తెలంగాణ జన సమితి సదస్సులో పలువురు వక్తలు
పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై సెమినార్
డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా వేదిక ఏర్పాటు చేయాలని తీర్మానం
దక్షిణ భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును హరించే విధంగా బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను పలువురు వక్తలు తీవ్రంగా ఖండించారు. సోమవారం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో “పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ – దక్షిణ భారత భవిష్యత్” అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తమిళనాడు చిదంబరం ఎంపీ, వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్, విల్లుపురం ఎంపీ డాక్టర్ రవికుమార్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్ర మూర్తి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన డా. సుధాకర్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత కె. గోవర్ధన్, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కి చెందిన అన్వేష్, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కన్నెగంటి రవి, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు అంబటి నాగయ్య, వీసీకె పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీలకర శ్రీనివాస్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్, సీడీఎస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, సీపీఐ కార్యదర్శి పశ్య పద్మ, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సెమినార్‌లో పాల్గొన్న ప్రతీ వక్తా, దక్షిణ భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును హరించే విధంగా బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను తీవ్రంగా ఖండించారు. ఇది దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని క్షీణింపజేసే కుట్రపూరిత చర్యగా అభివర్ణించారు. ఈ సదస్సులో పలు తీర్మానాలను చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనలో ఇప్పుడున్న సీట్ల సంఖ్యను పెంచొద్దని, ఆ పరిమితికి లోబడి పునర్వ్యవస్థీకరణ జరగాలని తీర్మానించారు.
దేశ సమగ్రతను కాపాడడానికి జనాభా మార్పులు, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక అంశాలను సమతుల్యంగా పరిగణించాలని, డీలిమిటేషన్ ప్రక్రియలో న్యాయపరమైన పారదర్శకత, సమానత్వం ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక, లౌకిక ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పక్షాలతో కలిసి విశాల వేదిక ఏర్పాటు చేయాలని సదస్సులో తీర్మానించారు.




