాలకు లక్ష కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ చిన్న, కుటీర పరిశ్రమల స్థాపనలో మహిళలు ముందు ఉండేలా చూస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, ఆర్.డి.ఓ.గంగయ్య, గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, తహసిల్దార్, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page