రుణమాఫీపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు..

రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ను ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం.. మాజీ మంత్రి హరీష్ రావు

అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని,  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనతో రుణమాఫీ కథ ముగించే కుట్ర చేస్తున్నారని స్పష్టమవుతున్నదని అసెంబ్లీలో అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు విని రెండు లక్షలపైన రుణం ఉన్న రైతులు అప్పు చేసి, మిత్తి తో సహా బ్యాంకులకు కట్టారు. తమకు రుణమాఫీ ఎప్పుడు అవుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఈరోజు వ్యవసాయ మంత్రి ప్రకటనతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది.

రెండు లక్షల లోపు రుణ మాఫీ కాని వారి పరిస్థితి, రెండు లక్షల పైన రుణం ఉండి మాఫీ కాని రైతుల పరిస్థితి ఏమిటి? నమ్మి ఓటేసిన పాపానికి కాంగ్రెస్ సర్కారు నయవంచన చేసిందని మండిపడ్డారు. ఇలాంటి అసంబద్ధ ప్రకటన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ తెలంగాణ ప్రజలకు, రైతులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణమాఫీ చేసి తీరాలన్నారు. రైతులను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి ని ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ నిలదీస్తూనే ఉంటుందని, అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉంటుందన్నారు. రుణమాఫీ హామీ అమలును ప్రణాళిక ప్రకారం అటకెక్కించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హరీష్ రావు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *