దక్షిణాది వ్యూహం సాకారమయ్యేనా?

డీ లిమిటేషన్‌ వల్ల ప్రజలకు ఒరిగేదేమి?

దక్షిణ రాష్ట్రాల్లో  పాగా వేయలన్నది బిజెపి ఆశ..దాన్ని అడ్డుకోవాలన్నది డిఎంకె తదిర ప్రాంతీయ పార్టీల వ్యూహం. అందుకే తొలుత హిందీ వ్యతిరేకతతో మొదలైన యుద్దం. ఇప్పుడు డీ లిమిటేషన్‌ వ్యవహారం తెరపైకి తెచ్చారు. నిజానికి డీ లిమిటేషన్‌ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. అయితే రాజకీయం కనుక రచ్చ చేయాలన్నదే రాజకీయ పార్టీల లక్ష్యం. మొన్న పార్లమెంట్‌ ఎన్నిల్లో బిజెపి కోరుకున్న 400 మార్కును దాటలేక పోయారు. దీంతో కొత్త వ్యూహాలను అమలు చేసేందుకు సిద్దం అవుతారని అందరికీ తెలుసు.  బిజెపిని అధికారం నుంచి తొలగించకుండా పక్కాగా ప్లాన్‌ చేయడమెలా అన్నది మోదీ ద్వయానికి బాగా తెలుసు. అందుకే వారు దక్షిణాది వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఉత్తరాదిలో రాముడు రక్షిస్తాడన్న ధీమా వచ్చేసింది. రామనామం ఉత్తరాదిలో ఊపేస్తోంది. అనన్య సాధ్యమైన అయోధ్య సాకారం అయ్యింది. దీంతో ఉత్తరాదిలో బిజెపికి తిరుగులేదన్న విధంగా పరిస్థితులు ఉన్నాయి. కానీ దక్షిణాది పరిస్థితి వేరు. కర్ణాటక కూడా చేజారిపోయింది. తెలంగాణలో వచ్చిన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నారు. తెలంగాణలో 17 సీట్ల కోసం పోటీపడి 8 సీట్లు సాధించారు. ఇదే తరహాలో మిగతా రాష్ట్రాల్లోనూ  గెలవాల్సి ఉంది. ఒడిషాలో అధికారం చేపట్టారు.

అందుకే తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణల్లో పట్టు సాధించేంవదుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దక్షిణాదిని గుప్పిట పెట్టుకోవాలని పట్టుదలగా ఉన్నారని కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్‌ ఎంపి శశిథరూర్‌ దారికొచ్చారు. మోదీని, ఆయన విదేశాంగ విధానాన్ని సమర్థిస్తున్నారు. ఇలా కొందరు నేతలతో బిజెపిని పొగిడించుకోవడం కూడా ఓ ఎత్తుగడే.  తమిళనాట అన్నాడిఎంకె దూరమైనా చిన్నాచితక పార్టీలతో జతకట్టారు. గవర్నర్‌గా ఉన్న తమిళసై మళ్లీ రాజకీయ అరంగేట్రం చేసినా ఫలితం దక్కలేదు. అయితే అన్నామలై అక్కడ గట్టిగానే పోరాడుతున్నారు. బిజెపిని ముందునుంచి ప్రజలు ఉత్తరాది పార్టీగానే గుర్తిస్తూ వచ్చారు. అయితే దానిని తిరగరాస్తూ కర్ణాటకలో  కాలుమోపారు. కానీ స్థానిక నాయకత్వం నిర్లక్ష్యం, అవినీతి కారణంగా గత అసెంబ్లీ మూల్చం చెల్లించుకోక తప్పలేదు. బిజెపి జాతీయవాదానికి దేశవ్యాప్త ఆమోదం కోసం యత్నిస్తోంది. భారతదేశంలో బిజెపి అంతటా విస్తరించిందని చెప్పుకోవడం కూడా అవసరం. అందుకే విజయం కోసం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా యత్నిస్తోంది. గత పదేళ్ల బిజెపి పాలనా కాలం తీసుకుంటే అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు చేయని ప్రయత్నం లేదు. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా అభివృద్ది, సెంటిమెంట్‌ ఎజెండాలను కలుపుకుని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈశాన్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్దికి పెద్దపీట వేసింది. బెంగాల్‌ లోను, దక్షిణ రాష్ట్రాల్లో   గెలుపు కోసం బూత్‌లెవల్‌ కార్యాచరణను అమలు చేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి పనిచేసుకుంటూ పథకం ప్రకారం బలాన్ని పెంచుకోగలిగిన శక్తిని బీజేపీ ప్రదర్శిస్తోంది. కార్యశీలురైన నాయకులు, కార్యకర్తలు దండిగా ఉన్నారు.

ఫలితాలు ఎట్లా ఉన్నా, వారు అలుపెరగకుండా ప్రయత్నాలన్ని చేస్తూనే ఉన్నారు. కర్ణాటక అపజయం బీజేపీకి కొత్తేవిూ కాదు. పొత్తులతోనో, ఫిరాయింపులతోనో బీజేపీ కర్ణాటకలో ఒకటి రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఒక మైనర్‌ భాగస్వామిగా అయినా ప్రభుత్వంలో ఉన్నది. తెలంగాణలో తగినంత ఉనికితో ఎప్పటి నుంచో సత్తా చాటుతోంది. గత పార్లమెంటు ఎన్నికలలో 8 స్థానాలతో, సుమారు 20 శాతం వోట్లతో తన ఉనికిని విస్తరించుకోగలిగింది. కేరళలో 2016లో ఒక ఎమ్మెల్యేను గెలిపించుకున్న బీజేపీ, 2021లో 11 శాతానికి పైగా వోట్లను సంపాదించింది. అక్కడక్కడా ఉనికిలో ఉన్నప్పటికీ దక్షిణాది ఇంకా పట్టుబడలేదన్న లోటు మాత్రం బీజేపీకి ఉన్నది. దక్షిణాదిలో విస్తరించాలన్న ఆకాంక్ష బీజేపీకి, మోదీకి అంతిమ లక్ష్యంగా మారింది. అందుకే దక్షిణాదిపై ఎక్కువగా దృష్టి సారించారు. తమిళనాట చెలరేగుతున్న నిరసలు, ఉద్యమాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. హిందీ వ్యతిరేకతను ప్రజలే ఛీత్కరించుకునేలా చేస్తున్నారు. డీలిమిటేషన్‌ కారణంగా ఉత్తరాదిలో మరిన్ని సీట్లు పెరిగే అవకాశమున్నట్లు డిఎంకు తదితర పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. తమిళనాడు, కేరళల్లో ప్రస్తుతానికి పరిస్థితి ఆశాజనకంగా ఉంది. మోదీ  వ్యక్తిగత ఛరిష్మా కూడా పనిచేస్తోంది.

ఆ రెండు రాష్ట్రాల్లో గతం కంటే వోట్లు, సీట్లు పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కర్ణాటకలో ఇప్పటికే కాంగ్రెస్‌ పాలన విూద విముఖత కలిగిందన్న ప్రచారం మొదలయ్యింది. గతంలో ఉన్న బలాన్ని నిలుపుకోవడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు కావడంతో అక్కడ విజయం సాధించడం ద్వారా కొంత పట్టు నిలుపుకుంది. పవన్‌ కళ్యాణ్‌ పేరుకు జనసేనానిగా ఉన్నా, ఆయన ఆశలు,ఆశయాలు బిజెపితో పెనవేసుకుంటున్నాయి. ఆయన వీరికి తురుపుముక్కగా ఉంటారనడం లో సందేహం లేదు. ఈ కలయిక దీర్ఘకాలికంగా బీజేపీ విస్తరణ ప్రయత్నాలకు తోడ్పడగలదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభావం గణనీయంగానే పెరిగింది. ఇప్పుడది ఆ పార్టీకి కీలకమయిన విజయం అవుతుందని భావిస్తోంది.

తెలంగాణలో అధిక ప్రభావం చూపగలిగితే కనుక, బీజేపీ వెంటనే రెండో స్థానానికి, అతి త్వరలో అధికారస్థానానికి చేరుకోగలుగుతుంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడుతో పాటు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పాగా కోసం బిజెపి అహరహరం అందుకే కృషి చేస్తోంది. డిఎంకె ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. వారు చేసే డీలిమిటేషన్‌, హిందీవ్యతిరేక ఆందోళనలను తనకు అనుకూలంగా మలచుకుంటోంది. తమిళనాడులో గత బీజేపీకి ప్రస్తుత బీజేపీకి పూర్తిగా తేడా కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ బలపడుతూ వస్తోంది. పాదయాత్రలతో పాటు.. డీఎంకే అవినీతిపై ఆయన ఆరోపణలు చేస్తూ.. ఆధారాలు విడుదల చేశారు. దీంతో డీఎంకే సైతం బీజేపీని టార్గెట్‌ చేయడం మొదలుపెట్టింది. దీంతో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పోరు.. డీఎంకే, బీజేపీగా అన్నామలై మార్చేశారు. ప్రధాని మోదీ సైతం తమిళనాడుపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇలా కేరళలోనూ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో బిజెపికి కేంద్రంలో అధికారంలో ఉండడం కలసి వస్తోంది.

-రాంబాబు వర్మ లంక
(సీనియర్ జర్నలిస్ట్ )
హైదరాబాద్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *