– కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు
– ఫలించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య కృషి
వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 16: వరంగల్ నగర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంపీ డాక్టర్ కడియం కావ్య నిరంతర కృషికి కీలక విజయం లభించింది. వరంగల్ జిల్లాలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ కార్యాలయాలను అధికారులతో కలిసి ఎంపీ స్వయంగా పరిశీలించారు. వాటిలో వరంగల్‌లోని ఆకాశవాణి పరిధిలోని సిబ్బంది క్వార్టర్స్‌లో వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘకాలంగా వరంగల్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కోసం పార్లమెంట్ సమావేశాలతోపాటు, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖలతో ఎంపీ డాక్టర్ కావ్య సంప్రదింపుల కృషి ఫలితంగా ఎట్టకేలకు వెల్నెస్ సెంటర్ మంజూరైంది.
దేశవ్యాప్తంగా సుమారు 22 వెల్నెస్ సెంటర్‌లకు మంజూరు ఇవ్వగా వరంగల్ జిల్లాకు మాత్రమే అన్ని అనుమతులు లభించాయని ఆమె స్పష్టం చేశారు. వెల్నెస్ సెంటర్‌ను తన ఎంపీ నిధుల ద్వారా కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. వరంగల్ పరిధిలో ఉన్న 54 ప్రధాన పట్టణాల్లోని 15వేల మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు, వారి కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందించడానికి ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ కావ్య తెలిపారు. తన విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించి వెల్నెస్ సెంటర్ మంజూరు చేసిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వెల్నెస్ సెంటర్‌లో వెంటనే పనులు ప్రారంభించాలని సీజీహెచ్‌ఎస్ డైరెక్టర్ రోహిణీని ఎంపీ కోరారు. దశాబ్దాలుగా పెండిరగ్‌లో ఉన్న వెల్‌నెస్ సెంటర్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య చొరవతో మంజూరు కావడం పట్ల ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





