– కుటుంబ సభ్యుల తీవ్ర ఆందోళన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ నుంచి మహిళ అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన పల్లె అనంతమ్మ (56) వారం క్రితం ఈ హాస్పిటల్ నుంచి కనిపించకుండాపోయింది. ఇప్పటివరకు ఆమె ఆచూకీ లభించలేదు. జనవరి 29న కిష్టాపూర్ లో హాస్పిటల్ సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత చికిత్స పేరుతో జనవరి 30న కంటి ఆపరేషన్ కోసం గ్రామస్తులను బస్సులో బాచుపల్లి హాస్పిటల్‌కు తరలించారు. కిష్టాపూర్ నుంచి 10 నుండి 15 మంది వెళ్లగా అంతా తిరిగి వచ్చారు. కానీ అనంతమ్మ మాత్రం తిరిగి రాలేదు. హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనలో ఈ నెల 5న అనంతమ్మ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లినట్లు తెలిసింది. హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే ఆమె బయటకు వెళ్లి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే వారం గడిచినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ’మా అమ్మ మాకు కావాలి’ అంటూ హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ’మా అమ్మను ఎలా తీసుకొచ్చారో అలాగే అప్పగించాలి’ అని అనంతమ్మ కొడుకు డిమాండ్ చేస్తున్నాడు. ఆమె ఆచూకీ లభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




