“శ్రీ శైలం బదులు సిద్దేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా చేపట్టి ఉంటే రద్దు కాబడిన కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో సాగుకు వచ్చే ఏడెనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. తర్వాత చరిత్ర ప్రత్యేకించి చెప్ప పనిలేదు. దురదృష్టమేమంటే సుదీర్ఘ కాలం రాయలసీమకు చెందిన నేతలే ముఖ్యమంత్రులుగా ఉన్నా ఫలితం హళ్లికి హళ్లి సున్నాకు సున్నా. ఈ నాటికి రాయలసీమ గ్రామాల్లో సాగునీరు కాదు కదా! తాగునీటి వెంపర్లాడ వలసి వస్తోంది. ఇన్నేళ్లు గడచిన తర్వాత కూడా బడిలో ఉండ వలసిన పిల్లలతో సహా ఉపాధి వెతుక్కుంటూ వలస పోతున్నారంటే ఎవరికైనా కడుపులో దేవినట్లు అనిపించడం లేదా?..”
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి అవశేష ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి నవంబర్ మాసం వస్తే రాయలసీమలో ప్రతి ఏటా అలజడి సంభవిస్తోంది. నవంబర్ మాసంలో రాయలసీమకు చెంది రెండు చారిత్రక సంఘటనలు సంభవించాయి. ఒకటి శ్రీ బాగ్ ఒడంబడిక. రెండు బ్రిటీష్ పాలనలో సీడెడ్ ప్రాంతంగా పిలవబడుతుండగా నవంబర్ నెలలో రాయలసీమ అని నామ కరణం జరగడం. రాయలసీమ ప్రయోజనాల పరిరక్షణకు 1937 నవంబర్ 16 వతేదీ జరిగిన శ్రీ బాగ్ ఒడంబడిక రాచ పుండు లాగా మానని గాయం లాగా ఇప్పటికీ కెలుకుతోంది. గత రెండేళ్లుగా కొంత స్థబ్దతతో ఉన్నా ఈ నవంబర్ 16 వ తేదీ ఎవరికి వారు పలు ప్రజా సంఘాలు శ్రీ బాగ్ ఒడంబడిక అమలు చేయాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. 1928 నవంబర్ లో రాయలసీమ అని నామకరణం జరిగిన రోజును ఆత్మగౌరవ దినంగా పాటించారు. ప్రధానంగా కర్నూలు అనంతపురం జిల్లాలో శ్రీ బాగ్ ఒడంబడిక అమలు డిమాండ్ బాగా వ్యక్తమైంది. 1929 లో ఆంధ్ర యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ ను విజయవాడ నుండి అనంతపురం తరలించకుండా వైజాగ్ కు మార్పు చేయడంతో రాయలసీమ వాసుల్లో ఆగ్రహం అపనమ్మకాలు ఏర్పడ్డాయి. అవిభక్త మద్రాసు రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం ఐక్యం చేసేందుకు కోస్తా ప్రాంతానికి చెందిన డాక్టర్ భోగరాజు సీతారామయ్య బులుసు సాంబమూర్తి లాంటి వారు సాగించిన కృషి ఫలితంగా ఈ ఒడంబడిక 1937 నవంబర్ 16 జరిగింది. మద్రాసులోని ఆంధ్ర పత్రిక అధినేత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు నివాసం శ్రీ బాగ్ భవనంలో జరిగిన సమావేశంలో ఈ ఒడంబడిక జరిగింది కాబట్టి దీనికి శ్రీ బాగ్ ఒడంబడిక అని పేరు వచ్చింది. అవిభక్త మద్రాసు రాష్ట్రం ప్రభుత్వం 1926 ఏప్రిల్ 26 వతేదీ ఆంధ్ర యూనివర్సిటీని బెజవాడ (విజయవాడ అప్పటి పేరు) లో తాత్కాలికంగా ఏర్పాటు చేసింది.
అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న రాయలసీమ వాసులు ఆంధ్ర యూనివర్సిటీ అనంతపురంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 1927 లో ఆంధ్ర మహాసభ అనంతపురంలో జరిగింది. ఈ సభలో ఆంధ్ర యూనివర్సిటీని అనంతపురం మార్చాలని తీర్మానం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ కూడా ఇందుకు అనుగుణంగా తీర్మానించింది. కాని 1929 లో బెజవాడ నుండి వైజాగ్ మార్పు చేశారు. ఈ నేపథ్యంలో కోస్తా రాయలసీమ ప్రాంతాల మధ్య అపనమ్మకాలు వైషమ్యాలు బలపడ్డాయి. ఈ లోపు ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడినా ఈ అగాధం మరింత పెంచుతున్నారే గాని తగ్గించిన జాడ లేదు.
1937 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది. మద్రాసు రాష్ట్రంలో రాజాజీ ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రి వర్గంలో కూడా రాయలసీమ నేతలకు మంత్రి పదవులు దక్క లేదు. ఇది రెండు ప్రాంతాల మధ్య అగాధం మరింత సృష్టించింది. 1937 లో ఆంధ ప్రాంత కాంగ్రెస్ అధ్యక్షులుగా డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఎన్నికైన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం తీవ్రతరం చేశారు. ఇందుకు రాయలసీమ నేతలు సిద్ధంగా లేరు. ఈ పరిస్థితుల్లో 1937 అక్టోబరులో బెజవాడలో ఆంధ్ర మహాసభ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరిగాయి విశేష మేమంటే ఈ ఉత్సవాలకు రాయలసీమకు చెందిన కడప కోటి రెడ్డి అధ్యక్షత వహించారు. రాయలసీమ మరో నేత హలాహర్వి సీతారామ రెడ్డి ప్రారంభించారు. ఈ మహాసభలో పరస్పరం జరిగిన చర్చల ఫలితంగా శ్రీ బాగ్ ఒడంబడికకు ప్రాతిపదిక ఏర్పడింది . ఈ ఒడంబడిక పై రాయలసీమ నుండి కడప కోటి రెడ్డి కల్లూరు సుబ్బారావు పప్పూరి రామాచార్యలు హలాహర్వి సీతారామ రెడ్డి నెల్లూరు జిల్లా నుండి యల్. సుబ్బారామి రెడ్డి ఆర్. వెంకటప్ప నాయుడు కోస్తా నుండి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామ రావు కొండా వెంకటప్పయ్య సంతకాలు చేశారు. ఈ ఒడంబడికకు చట్ట బద్దత లేకున్నా చారిత్రక ప్రాధాన్యత రాయలసీమ కూడా ఇతర ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు విధిగా ఉంటుంది.
ఈ ఒడంబడికలో అయిదు అంశాలు ఉన్నాయి. 1)ఆంధ్ర యూనివర్సిటీ రెండు కేంద్రాలు ఏర్పాటు చేయడం. ఒకటి వైజాగ్ రెండవది అనంతపురం. 2)రాయలసీమ తో పాటు నెల్లూరు జిల్లా వ్యవసాయ రంగంలో కోస్తా జిల్లాలతో సమానంగా అభివృద్ధి. తుంగభద్ర కృష్ణ పెన్నా నదులపై ప్రాజెక్టుల నిర్మాణంలో రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వడం 3)చట్ట సభల సభ్యులు సమానంగా ఉంచడం 4)రాజధాని హైకోర్టు వేర్వేరు ప్రాంతాల్లో ఉంచడం. ఏది కావాలో ముందుగా ఛాయిస్ రాయలసీమకు ఇవ్వడం. దురదృష్టమేమంటే ఇన్నేళ్లు గడచినా ఇందులో ఏ ఒక్కటి రాయలసీమకు దక్క లేదు. అధికారంలోనికొచ్చిన ప్రతి ఒక్కరూ అరచేతిలో స్వర్గం చూపుతున్నారు. కాబట్టే ఇంకా ఈ ఒడంబడిక కెలుకుతూనే ఉంది.
అయితే 1953 లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు వివిధ రాజకీయ కారణాలతో కర్నూలు రాజధాని అయినా అది మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. కోస్తా ప్రాంతం అభివృద్ధి చెందినదంటే సాగునీటి వసతి లభించి మూడు పంటలు పండించుతున్నారు. కాబట్టి ఈ రోజుకు సంపద అక్కడ పోగు బడుతోంది. రాయలసీమలో విస్తారమైన పొలాలు కష్టించి పని చేసేందుకు మానవ వనరులు ఉండి ఆ వసతి లేదు. కాబట్టి దుర్భిక్ష ప్రాంతంగా ఈ నాటికి మిగిలి పోయింది. ఈ ఏడు విస్తారంగా వర్షాలు పడ్డాయి. అయిన నిల్వ చేసుకొనే వసతి లేదు. గ్రామాల్లో ఉపాధి లేదు. ఈ ఏడు కూడా ఎక్కువగా ఉపాధి వెతుక్కుంటూ వలసలు పోయారంటే నమ్మ గలరా? ఎవరు నమ్మినా నమ్మకున్నా వాస్తవమం. అవిభక్త మద్రాసు రాష్ట్రంలో ఆనాటి పాలకులు కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు ప్రతిపాదించి తమిళనాడుకు నీళ్లు తీసుకు పోయేందుకు సిద్దమైనపుడు ఆంధ్ర ప్రాంతంలో వ్యతిరేకత రావడంతో వెనక్కి పోయింది.
హైదరాబాద్ రాష్ట్రంతో ముడిపడిన నాగార్జున సాగర్ నిర్మాణం చేపట్టబడింది. అయితే 1965 లో శ్రీ శైలం కేవలం జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా నిర్మాణం జరిగే సమావేశంలో సిద్దేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నిర్మించాలనే డిమాండ్ వచ్చినా అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఒకప్పుడు శ్రీ బాగ్ ఒడంబడిక పేరుతో కర్నూలులో రాజధాని పెట్టిన నేత ఒడంబడికలో ప్రధాన మైన సాగునీటి ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. శ్రీ శైలం బదులు సిద్దేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా చేపట్టి ఉంటే రద్దు కాబడిన కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో సాగుకు వచ్చే ఏడెనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. తర్వాత చరిత్ర ప్రత్యేకించి చెప్ప పనిలేదు. దుర దృష్టమేమంటే సుదీర్ఘ కాలం రాయలసీమకు చెందిన నేతలే ముఖ్యమంత్రులుగా ఉన్నా ఫలితం హళ్లికి హళ్లి సున్నాకు సున్నా. ఈ నాటికి రాయలసీమ గ్రామాల్లో సాగునీరు కాదు కదా! తాగునీటి వెంపర్లాడ వలసి వస్తోంది. ఇన్నేళ్లు గడచిన తర్వాత కూడా బడిలో ఉండ వలసిన పిల్లలతో సహా ఉపాధి వెతుక్కుంటూ వలస పోతున్నారంటే ఎవరికైనా కడుపులో దేవినట్లు అనిపించడం లేదా?





