– దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన
– ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రదర్శన
– ప్రత్యేక ఆకర్షణగా సినీ నటుడు చిరంజీవి
దావోస్, జనవరి 21: ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్‌లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే ఏటా జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ఫాలో-అప్ ఫోరం నిర్వహించాలని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధులకు సూచించారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, రూ.5.75 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు ఆకర్షించిందని సీఎం తెలిపారు. ఏటా తాTము ఎంవోయూలపై సంతకాలు చేయడానికి దావోస్‌కు వస్తాం.. కానీ ఈసారి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావటంతో తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చాం అని తెలిపారు. హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీఎస్) ప్రధాన కేంద్రంగా మారిందని సీఎం అన్నారు. మూసీ నది పునరుజ్జీవంతోపాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి నైట్ టైమ్ ఎకానమీపై దృష్టి పెడతామని చెప్పారు. దేశంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఇందులో 50 శాతం కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను ప్రదర్శించారు. అదే వేదికపై తెలంగాణ-ఇన్నోవేషన్ హబ్, తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ను ఆవిష్కరించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణ, చెరువులు, కుంటల పునరుజ్జీవం వంటి గేమ్-చేంజర్ ప్రాజెక్టులను వివరించారు. కొత్తగా ప్రతిపాదించిన కోర్, ప్యూర్, రేర్ అర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను ప్రస్తావించారు. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రితో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు.
రూ.6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ 
క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎసఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) సమర్పించింది. దావోస్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐక్యూ కేపిటల్ గ్రూప్ చైర్మన్ డా. జాన్ బాబిక్, గ్రూప్ సీఈఓ, డైరెక్టర్ అనిల్ కుమార్ బావిసెట్టి, గ్రీన్ హౌస్ ఎన్విరో సీఈఓ, డైరెక్టర్ మొలుగు శ్రీపాల్ రెడ్డి , స్లోవాక్ రిపబ్లిక్ కాన్సుల్ మాటుస్ జెమెస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2047 నాటికి నెట్-జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో సుస్థిర అభివృద్ధే తెలంగాణకు ప్రధానమని స్పష్టం చేశారు. స్లోవేకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్‌కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడింది. గరిష్ఠంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్టు మొత్తం పెట్టుబడి విలువ 600 మిలియన్ యూరోలు (సుమారు రూ.6,000 కోట్లు).
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





