బడ్జెట్ సమావేశాలు ఫలవంతంగా ముగిసేనా?

విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అస్త్రశస్త్రాలకు పదును పెట్టుకొని  ప్రస్తుత తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటుండటంతో, చర్చలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. ఎవరిని వారు సమర్థించుకోవడం, ఎదుటివారిని విమర్శనాస్త్రాలతో ఇరుకునపెట్టే వ్యూహంతో పార్టీల నేతలు ముందుకెళతారన్న దాంట్లో ఇసుమంతైనా సందేహం లేదు. ఇంతటి ముఖ్య మైన అసెంబ్లీ సమావేశాలకు సభ్యులంతా హాజరు కావాలని సాక్షాత్తు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేల ను కోరాల్సివొచ్చిందంటే, పార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ పట్ల ఎంత ఆసక్తి ఉన్నదీ అర్థమవుతుంది. ఒకప్పుడు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా  ఉండే  రాజకీయాలు ఇప్పుడు ‘కెరీర్‌’ ప్రాధాన్యంగా మారిపోవడంతో ఎటుబోయి ఎటొస్తుందోనని ఎవరికి వారు సంతులనంగా మాట్లాడటం పరిపాటి అయిన కాలమిది.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే హాజరు కావడం తమ బాధ్యత అన్న అంశాన్ని చాలా మంది ఎమ్మెల్యేలు విస్మరిస్తుండటం దురదృష్టకరం. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ముఖ్యమైన బడ్జెట్ లేదా బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు పార్టీ ఎట్లాగో విప్ జారీ చేస్తుంది కదా అన్న ధీమా కూడా వీరిలో బాగా పెరిగిపోయి ఉండవొచ్చు. రాజ్యాంగంలోని 190(4) అధికరణం ప్రకారం అసెంబ్లీ సమావేశాలకు వరుసగా 60 రోజులు గైర్హాజరైన సభ్యుడి స్థానాన్ని ఖాలీ గా ప్రకటించవొచ్చు. ఒకవేళ సమావేశం నాలుగు కంటే ఎక్కువ రోజులు వాయిదా పడినట్లయితే ఆ రోజులను ఈ లెక్కింపు నుంచి మినహాయిస్తారు. గతంతో పోలిస్తే నేటి ప్రజాప్రతినిధుల్లో విద్యావంతులు అధికంగా ఉన్నప్పటికీ ఈ గైర్హాజరు ఎక్కువగా వుండటానికి పలు కారణాలు ఉండవొచ్చు . ముఖ్యంగా క్షేత్రస్థాయి పనులు, పార్టీ కార్యకలాపాలు, వ్యక్తిగత వ్యవహారాలు వంటివి సాధారణంగా చెప్పుకునే కారణాలు.

ప్రస్తుత సభా వ్యవహారాల్లో పాలనాపరమైన తప్పిదాలను, హామీల అమలును ఎత్తి చూపడం, అంశాల వారీగా చర్చలు జరగడం అనేవి ఎన్నడో కాలం చెల్లిపోయాయి. ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, పరస్పర ఆరోపణలు , ఎదుటివారిని మాట్లాడనీయకుండా అర్థంలేని కేకలు, అరుపులతో గందర గోళం సృష్టించడం, ఆనాటి సభా కార్యక్రమాల ఎజెండా కు  సంబంధం లేని అంశాలను లేవనెత్తి గందరగోళం సృష్టించడం అలవాటుగా మారింది. ఇటువంటి అష్టావక్ర లక్షణాల కారణంగానే శాసనసభల సమావేశకాలం కూడా గణనీయంగా తగ్గిపోతూ వొస్తున్నది . ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ఈనెల 30వరకు జరుగనుండగా, బీఆర్‌ఎస్ ఇది చాలదు మరింత పొడిగించాలని డిమాండ్ చేస్తోంది. కానీ ఇదే పార్టీ హయాంలో 2019 నుంచి 2023 వరకు ఏడాదిలో సగటున కేవలం 15 రోజులు మాత్రమే సభ సమావేశమైందన్న సంగతి గుర్తుంచుకోవాలి. “నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష” అన్న చందంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా సమావేశాల కాలాన్ని కుదిస్తోంది.

దేశంలోనే మన రాష్ట్ర  ఎమ్మెల్యేలకు అత్యధిక వేతనాలు అంటే నెలకు రూ.2.5లక్షలు అందుతున్నాయి. ఇంత మొత్తంలో వేతనాలు ఇతర సదుపాయాలు పొందుతున్న ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరై తమ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తి, పరిష్కార సాధనకు కృషి చేయాలి. మరి ఈ బాధ్యతను ఎంతమంది పాటిస్తున్నారంటే వేళ్లమీద లెక్కపెట్టాల్సిందే. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు తమ పార్టీ ఆదేశాలకు లోబడి మాత్రమే వ్యవహరించాలన్న నిబంధనలు కొందరు స్వేచ్ఛగా మాట్లాడలేకపోవడానికి కారణమన్న వాదనలూ ఉన్నాయి. కొందరు ఒక అంశంపై చక్కగా  సంసిద్ధులై చర్చిద్దామని వొచ్చిన రోజు, సమావేశంలో గందరగోళం, లొల్లి  చోటుచేసుకోవడం వంటివి వారిలోని ఉత్సాహంపై నీళ్లు చల్లడం కూడా ఎమ్మెల్యేలు మాట్లాడలేక పోవడానికి మరో కారణంగా చెబుతున్నారు. కానీ అంశాల ప్రాతిపదికన ప్రసంగించినప్పుడు, ఎవరూ ఎదురుచెప్పడానికి దాన్ని అడ్డుకోవడానికి యత్నించే సాహసం చేయరన్నది కూడా గుర్తుంచుకోవాలి.

సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఎమ్మెల్యేకు రోజుకు రూ.1000 అలవెన్స్ లభిస్తుంది. దీనికి తోడు భద్రత, విద్యుత్, ప్రత్యక్ష ప్రసారం, పరిపాలనా సిబ్బంది వంటి “ఆపరేషనల్ ఒవర్‌హెఢ్‌”లు సభాకార్యకలాపాలు 7-8 గంటల వరకు నిరంతరాయంగా పని చేసేందుకు కృషి చేస్తారు. ఈ మొత్తం ఖర్చు చూసుకుంటే రోజుకు శాసన సభ నిర్వహణ ఖర్చు రూ.1.5కోట్ల నుంచి రూ.2 రెండు కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం ఖర్చవుతున్నప్పుడు, ప్రజల కోసం కాక వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు, బాయ్‌కాట్‌లు, సభకు ఆటంకం కలిగించడం వంటి అప్రజాస్వామిక చర్యల ద్వారా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం ప్రజా ప్రతినిధులకు ఎంతవరకు సబబు? కేవలం అర్థవంతమైన చర్చలు, ప్రయోజనాత్మక నిర్ణయాలతో సభా కార్యకలాపాలు ముగిస్తే అది ప్రజాహితమవుతుంది.

అట్లాగని సభ ఫలవంతమైన చర్చలు జరిపిన సందర్భాలు కూడా లేకపోలేదు. 2024 జులై నెలలో ద్రవ్యవినియోగం బిల్లుపై చర్చ జరిగినప్పుడు 70% ఎమ్మెల్యేల హాజరుతో 17 గంటల పాటు సమావేశం ఏకబిగిన సాగింది. నిజంగా అది అద్భుతం! 2017లో కూడా రాష్ట్ర అసెంబ్లీ మొత్తం 37 సిట్టింగ్ డేస్  (సిట్టింగ్ డే అంటే ఒక నిర్దిష్ట రోజున శాసనసభ నిరంతరాయంగా సమావేశమయ్యే కాలం)తో అత్యధిక క్రియాశీలతను ప్రదర్శించడం విశేషం. 2024లో కూడా మన రాష్ట్ర అసెంబ్లీ 18 సిట్టింగ్‌ల్లో 149 గంటల పాటు సమావేశమైంది. ఇవి సమావేశాల నిర్వహణలో సానుకూలతలు.అటువంటి ఫలవంతమైన సమావేశాలు ప్రజాస్వామ్యానికి అవసరం.

సభలో గందరగోళం, కేకలు, అరుపులు, నినాదాలతో నిండిపోయినప్పుడు, తక్కువ మంది ఎమ్మెల్యేల హాజరు ఉన్నప్పుడు, ప్రభుత్వం ప్రవేశపెట్టే అతి ముఖ్యమైన బిల్లులపై సమగ్ర చర్చ జరపకుండానే కేవలం కొద్ది నిముషాల్లోనే  తన మెజారిటీ సభ్యుల మద్దతుతో ఆమోదం పొందడం దాదాపు ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న తంతే! కానీ ఇది సాంకేతికంగా కరక్టే అయినా, నైతికంగా ఎంత మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే సభలో పూర్తిస్థాయి లో ఎమ్మెల్యేలు హాజరైనప్పుడు బడ్జెట్ వంటి ముఖ్యమైన బిల్లుల విషయంలో కూలంకషంగా చర్చ జరుగుతుంది. అప్పుడు ఆమోదం పొందే బిల్లు నాణ్యత వేరు! అందువల్లనే ప్రజల కోసం పనిచేస్తున్నాం లేదా పోరాడుతున్నాం అనే అధికార, విపక్షాలు తమ ఎమ్మెల్యేలంతా హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

 రాజ్యాంగంలో శాసనసభ ఇన్ని రోజులు కచ్చితంగా సమావేశం కావాలన్న నిబంధన ఏదీ లేకపోవడమే చాలా తక్కువ రోజులతో వీటిని ముగిస్తుండటం గమనార్హం. సాధారణంగా ప్రభుత్వాలు తాము చేసిన పొరపాట్ల పై విపక్షాల దాడి నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా చేస్తుండటం సర్వసాధారణమై పోయింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సగటు సమావేశాల కాలం ఏడాదికి 27-28 రోజులకు పడిపోవడానికి ఇదే ప్రధాన కారణం! మరి ఈ బడ్జెట్ సమావేశాలను మన ప్రజాప్రతినిధులు ఎంత ఫలవంతంగా పూర్తి చేస్తారో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *