“బాబర్ చేసినట్టు చెబుతున్న గాయం దగ్గర నుంచి మెకాలే చేశాడంటున్న గాయం దాకా మోదీ, ఆయన బృందం ప్రయాణించింది. ఈ వ్యాఖ్యానం గురించి, అన్వయాల గురించి కొత్తగా మాట్లాడుకునేదేమీ లేదు. ఆయన తన రాజకీయార్థిక దృష్టికోణం నుంచి, దానికి కీలకమయిన సాంస్కృతిక సామాజిక ప్రాతిపదికల గురించి చెబుతున్నారు. ఇక్కడ కలుగుతున్న సందేహమల్లా, ఎందుకు కొన్ని గాయాల విషయంలోనే ఉపశమన ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఎందుకు, కొన్ని గాయాల స్మరణ కూడా జరగడం లేదు? బ్రిటిష్ క్షమాపణను డిమాండ్ చేయడం ద్వారా గాయపడిన జాతి ఆత్మను ఆనాడు ఎందుకు స్పృశించలేకపోయారు? వలసవాద మానసికస్థితిని గురించి మీరేనా ఇప్పుడు మాట్లాడుతున్నది?”

ఎలిజబెత్ రాణి 1983 లో ఇండియాకు వచ్చారు, హైదరాబాద్‌ను కూడా సందర్శించారు. ఆమె రాక ను కొన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. ‘ ఎలిజబెత్ రాణి గోబ్యాక్, అల్లూరి సీతారామరాజు అమర్ హై’ అంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. రెండు వందలేండ్ల పాలనలో బ్రిటిష్ వారు భారతదేశానికి చేసిన కోట్లాది గాయాలలో అల్లూరి హత్య ఒకానొకటి. చరిత్రభారాన్ని మోసే జాతి, గాయాలను మరచిపోలేదు. వలసపాలన రూపం మార్చుకుని సామ్రాజ్యవాదంగా పెత్తనం చేస్తున్నప్పుడు, చారిత్రక అన్యాయాన్ని వర్తమాన నినాదంగా ధ్వనించక తప్పదు. విద్యార్థులో, కొన్ని ఉద్యమసంఘాలో తప్ప, అల్లూరి ను గుర్తుచేసుకోకపోవడం, ఈ దేశ పాలకబృందాల పరిమితులను చెబుతుంది.
జలియన్ వాలాబాగ్ మారణకాండకు 2019 లో వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఒకటి రెండేళ్ల ముందు నుంచి దేశంలో సన్నగా అయినా ఒక డిమాండ్ వినిపించసాగింది. ఆ హత్యాకాండకు బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని నూరేళ్ల స్మారక కమిటీ కూడా గట్టిగా కోరింది. ఆశ్చర్యకరంగా బ్రిటన్ పార్లమెంట్ లో 77 మంది సభ్యులు ఆ ప్రతిపాదన చేశారు. అందులో అనేకమంది శ్వేతజాతి పార్లమెంటేరియన్లు కూడా ఉన్నారు. భారతదేశంలో మాత్రం శిరోమణి అకాలీదళ్ కు చెందిన ఒక ఎంపీ తప్ప మరే పార్టీ కానీ, సభ్యుడు కానీ ఆ ప్రస్తావన తేలేదు. అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ ఆ డిమాండ్ చేయలేదు. దౌత్యమార్గాలలో కూడా ప్రభుత్వం ఎటువంటి సూచనా చేయలేదు. అమానుష హత్యాకాండ అని డేవిడ్ కేమరూన్ వ్యాఖ్యానించాడు కానీ, క్షమాపణ మాత్రం చెప్పలేదు. భారత్ లోని బ్రిటిష్ హైకమిషనర్ మాత్రం అమృతసర్ వెళ్లి, అమరవీరుల స్థూపం దగ్గర శ్రద్ధాంజలి ఘటించాడు. కానీ, అది క్షమాపణ కాదు. జాతీయోద్యమం త్యాగభరిత చరిత్ర నుంచి స్ఫూర్తిని రగిలించి, దేశభక్తిని మరింత పెంపొందించగల ఆ ఆకాంక్షను, ఎందుకు పాలకులు నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు? ప్రధానమంత్రి అమృతసర్ వెళ్లి, అక్కడి స్మారకోత్సవంలో పాల్గొనలేకపోయారు?
చారిత్రక గాయాల గురించి, పరిహారాల గురించి మన నాయకులు ఇప్పుడు ఎంతో ఉద్వేగభరితంగా మాట్లాడుతున్నారు. అయోధ్యలో కాషాయధ్వజారోహణ జరిగిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, 500 సంవత్సరాలుగా బాధిస్తున్న గాయాలకు రామాలయ నిర్మాణం ఉపశమనంగా అభివర్ణించారు. ఇప్పుడిక సాంస్కృతిక సగర్వభావాన్ని పునరుద్ధరించాలని, వలసవాద పాలన కలిగించిన ఆత్మన్యూనతా భావాన్ని అధిగమించాలని అన్నారు. ఇది సాంస్కృతిక పునరుజ్జీవన దశ అని కూడా అన్నారు. బాబర్ చేసినట్టు చెబుతున్న గాయం దగ్గర నుంచి మెకాలే చేశాడంటున్న గాయం దాకా మోదీ, ఆయన బృందం ప్రయాణించింది. ఈ వ్యాఖ్యానం గురించి, అన్వయాల గురించి కొత్తగా మాట్లాడుకునేదేమీ లేదు. ఆయన తన రాజకీయార్థిక దృష్టికోణం నుంచి, దానికి కీలకమయిన సాంస్కృతిక సామాజిక ప్రాతిపదికల గురించి చెబుతున్నారు. ఇక్కడ కలుగుతున్న సందేహమల్లా, ఎందుకు కొన్ని గాయాల విషయంలోనే ఉపశమన ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఎందుకు, కొన్ని గాయాల స్మరణ కూడా జరగడం లేదు? బ్రిటిష్ క్షమాపణను డిమాండ్ చేయడం ద్వారా గాయపడిన జాతి ఆత్మను ఆనాడు ఎందుకు స్పృశించలేకపోయారు? వలసవాద మానసికస్థితిని గురించి మీరేనా ఇప్పుడు మాట్లాడుతున్నది?
“భారతదేశంలో కులవ్యవస్థ. అది చరిత్ర నుంచి జరుగుతూ వస్తున్న ఘోరమే. అదే సమయంలో వర్తమానంలోనూ పచ్చి వాస్తవం. అదేమీ పరికల్పిత గాయం కాదు. అస్పృశ్యతను ధర్మంగా చెప్పి, కుల వ్యవస్థకు సాధికారత కల్పించి, మనుషులను విభజించి, అసంఖ్యాకులకు విద్య, ఆర్థిక అవకాశాలను, సామాజిక ప్రతిపత్తిని నిరాకరించిన మతపెద్దలను, వారిని తలకెత్తుకున్న పాలకవంశాలను ఏ బోనులో నిలబెట్టాలి? ఏ పీఠాధిపతులూ ఇంతవరకు కనీస పశ్చాత్తాపం ప్రకటించలేదు. వాళ్ల నుంచి అట్లా అడిగిన సంఘసంస్కర్తలూ లేరు. రిజర్వేషన్లతో పరిహారం జరుగుతుందా? ఇప్పటికీ యావత్ సమాజాన్ని గుప్పిటిలో పెట్టుకున్నవే వర్గాలు, కులాలు? కులం పోకుండా వెయ్యేళ్ల నిరాఘాట పురోభివృద్ధి సాధ్యమేనా? జాతి సాంస్కృతిక పునరుజ్జీవనంలో కులనిర్మూలన లేదా?”
జ్ఞాపకం అన్నది ఒక రాజకీయ ఆయుధం అయినప్పుడు, పరికల్పిత జ్ఞాపకాలు, వాస్తవ జ్ఞాపకాలు రెండూ సాధ్యమే. వక్రీకరణలకు, యథేచ్ఛా అన్వయాలకు ఎన్నో అవకాశాలుంటాయి. విశ్వాసాలను బట్టి యథార్థమనుకునే జ్ఞాపకాలుంటాయి. భౌతిక గాయాలు వర్తమానంలోనూ కనిపిస్తుంటే, వాటికి సంబంధించిన చారిత్రకజ్ఞాపకాలుంటాయి. ఉదాహరణకు, అమెరికాలో స్థానిక ఆదివాసుల మారణకాండ, ఆఫ్రికా నుంచి పడవల్లో పశువుల్లా తరలించుకుపోయిన నల్లవారి బానిసత్వం. ఆ రెంటి అవశేషాలూ పర్యవసానాలూ ఆ దేశంలో కళ్లెదుట కనిపించేవే. పైగా, స్థానికులను ఊచకోత కోసి, ఆ భూఖండాన్ని ఆక్రమించిన విషయాన్ని తెల్లయూరోపియన్లు ఏమీ మభ్యపెట్టరు. పైగా, దాన్నొక కర్తవ్యంగా, నాగరికతానిర్వహణగా చెబుతాయి. కొలంబస్ అమెరికాను ‘కనుగొని’ 500 ఏళ్లు అయిన సందర్భంగా, ఆ గాయం అవశేష ఆదివాసులనే కాదు, సకల అమెరికన్లను తట్టి లేపింది. పరిహారం డిమాండ్ మారుమోగింది. కానీ, ఏమి ఇవ్వగలరు? అమెరికాను తిరిగి అప్పగించగలరా? నేటివ్స్ ను నెత్తిన పెట్టుకోగలరా? కనీసం కొంత పశ్చాత్తాపం వ్యక్తమైంది. పాపభారం మాత్రం చరిత్ర అంతా వెంటాడుతూనే ఉంటుంది.
భారతదేశంలో కులవ్యవస్థ. అది చరిత్ర నుంచి జరుగుతూ వస్తున్న ఘోరమే. అదే సమయంలో వర్తమానంలోనూ పచ్చి వాస్తవం. అదేమీ పరికల్పిత గాయం కాదు. అస్పృశ్యతను ధర్మంగా చెప్పి, కుల వ్యవస్థకు సాధికారత కల్పించి, మనుషులను విభజించి, అసంఖ్యాకులకు విద్య, ఆర్థిక అవకాశాలను, సామాజిక ప్రతిపత్తిని నిరాకరించిన మతపెద్దలను, వారిని తలకెత్తుకున్న పాలకవంశాలను ఏ బోనులో నిలబెట్టాలి? ఏ పీఠాధిపతులూ ఇంతవరకు కనీస పశ్చాత్తాపం ప్రకటించలేదు. వాళ్ల నుంచి అట్లా అడిగిన సంఘసంస్కర్తలూ లేరు. రిజర్వేషన్లతో పరిహారం జరుగుతుందా? ఇప్పటికీ యావత్ సమాజాన్ని గుప్పిటిలో పెట్టుకున్నవే వర్గాలు, కులాలు? కులం పోకుండా వెయ్యేళ్ల నిరాఘాట పురోభివృద్ధి సాధ్యమేనా? జాతి సాంస్కృతిక పునరుజ్జీవనంలో కులనిర్మూలన లేదా?
అయోధ్యలో రామాలయమే కాదు, వాల్మీకికి, వశిష్ఠుడికి, విశ్వామిత్రుడికి, నిషాదరాజుకి, శబరి కి, హనుమంతుడికి కూడా ఆలయాలున్నాయని, అందరూ కలిస్తేనే ధర్మమని సమ్మిశ్రితత్వానికి అదే ఉదాహరణ అని నరేంద్రమోదీ గర్వంగా చెప్పారు. భారతీయ సమాజం ఆదర్శరూపం అది అని ఆయన ఉద్దేశం కావచ్చు. నిషాదరాజులు, శబరిమాతలు వర్తమాన సమాజంలో ఎటువంటి ప్రతిపత్తితో ఉన్నారో జనం గమనిస్తూనే ఉన్నారు. శాంతి, సత్యాల పునఃస్థాపనతో పాటు, దౌర్జన్యశక్తులను నిర్మూలించడం కూడా భగవద్గీత బోధిస్తున్నదని ఆయన ఉడిపి కృష్ణుడి దగ్గర చెప్పిన మాటల సారం ఏమిటో కూడా సులువుగానే బోధపడుతుంది. ఆదివాసుల విషయంలో రామాయణ భారతాల రాజుల దగ్గర నుంచి నేటి పాలకుల దాకా చేసిన అపచారాలు, అపహరణలు, ఆక్రమణలు, ఊచకోతలు, ఎన్ని పరిహారాలతో తీరేను? ఎప్పటికి వాటికి గాయాల హోదా దక్కేను?
“శకులు, పహ్లవులు, గజ్నీలు ఘోరీలు, షేర్‌షాలు, మధ్యాసియా సంచారతెగలు, మంగోలియన్ నియంతలు, బయటి నుంచి వచ్చి చేసిన దోపిడీలు, దుర్మార్గాలు సరే, కళింగం మీద అశోకుడేమి చేసెను? ఎడతెగని పోరుతో చోళులేమి చేసిరి? రాయచూరు మీద రాయలేమి చేసెను? మేడారంలో కాకతీయులేమి చేసిరి? తళ్లికోట వద్ద బహమనీలు, ఓరుగల్లును తుగ్లక్ లు, గోలకొండను మొగలులు ఏమి చేసిరి, ఏమి చేసిరి? నెత్తురుపారని యుద్ధాలేవీ లేవు. ప్రేమగల్ల పెత్తనాలేమీ లేవు. చరిత్ర నుంచి నడచివచ్చి ఇప్పుడెవరు ఎవరికి సంజాయిషీలు ఇవ్వబోతున్నారు, క్షమాపణలు చెప్పబోతున్నారు?”
స్త్రీలను విద్యకు దూరం చేసి, నీతినియమాల సంఘధర్మాల బాధ్యురాలిని చేసి, సంతానహక్కులు లేకుండా చేసి, భర్త చనిపోతే బతుకే లేకుండా చేసిన సహస్రాబ్దుల ధర్మశాస్త్రాల, సంప్రదాయాలు చేసిన గాయాలకు ఏది ఉపశమనం? ఏ ధార్మికుడు, ఏ ప్రవచనకారుడు, ఏ మతపెద్ద స్త్రీలకు క్షమాపణ చెప్పాలి? ఏ కూల్చివేత, ఏ పునర్నిర్మాణం ‘ఆమె’కు ఉపశమనం ఇవ్వాలి? తప్పుజరిగిందని మోకరిల్లకపోతే, భూమిపై సగం ఆకాశంలో సగం అయ్యేదెప్పుడు?
శకులు, పహ్లవులు, గజ్నీలు ఘోరీలు, షేర్‌షాలు, మధ్యాసియా సంచారతెగలు, మంగోలియన్ నియంతలు, బయటి నుంచి వచ్చి చేసిన దోపిడీలు, దుర్మార్గాలు సరే, కళింగం మీద అశోకుడేమి చేసెను? ఎడతెగని పోరుతో చోళులేమి చేసిరి? రాయచూరు మీద రాయలేమి చేసెను? మేడారంలో కాకతీయులేమి చేసిరి? తళ్లికోట వద్ద బహమనీలు, ఓరుగల్లును తుగ్లక్ లు, గోలకొండను మొగలులు ఏమి చేసిరి, ఏమి చేసిరి? నెత్తురుపారని యుద్ధాలేవీ లేవు. ప్రేమగల్ల పెత్తనాలేమీ లేవు. చరిత్ర నుంచి నడచివచ్చి ఇప్పుడెవరు ఎవరికి సంజాయిషీలు ఇవ్వబోతున్నారు, క్షమాపణలు చెప్పబోతున్నారు?
సమాజంలో అంతర్గత ఐక్యత సాంస్కృతిక, ధార్మిక బంధంతో ఏర్పడవచ్చు. ఆ ఐక్యత ఆ సమాజం పురోభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది కూడా. కానీ, ఐక్యత, బంధమూ రెండూ సానుకూల భావనలు. ప్రతికూల భావనలు కావు. మనుషుల మధ్య అంతరాలు లేనప్పుడు, అందరికీ అవకాశాలు అందుబాటులో ఉన్నప్పుడు, సహజీవనం ఒక విలువ అయినప్పుడు, పరస్పరత నుంచి ప్రగతి సాధ్యమవుతుంది. చరిత్రలోనుంచి ఒక శత్రువును ఆవాహన చేసుకుని, వర్తమానంలోని ఒక ప్రజావర్గంతో ఆ శత్రువును అనుసంధానం చేసి, ద్వేషం ఆధారంగా కలిగించాలనుకునే ఐక్యత తాత్కాలికంగా దృఢంగా కనిపించవచ్చును కానీ, అది నిలబడదు. ఏ సమాజానికైనా, జాతికైనా ఒక పరంపర, వారసత్వ స్ఫూర్తి అవసరమే. చరిత్ర నుంచి కొనసాగింపు భావనా ముఖ్యమే. ఆదిమ తాత్వికుల నుంచి గౌతమబుద్ధుడి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి ఇటీవలి సామాజిక చింతనుల, సాధకుల దాకా ఒక సమాంతర వంశవృక్షం భారతీయతకు ఉన్నది. భావనాత్మక గాయాలకు కట్టుకట్టడం కంటె వాస్తవ వ్రణాలకు చికిత్స చేయడంతోనే జాతి ఆత్మ ఉపశమిస్తుంది.




