తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత రాజకీయపార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. మేడ్చల్ పరిధిలోని ముదిరాబాద్ శివారులో ఈ నెల 25వ తేదీన ఉదయం పదిగంటలకు పార్టీ పేరు, జంఢా, ఎజండాను ప్రకటించనున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. బిఆర్‌ఎస్ పార్టీనుండి సస్పెండ్ అయిన తర్వాత మొదటిసారిగా ఫిబ్రవరి 6న రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తున్నట్లు ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ ఏర్పాటు సభను చాలా సాదాసీదాగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి ఇతర రాజకీయపార్టీ నాయకలనెవరిని ఆహ్వానించడం లేదు. కేవలం జాగృతి కార్యకర్తలు, అభిమానుల మధ్యనే నిర్వహించే ఈ సభలో కొత్తగా పార్టీలో చేరేవారెవరన్న విషయాన్ని మాత్రం గుప్తంగా ఉంచారు. అందుకే పార్టీ ప్రారంభ కార్యక్రమంలో చేరికలుండవని కవిత స్పష్టం చేయడం గమనార్హం. అంతవరకు బాగానేఉన్నా ఆమె పెట్టబోయే పార్టీ పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ‘తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ’గా నామకరణం చేయాలనుకున్నప్పటికీ, ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం పెట్టడంతో మరోపేరు ఆమోదం కోసం తీవ్ర కసరత్తు మొదలైంది. కాగా ఈనెల 25న జరిగే సభలో ప్రకటించనున్న పార్టీ పేరు విషయంలో కవిత ఇటీవల ఇచ్చిన లీకు, రాష్ట్ర రాజకీయల్లో ఒక కుదుపు కుదిపిందనే చెప్పాలె. ముఖ్యంగా కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్‌పార్టీకి పెద్ద షాక్ ఇచ్చినట్లైంది. ఆమె తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితిగా నామకరణం చేయబోతున్నదా అన్న అనుమానాలకు తావేర్పడింది.
కవిత పార్టీ పేరేంది ..?

తెలంగాణరాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) ఆ తర్వాత రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినవిషయం తెలిసిందే. ప్రజలు తనవెంటే ఉన్నారన్న ధైర్యంతో టిఆర్‌ఎస్ అధినేత దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకువస్తానంటూ జాతీయస్థాయి పార్టీగా టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చారు. జాతీయస్థాయి రాజకీయాలేమోగాని, రాష్ట్ర రాజకీయాల్లో ఆ పార్టీకి ఆ పేరు శాపగ్రస్తమైంది. అధికారాన్ని కోల్పోవడమేకాదు, గడచిన రెండున్నర ఏళ్ళలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో రెండో స్థానం లేదా అంతకు దిగువకు చేరుకుంటూ వస్తున్నది. తెలంగాణ సాధనలో భాగంగా 2001లో ఏర్పడిన టిఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల్లో భాగమైంది. అలాంటి టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత వరుస ఓటములు ఎదురవుతూ వచ్చాయి. ఆ పార్టీలో తెలంగాణ పదాన్ని తీసివేయడంవల్లే పార్టీ ప్రజలకు దూరమవుతూ వచ్చిందన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరిగి పాత పేరునే ఖరారు చేయాలని అధిష్టానంపైన ఒత్తిడి తీసుకువచ్చిన సంఘటనలనేకం ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు తెరాసకున్న పేగుబంధం దీంతో తెగిపోయిందంటూ విపక్షాలు విస్తృత ప్రచారం చేశాయి. దానికి తగినట్లు సాంకేతికపరంగా తిరిగి టిఆర్‌ఎస్ పొందటం సాధ్యంకాదని ఆపార్టీ అధినేత చెప్పడం పార్టీశ్రేణులను తీవ్రనిరాశకు గురిచేసింది. అదిప్పుడు మళ్ళీ ప్రధానాంశంగా మారింది.
ఏ రాజకీయపార్టీ అయినా తనపార్టీ పేరును మార్చుకున్నప్పుడు ముందుగా ప్రకటించుకున్న పేరును రెండేళ్ళవరకు ఫ్రీజ్ అయి ఉంటుందట. అయితే ఆ గడువు కూడా బిఆర్‌ఎస్ అధిగమించడంతో ఇప్పుడు టిఆర్‌ఎస్‌ను ఎవరైనా వాడుకునే అవకాశముంది. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్న కల్వకుంట్ల కవిత అదే విషయాన్ని తాజాగా పేర్కొనడం పెద్ద సంచలనానికి దారి తీసింది. ఎవరైనా వాడుకోవచ్చంటూ టిఆర్‌ఎస్ ప్రస్తావనను కవిత ప్రత్యేకంగా తీసుకురావడాన్ని చూస్తే తన పార్టీకి టిఆర్‌ఎస్‌గా నామకరణ చేస్తుందా? అన్నదిప్పుడు అందరికి వెయ్యి డాలర్లు ప్రశ్నగా మారింది. ఒకవేళ కవిత తనపార్టీపేరు టిఆర్‌ఎస్‌గా నామకరణం చేసినట్లైతే బిఆర్‌ఎస్ పరిస్థితేమిటన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.
2001లో టిఆర్‌ఎస్ ఏర్పాటు చేసినప్పటినుండి తెలంగాణ ఉద్యమమంతా దాని చుట్టూనే తిరుగుతూవచ్చింది. తెలంగాణ అంటేనే టిఆర్‌ఎస్, టిఆర్‌ఎస్ అంటేనే తెలంగాణ అన్నంతగా ప్రజల్లో ఐక్యమైపోయింది. దేశం లో ఒక ప్రాంతం కోసం ఉద్యమించి, ఆ ప్రాంతంలో దశాబ్దకాలంగా అధికారంలో కొనసాగిన ఏకైక పార్టీగా టిఆర్‌ఎస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ 2023 ఎన్నికలకు ముందు ఆ పార్టీలోని ‘తెలంగాణ’పదాన్ని తొలగించి ‘భారతీయ’ని జోడించడాన్ని తెలంగాణాభిమానులెవరూ జీర్ణించుకోలేకపోయారు. దానికి తగినట్లుగా కాంగ్రెస్ దూకుడును ఆ పార్టీ తట్టుకోలేకపోయింది. 2023లో ఆ పార్టీపక్షాన గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం, పలువురు క్రిందిస్థాయి నాయకులు, సీనియర్లు కాంగ్రెస్, బిజెపి బాటపట్టడంతో ఆ పార్టీ ప్రతిష్ట క్రమేణ మసకబారటం ప్రారంభించింది.
ఉద్యమ కాలంనుండి ఆపార్టీ పటిష్టకు తన వంతు సహకారం అందించిన స్వయాన ఆపార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు కల్వకుంట్ల కవితను పార్టీనుండి బహిష్కరించడం ఆపార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఏకు లాంటిది అనుకున్న కవిత మేకుగా మారుతుందని బిఆర్‌ఎస్ నాయకులు కలలోకూడా ఊహించి ఉండరు. తాను బహిష్కరణకు గురైనప్పటినుండి బిఆర్‌ఎస్ పార్టీపైనా, ఆ పార్టీ ముఖ్యనేతలు హరీష్‌రావు, కెటిఆర్, సంతోష్‌రావులపై ఆమె బాణాలను సందిస్తూవస్తోంది. తండ్రి మంచి వాడే అయినా ఆయన చుట్టూ దుష్ట గ్రహాలు చేరి పార్టీ ప్రతిష్టను, అధినేత కెసీఆర్ ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ వారిపైన ఏకధాటిగా కవిత దాడి మొదలెట్టింది. ఇది ఇతర రాజకీయ పక్షాలకు కూడా అలుసుగా మారింది.
ఉద్యమ నాయకుడి కన్నకూతురే బిఆర్‌ఎస్ పైన అవినీతి, అక్రమాల ఆరోపణలు చేయడం ఆ పార్టీలకు అవకాశంగా మారింది. అధికారాన్ని చేజిక్కించుకున్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీస్వీకారం చేసినప్పటినుండి బిఆర్‌ఎస్‌ను అంతమొందించాలన్న పట్టుదలను ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. దానికి ఇప్పుడు కవితకూడా తోడు కావడంతో బిఆర్‌ఎస్ గడ్డుకాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇప్పటికైనా బిఆర్‌ఎస్ అధినేత తమ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేక్రమంలో పార్టీకి తిరిగి టిఆర్‌ఎస్‌గా నామకరణ చేస్తారన్న ఆశ ఇంతవరకు కార్యకర్తల్లో ఉంటూవచ్చింది. కాని ఇప్పుడు ఆ అవకాశంకూడా లేదన్న విషయం కవిత మాటల్లో స్పష్టమైంది. అంతేకాదు, ఆ పేరును ఎవరైనా పెట్టుకోవచ్చు అనడంతో కవిత తాను పెట్టబోయే పార్టీకి ఆపేరును ఖరారు చేస్తుందా? ఆ పేరే పెట్టినట్లైంతే ఇక బిఆర్‌ఎస్‌కు కష్టకాలం దాపురించినట్లేననుకుంటున్నారు.
పార్టీ నిర్మాణం విషయంలో కవిత ఆచితూచి అడుగులు వేస్తున్నది. బిఆర్‌ఎస్‌నుండి బహిష్కరణకు గురైనప్పటినుండి ఆమె సొంత పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టింది. అందులో భాగంగానే అమె దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుట్టబెట్టింది. 2025 అక్టోబర్ 25 నుండి 2026 ఫిబ్రవరి 13వరకు చేసిన రాష్ట్ర పర్యటనలో మేధావులను, విద్యావంతులు, తెలంగాణ అభిమానులెందరినో కలుసుకున్నారు. ఏ ప్రాంతంలోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారన్న విషయాన్ని స్వయంగా తెలుకునే ప్రయత్నం చేసింది. అంతేకాదు , బాధితుల పక్షాన పోరాటం చేసింది. కార్మికులు, రైతులు, కర్షకుల పక్షాన ప్రభుత్వంతో పోరాటం చేసింది. ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితుల పక్షాన న్యాయం కోసం నిరాహారదీక్ష చేసి, అరెస్టు అయింది. సింగరేణి కార్మికులు, నిజామాబాద్ పసుపు రైతుల పక్షాన నిలబడ్డారు. తాజాగా రిటైర్డ్ అడిషినల్ డిజీ డిటి నాయక్‌ను, మరికొందరు బంజారా ప్రముఖులను కలుసుకుని వారి సమస్యలపై చర్చించారు. అలాగే బిఆర్‌ఎస్‌కు చెందిన మాజీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కొందరు తనతో టచ్‌లో ఉన్నట్లు కూడా ఆమె చెబుతున్నారు. అదే నిజమైతే బిఆర్‌ఎస్ మసకబారటం గ్యారంటీ అంటున్నారు విశ్లేషకులు.
ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేల వెన్నుపోటుకు బిఆర్‌ఎస్ గురైన విషయం తెలిసిందే. వారు చేసిన ఆరోపణలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడు మరికొందరు కవిత బాట పడితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో నెలకొంది. ఏది ఏమైనా ఒంటిచేత్తో ఇంతటి సంఘర్షణ చేస్తున్న కవిత ఈ నెల 25న ప్రారంభించనున్న తన పార్టీకి టిఆర్‌ఎస్ పేరునే ఖరారు చేస్తుందా? అదే నిజమైతే బిఆర్‌ఎస్ పరిస్థితేమిటన్నదిప్పుడు యావత్ తెలంగాణ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. పార్టీ పేరు పాతదే అయినా జండా, ఎజెండా కొత్తది అని ఆమె చేసిన ప్రకటన మరింత ఉత్సుకతను కలిగిస్తున్నది.




