– ఒక్కరూ ముందుకు రాని ప్రాజెక్టు నిర్మాణమేంటి?
– ఎవరి లాభం కోసం దీని నిర్మాణం?
– రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలి
– మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: అప్పులు పుట్టడం లేదని, తమను ఎవరూ నమ్మడం లేదని ప్రతి వేదిక మీద తన చేతకాని తనాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్ కు రూ. 6,200 కోట్లతో హిమాచల్ ప్రదేశ్లో తెల్ల ఏనుగు లాంటి హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి టీజీ జెన్ కోను రంగంలోకి దింపడం తుగ్లక్ చర్య తప్ప మరొకటి కాదని బీఆర్ ఎస్ నేత హరీష్‌రావు విమర్శించారు. హిమాచల్ లో హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి మోసర్ బేర్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ పారిపోయిన, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ కంపెనీ మూడేళ్ల తర్వాత సాధ్యం కాదని వదిలేసిన 510 మెగావాట్ల ప్లాంట్‌ని కట్టేందుకు టీజీ జెన్ కో ఒప్పందం ఎందుకు చేసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు దశాబ్దాల కాలంలో ఒక్కరు కూడా కట్టేందుకు ముందు రాని ప్రాజెక్ట్ ను ఎందుకు నేడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టవలసి వస్తోంది? డీపీఆర్ లేకుండానే తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రభుత్వం తో ఎంవోయు చేసుకొని అప్ ఫ్రంట్ ప్రీమియం కింద రూ. 26 కోట్లు చెల్లించి మరో రూ.26 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడడాన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెపుతున్న మాటలు ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికేనని తేలిపోయాయన్నారు.
2009లోనే మోసర్ బేర్ కంపెనీ రూ.64 కోట్ల అప్ ఫ్రంట్ ప్రీమియం చెల్లించి హిమాచల్ ప్రదేశ్ లోని ప్రతిపాదిత సేలి, మియార్ లో హైడ్రో పవర్ ప్రాజెక్టులు కట్టాలని భావించింది. కానీ సాంకేతికంగా, ఆర్థికంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అనంతరం తాము చెల్లించిన రూ. 64 కోట్ల ప్రీమియంని హిమాచల్ ప్రభుత్వం తిరిగి ఇవ్వనందుకు గాను ఆ రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించింది. హిమాచల్ హైకోర్టు మోసర్ బేర్ కంపెనీకి వడ్డీతో సహా తీసుకున్న డబ్బును 2023 జనవరిలోనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతిని ఆయన గుర్తుచేశారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఢిల్లీలోని హిమాచల్ భవన్ ను వేలం వేసి ఆ డబ్బుని కంపెనీకి చెల్లించాలని 2024 నవంబర్ లో హైకోర్టు ఆదేశాలు జారీచేసిందన్నారు. ఏడు నెలలకు పైగా అత్యధికంగా మంచు కురిసే ప్రాంతంలో హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ సాధ్యం కాదని 2019లో ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ కూడా చేతులు ఎత్తేసి ఒప్పందాన్ని రద్దు చేసుకుందన్నారు. అలాంటి అనువు కాని ప్రాంతం లో రూ.6,200 కోట్ల ప్రాథమిక అంచనాతో 510 మెగా వాట్ల హైడ్రల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఉబలాటపడుతుందో శ్వేత పత్రం విడుదల చేయాలని భట్టి విక్రమార్కను డిమాండ్ చేస్తున్నామన్నారు. ఫీజిబిలిటీ రిపోర్ట్లు, డీపీఆర్ లు లేకున్నా, జెన్ కో బోర్డు ఆమోదం లేకున్నా కూడా ఎంవోయూ చేసుకొని రూ.26 కోట్లు ఎందుకు చెల్లించారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని, అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.
రెండు కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న గూడు పుఠాణి ఏందో గల్లీ కాంగ్రెస్ చెప్తుందా? ఢిల్లీ కాంగ్రెస్ చెప్తుందా? హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చెప్తుందా? అని ప్రశ్నించారు. సాధ్యం కాదు అని రెండు దశాబ్దాలుగా కట్టని ప్రాజెక్టును ఎవరి లాభం కొరకు, ఎవరి మెప్పు కొరకు కడుతున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని కోరారు. ఏ పథకం అమలుకూ నిధులకొరతను సాకుగా చూపే రేవంత్ హిమాచల్ లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్ కు రూ. 6,200 కోట్లు ఎక్కడ నుండి వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నిర్దిష్టమైన సమాచారం తమ వద్ద ఉంది. త్వరలోనే కాంగ్రెస్ అవినీతి బండారాన్ని పూర్తి ఆధారాలతో బయటపెడతామని హెచ్చరించారు.



ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే