– పాలమూరు అభివృద్ధే ప్రధాన లక్ష్యం
– ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
వెనుకబడిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని, అందుకు కావలసిన నిధులు సంపూర్ణంగా విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 12 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం స్థానికంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆర్ & ఆర్, భూ సేకరణకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేస్తామన్నారు. నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల మధ్య ఉన్న గ్యాప్ ను పూరించేందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్దండపూర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అవసరమైన రూ.70 కోట్లు వెంటనే విడుదల చేశామని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులు విడుదల చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, ప్రజలకు నిధులను ఖర్చు పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మంత్రివర్గం తెలంగాణ రాష్ట్రం ప్రపంచం తో పోటీపడేలా పరిపాలన చేస్తున్నదన్నారు. ప్రజల గొంతుకై శాసనసభలో మాట్లాడి ప్రజల అవసరాలను తీర్చి ప్రజాస్వామ్యంలో ఓటు విలువ పెంచే ఎమ్మెల్యేలను ఎన్నుకున్నందుకు మహబూబ్‌నగర్ ప్రజలను డిప్యూటీ సీఎం అభినందించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆనాడు చేపట్టిన జూరాల, కోయిల్ సాగర్, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామని గుర్తు చేశారు.
నాటి కాంగ్రెస్ పాలకులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతిస్తే 2015 జూన్ మాసంలో కరివేన ప్రాజెక్టు దగ్గర నాటి సీఎం కేసీఆర్ పునాది వేసి మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు, పదేళ్లయినా నీళ్లు ఎందుకు పారించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు హడావుడిగా నార్లాపూర్ వద్ద పంపు స్విచ్ ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేసి అద్భుతం చేశాం, పాలమూరు బంగారం అయ్యిందని అరచేతిలో వైకుంఠం చూపారు, చందమామ కథలు వినిపించారని డిప్యూటీ సీఎం ఎద్దేవా చేశారు. బాగా వెనుకబడిన పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పండుగ పేరుతో బహిరంగ సభ నిర్వహించి యావత్ కేబినెట్ ను ఆహ్వానించి వివరించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని యావత్ కేబినెట్ అర్థం చేసుకొని విద్యుత్తు, సాగునీరు, విద్యా, వైద్యం, రోడ్లు ఇలా అన్ని రంగాల్లో పాలమూరు అభివృద్ధి చేసేందుకు కావలసిన నిధులు ఎప్పటికప్పుడు అందిస్తోందన్నారు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలతో పాటు ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామన్నారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 22,500 కోట్లతో మనసున్న ప్రభుత్వం హృదయంతో ఆలోచించి నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మిస్తున్నదన్నారు. 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు సర్వరా చేస్తున్నాం. ఇందు కోసం ప్రతి సంవత్సరం విద్యుత్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 12,500 కోట్లు చెల్లింపులు జరుపుతోందన్నారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన పనిలేదని, పేదలకు డబ్బులు మిగలాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిని అన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకం ద్వారా రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు. ఈ పథకానికి ప్రభుత్వం ఏడాదికి రూ.200 కోట్లు చెల్లిస్తుందని వివరించారు. ఒక దేవరకద్ర నియోజకవర్గం లోని 45,155 మంది అంటే 71 ఒక శాతం గృహ జ్యోతి పథకాన్ని వినియోగించుకుంటున్నారని వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు గతంలో ఆర్థికంగా బలంగా ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాలను ఎందుకు అమలు చేయలేకపోయిందని ప్రశ్నించారు. జనంలో సగభాగమైన మహిళలను ఐదు సంవత్సరాలలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి సంవత్సరం రూ. 21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాలకు అందించామని తెలిపారు.బలహీనవర్గాల పిల్లలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠశాలల్లో చదివించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే వంద శాసనసభ నియోజకవర్గాల్లో భూమి పూజలు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే మన బిడ్డలు బాగా తింటేనే చదువులపై దృష్టి పెట్టగలుగుతారని ఆలోచించి 40 శాతం డైట్ చార్జీలు 200% కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు.ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 56వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది మరో 30 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువత వారి కాలపై వాళ్లు నిలబడేందుకు రూ.8వేల కోట్లతో ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం అనే పదాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.
సోనియాగాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అడవి బిడ్డల కోసం వారు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇచ్చారు. గిరిజన బిడ్డలు సాగు చేసుకునేందుకు పోతే వారినీ ట్రాక్టర్లు, బుల్డోజర్లతో గత పాలకులు తొక్కించారు, అడ్డం వెళ్లిన గిరిజన మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టిన చరిత్ర గత పాలకులు ది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే గిరిజన బిడ్డలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతికేలా ఇందిరా సౌర గిరిజల వికాసం అనే పథకాన్ని తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలోని గిరిజనుల ఆధీనంలో ఉన్న 6.70 లక్షల ఎకరాల్లో ఉచితంగా బోరు బావులు, సోలార్ పంపు సెట్లు, అవకాడో వంటి మొక్కలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.





