‘ఫార్ములా’ కేసులో వందసార్లయినా నిజమే చెబుతా
బీఆర్‌ఎస్ నేతలను వేధిస్తూ పైశాచికానందం పొందుతున్న రేవంత్
మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: ఫార్ములా ఈ రేస్ కేసులో తనను అరెస్టు చేయించే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు(కేటీఆర్) సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తీసుకున్న నిర్ణయం కారణంగా ఒకసారి కాదు వందసార్లు అయినా సరే జైలుకు వెళ్లడానికి తాను సిద్దమేనని స్పష్టం చేశారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఫార్ములా ఈ రేస్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి నగర ప్రతిష్ఠను ఇనుమడిరపచేసింది కేసీఆర్ ప్రభుత్వం అయితే అందాల పోటీలతో ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని విరుచుకుపడ్డారు. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్, హరీష్‌రావులను కూర్చోబెట్టి తనను ఏసీబీ విచారణకు పిలిపించి రేవంత్‌రెడ్డి రాక్షసానందం పొందుతున్నాడని విమర్శించారు. తమ మీద అక్రమ కేసులు బనాయించి వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం ఆపేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకం, అజ్ఞానమే అవుతుందన్నారు. ఒక్క కేసు కాదు వెయ్యి కేసులు పెట్టినా ప్రశ్నించడం మానమన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలోనే జైలుకు వెళ్లిన తాము అన్నిటికీ తెగించే రేవంత్ అరాచకాలపై కొట్లాడుతున్నామని చెప్పారు. న్యాయస్థానాలు, చట్టాల మీద తమకు అపార గౌరవం ఉందన్నారు. నిజం నిలకడ మీదనే తెలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు రమ్మనడం ఇది మూడోసారి అన్న కేటీఆర్.. ఇంకో వందసార్లు పిలిచినా వెళ్తానని, వందసార్లూ నిజమే చెప్తానని కేటీఆర్ తెలిపారు. ఈ రేసు వ్యవహారాన్ని శాసనసభ సమావేశాల్లో చర్చిద్దామంటే ఈ ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కూడా ఏసీబీ కేసు ఎదుర్కొంటున్నందున దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షకు రమ్మంటే ఇంతవరకు ఆయన నుంచి స్పందన లేదన్నారు.
రిజర్వేషన్లు పక్కనబెట్గి స్థానిక ఎన్నికలకు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని పక్కకుపెట్టి లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతున్నదని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, రేవంత్ కపట నైజాన్ని బీసీలు గమనిస్తున్నారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రైతుబంధు వేస్తున్న విషయాన్ని రైతులు, నెలకు రూ.2500 ఎగ్గొట్టిన మోసాన్ని ఆడబిడ్డలు, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి తప్పించుకుంటున్న తీరును యువత గమనించి నిలదీస్తున్నారు కాబట్టే డైవర్షన్ కోసం కమీషన్లు, ఎంక్వైరీలని రేవంత్ రెడ్డి హంగామా చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి ఒక్క మంచి పని లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ దున్నపోతు ఈనింది అనగానే దుడ్డెను కట్టేయమని బిజెపి అంటున్నదని విమర్శించారు. ఈ రెండు పార్టీల అక్రమ సంబంధం, దొంగ నాటకాలు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యాయన్నారు. తెలంగాణ ప్రయోజనాలు, ప్రజల రక్షణ కోసం ఆనాడైనా ఈనాడైనా, ఏనాడైనా ఉండేది బీఆర్‌ఎస్సే అని కేటీఆర్ స్పష్టం చేశారు





