రేవంత్‌ ‌ఛాలెంజ్‌పై కేసీఆర్‌ ‌స్పందించేనా ?

– అసెంబ్లీ వేదికగా పథకాలు, ప్రాజెక్టులపై చర్చకు పిలుపు  
– ఇరు ప‌క్షాల‌ ఘాటు వ్యాఖ్యలతో వేడెక్కిన రాజ‌కీయం
– ఈసారైనా అసెంబ్లీకి హాజరవుతారా అన్నదే హాట్‌ టాపిక్‌

– ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న దానిపై ఉత్కంఠ 

                                                                     (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌తినిధి )

          అసెంబ్లీకి హాజరై మాట్లాడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఛాలెంజ్‌ విసిరారు. నాలుగు గోడల మద్య ప్రెస్‌మీట్‌లు పెట్టి విమర్శించడం కాదు.. అసెంబ్లీలో వాస్తవాలేమిటో చర్చిద్దాం రమ్మంటూ ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సాధారణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ ఇం‌తవరకు హాజరుకాకపోవడంపై సిఎం రేవంత్‌రెడ్డి ప్రతీ సమావేశంలో గుర్తుచేస్తూనే ఉన్నారు. రెండేళ్ళుగా తమ ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై బీఆర్‌ఎస్‌ ‌వరుస దాడులు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలను చక్కపెట్టడానికే తమకు సరిపోతున్నదని, ఆ ప్రభుత్వం చేసిన కోట్లాది రూపాయల అప్పుకు సంబందించిన వడ్డీలను చెల్లించడానికే రాష్ట్ర ఆదాయం సరిపోతున్నదని, ప్రజలపై అప్పులు రుద్ది చేసిందేమీలేదంటూ ఆయన రాష్ట్రంలో ఏమూలకు వెళ్ళినా ఇదే అంశాన్ని చ‌ర్విత‌చరణంగా చెబుతున్నారు. అయితే ఆదివారంనాటి కేసీఆర్‌ ‌మీడియా సమావేశం ఆయనలో ఆగ్రహం క‌ట్ట‌లు తెంచుకుంది. ఒక సందర్భంలో ఆయన ముఖ్యమంత్రినన్న విషయాన్నికూడా మర్చిపోయారు. సాధారణంగా ఏ ముఖ్యమంత్రికూడా బహిరంగ సభల్లో వాడకూడని మాట‌లు మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నేతలు ముగ్గురిపైన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘కొడుత బిడ్డా, లాగులో తొండలిడిసిపెడతా, సంతలకుపోయి బర్ల కాసుకో, హౌలాపోరడు, బోడిలింగం, నీ అవ్వ’ లాంటి పదాలను వాడిన విధానం చూస్తుంటే ఆయన కోపం నషాళానికి ఎక్కినట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పింది. కానీ, ప్రభుత్వం రెండేళ్ళుగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదంటూ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌తోపాటు, బీజేపీకూడా ఆరోపిస్తూ వస్తున్నది. అయితే బీఆర్‌ఎస్‌ అడుగడుగునా హమీలేమైనాయని ఎత్తిచూపడమే సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహానికి కారణంగా భావిస్తున్నారు. దానికి కౌంటర్‌గా గత పదేళ్ళుగా తెలంగాణను బ్రష్టుపట్టించిందే బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమని చెబుతున్న రేవంత్‌రెడ్డి నాటి ప్రభుత్వం చేపట్టిన పథకాలపైనే అసెంబ్లీలో చర్చ పెడదామంటున్నారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేపట్టిన ఏ పథకంపైన అయినా కేసీఆర్‌ ‌చర్చించాలనుకుంటే అదే అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెడతానని రమ్మని ఆయన చాలెంజీ చేస్తున్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల నినాదంగానే తెలంగాణ ఏర్పడింది. అవే విషయాలను తీసుకుని గత దశాబ్ధకాలం అధికారంలోఉన్న బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చర్చించడానికి వస్తారా లేక ఇతర సంక్షేమ పథకాలపైనా, ఏదైనా ఆప్షన్ ‌కేసీఆర్‌కే వదిలేస్తున్నానంటూ రేవంత్‌ ‌చాలెంజీ చేశారు. కూలిన కాళేశ్వరం, ఫోన్‌ ‌ట్యాపింగ్‌, ‌కార్‌ రేసింగ్‌, ‌కృష్ణా, గోదావరి జలాల వివాదం ఇలా అనేక అంశాలకు సంబంధించిన ఆరోపణలను బీఆర్‌ఎస్‌ ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. అయితే వాటిపైన తనకుతాము క్లీన్‌ చిట్‌ ఇచ్చుకుంటున్నా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోక తప్పటంలేదు. ఈ అంశాలను తీసుకుని బీఆర్‌ఎస్‌ను శాసనసభలో బంతాట ఆడుకోవాలన్నది రేవంత్‌రెడ్డి అభిలాషగా కనిపిస్తున్నది. ముఖ్యంగా నదీజలాల విషయాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్ళనున్నట్లు కేసీఆర్‌ ఆదివారంనాటి మీడియా సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన ముందరకాళ్ళకు బంధంగా ప్రజల్లోకికాదు అసెంబ్లీలోనే చర్చిద్దాం రా అంటూ రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను సవాల్‌ ‌చేశారు. ఇంతఘాటుగా తనను విమర్శించడమేకాక తమ కాలంలో ప్రవేశపెట్టిన పథకాలు, నీటి ప్రాజెక్టులపైనే చర్చ పెడుతానంటున్న క్రమంలో వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేసేందుకు కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలు ఈసారైనా హాజరవుతారా లేదా అన్నది రాష్ట్రంలో ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

——————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *