-పోడుభూముల్లో సోలార్ పంపుసెట్లను అందిస్తున్నాం
– రైతులకోసం రూ.60వేల కోట్లు ఖర్చు చేశాం
– 3కోట్ల పదిలక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం
– వరి వేస్తే సిరి అనే పరస్తితులు కల్పించాం
– మహిళలు, రైతులు, పేదలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నల్లమల బిడ్డగా ఈ గడ్డపై నుంచి ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే నా గుండె ఉప్పొంగుతోంది. అచ్చంపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం మీ బిడ్డగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఆ దిశగా అధికారులకు సూచనలు చేశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాచారంలో సోమవారం “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ పోడు భూములపై పోరాటం చేసిన వారిని జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిదన్నారు. పోడు భూముల్లో సోలార్ పంపుసెట్లను అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత మా ప్రభుత్వానిదన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపుసెట్లు అందిస్తాం.రాబోయే వంద రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమం త్రి అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 60 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేసిందని గుర్తు చేశారు. సన్నాలు పండించే రైతులకు మద్దతు ధరతోపాటు రూ. 500 బోనస్ అందిస్తున్నాం.
వరి వేస్తే ఊరే అనే పరిస్థితుల నుంచి వరి వేస్తే సిరి అనే పరిస్థితులు కల్పించడంతో పాటు పేదలందరికీ సన్న బియ్యం అందించి వారి ఆత్మగౌరవం పెంచామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మంది పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గుర్తుచేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి స్వయం సహాయక సంఘాల మహిళలలకు అప్పగించామన్నారు.ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. తెలంగాణను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏడాదిలో 60 వేల ఉద్యోగ నియామకాలను చేపట్టామని గుర్తుచేశారు. నిత్యావసర ధరలను నియంత్రించి పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిన నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలోనూ తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది.
పాలమూరోల్లకు పాలన చేతకాదన్న వాళ్లకు.. తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టగలమని నిరూపించామని చురకలు అంటించారు. మీ భూమికి హక్కు ఇవ్వడమే కాదు.. మీ భూముల్లో సోలార్ పంపుసెట్లతో సాగు చేసుకునేలా నల్లమల బిడ్డగా నేను బాధ్యత తీసుకున్నానన్నారు. కొంతమంది తమ అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కడుపునిండా విషం పెట్టుకుని మనపై విష ప్రచారం చేసే వారిని నేను పట్టించుకోను. పేదల ఆకలి తీర్చే రేవంతన్న సన్న బియ్యం మేమేం చేస్తున్నదీ గుర్తు చేస్తుందన్నారు. రైతులు పాసు పుస్తకాలు చూసినప్పుడల్లా రుణమాఫీ చేసిన రేవంతన్న గుర్తొస్తాడు. బస్సులో ఉచిత ప్రయాణం చేసిన ఆడబిడ్డలకు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతున్న పేదలకు మా ప్రభుత్వం చేసే మంచి పనులు గుర్తుంటాయి.ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మన పథకాలే ప్రజలకు నిజాలను చెబుతాయి. తప్పుడు ప్రచారం చేసేవారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.



