లక్షెట్టిపేట సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి
లక్షెట్టిపేట, ప్రజాతంత్ర, జులై 13 : మహిళా సాధికారత కోసం ఎంత దూరమైనా వెళ్తాం.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మహిళలకు సహాయం చేస్తాం.. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం తీసుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపడతామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సూక్ష్మ పరిశ్రమ పెట్టి మహిళలు వ్యాపారాలు చేసుకునే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. మహిళా సంఘాలకు సోలార్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాలు ఇవ్వగా పదేళ్లపాటు పరిపాలించిన ఈఆర్‌ఎస్ వడ్డీ లేని రుణాల పథకాన్ని గాలికి వదిలేసిందని, తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వడ్డీ లేని రుణాల పథకాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని తాము ప్రకటించినప్పుడు ఇది సాధ్యమా అని కొద్దిమంది అవహేళన చేశారని, కానీ మొదటి సంవత్సరంలోనే లక్ష్యానికి మించి రూ.21, 600 కోట్ల వడ్డీ లేని రుణం చెక్కులను మహిళా సంఘాలకు అందజేశామని తెలిపారు. ఈనెల 12 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామని, అందులో భాగంగా ఆదివారం మంచిర్యాలలో వడ్డీ లేని రుణం చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆమ్ ఆద్మీ బీమా పథకం కింద మహిళా సంఘాలకు భద్రత, రుణ సదుపాయం కల్పించి వారితో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇప్పించినట్టు తెలిపారు. మొత్తం 600 బస్సులు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికీ 150 బస్సులను ఆర్టీసీకి అనుసంధానం చేసి లీజు మొత్తం రూ.కోటి చెక్కును ఇటీవల ఆర్టీసీ నుంచి మహిళా సంఘాలకు అందజేశామని డిప్యూటీ సీఎం వివరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మైక్రో ఇండస్ట్రీస్ స్థాపించి మహిళలు వ్యాపారాలు చేసుకునే కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. సాధారణ ఎన్నికల ముందు ఆదిలాబాద్ జిల్లాకు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే వచ్చినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. తాము అడిగిన పనులు చేయాలని జిల్లా ప్రజలు, కాంగ్రెస్ నాయకులు కోరిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తోపాటు యావత్ కేబినెట్ ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని రాచరిక పాలనలో, రాష్ట్రం మొత్తం దోపిడీ జరుగుతుంటే బీిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజాస్వామ్యంతో కూడిన పాలనను తీసుకురావడంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజల పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఎన్నికల ముందు పీపుల్స్ మార్చ్ పేరిట తాను పాదయాత్ర చేపట్టగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తన అడుగులో అడుగు వేసిన జ్ఞాపకాలు ఇంకా తేలి ఆడుతున్నాన్నారు. నాటి పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టి ఆదిలాబాద్ జిల్లా నుంచి శంఖారావాన్ని పూరించగా సీఎల్పీ నేతగా పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆదిలాబాద్ నుంచి తాను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. గుట్ట నిండా లక్ష మంది పైగా ప్రజలు తరలిరావడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని, ప్రజల గుండెల్లో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు స్థానం పదిలం చేసుకున్నారని ఈ జన సందోహాన్ని చూస్తుంటే స్పష్టమవుతోందని అన్నారు. వెనుకబడిన ప్రాంతమైన మంచిర్యాల జిల్లా అభివృద్ధికి వారి సేవలు అవసరమని డిప్యూటీ సీఎం అన్నారు. గిరిజనులు తమ భూములు సాగు చేసుకునేందుకు ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఈ పథకం కింద ఉచితంగా సోలార్ పంపుసెట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్పు, ఉద్యాన శాఖ ద్వారా ఉచితంగా అవకాడో వెదురు వంటి మొక్కలను పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం మనందరికీ రూపాయి రూపాయి పోగుచేసి ప్రజల కోసమే ఖర్చు పెడతామని తెలిపారు. తనకు మధిర నియోజకవర్గమైనతో మంచిర్యాల అంటే అంతే ప్రత్యేక స్థానం తన గుండెల్లో ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు.





