పుట్టిన గడ్డకు విలువియ్యాలి

ప్రవాస తెలంగాణం

మలిదశ తెలంగాణ ఉద్యమసందర్భంగా చాలా భావోద్వేగానికి గురయ్యాను. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అస్తిత్వాన్ని కోల్పోతున్నామన్న అసంతృప్తి వస్తే తప్పకుండా బాధపడతారు.  ప్రతిభాన్వితులైన వాళ్ళని కూడా అణచివేసినప్పుడు తిరుగుబాటు తప్పదని చరిత్ర చెబుతున్నది. ముఖ్యంగా భాషవిషయంలో స్వేచ్ఛను హరిస్తే ఎదురయ్యే హృదయావేదన ఎలా ఉంటుందో నేనూ చవిచూశాను.

ఇండియాకి అమెరికాకి మధ్య చాలా తరుచుగా చేసే ప్రయాణాల వల్ల, ఎక్కువ కాలం అమెరికాలోనే గడుపుతున్నందున ప్రవాస తెలంగాణం శీర్షికలో నేనూ పాలుపంచుకున్నాను. అమెరికా దేశానికి వెళుతున్నప్పటినుంచి కథల్లో అమెరికా జీవనవిధానాన్ని కావాలనే వ్రాసాను. అనుభవంలోకి వచ్చిన ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలన చేయడం అలవాటై, అమెరికా ప్రజలు కూడా ఎంత సామాజిక బాధ్యతతో ఉంటారో తెలియజేయాలనే కథలు రాసాను. మనం పుట్టిన, నివసిస్తున్న ప్రాంతానికి, వేరే ప్రాంతానికి మధ్యనుండే తేడా ఏమిటో చెప్తూ, అక్కడి మంచిని అర్థం చేయించడమన్న ఆలోచన. ఉంటుంది నాకు.

అమెరికా దేశపు జీవనవిధానం నుంచి మనం గ్రహించగలిగేవి నా రచనల్లో ఉంటాయి. ‘అమెరికాలో ఆరునెలలు’ (2008) ట్రావెలాగ్ లో ఇలాంటివే స్పృశించాను. బాధ్యతకు బంధాలకు మధ్య స్త్రీలు పడే ఆందోళనలను వివరిస్తూనే రెండుదేశాల సంస్కృతీ సంప్రదాయాల సమన్వయం చేసాను.

‘నానీలే నానీలైన వేళ’, ‘ట్రాష్ డే’, ‘కథకాని కథ’, ‘మనసు’, కథల్లో అమెరికాకు మనకు ఉన్న సామ్యాలూ, భేదాలు రాసాను. ఇవి ‘రాచిప్ప’ కథాసంపుటిలోనివి. ‘స్వేచ్ఛా పంజరం’, ‘ఆకాశం అంచుల్లో’, ‘ప్రయాణంలో పదనిసలు’ వంటి కథలు ‘ఘర్షణ’ కథా సంపుటిలోనివి. ‘నిశ్శబ్ద తరంగాలు’ వంటివి రాబోయే కథాసంపుటివి. ‘సలామ్ సియాటిల్’, ‘పసిఫిక్ తీర కెరటం’, ‘పరివేదన’, ‘దోమలు’ వంటి కవితలూ  రాసాను.

TAANA, AATA, NAATA, WATS, WTC వాళ్ళ సదస్సులల్లోనూ, అంతర్జాల సమావేశాల్లోనూ పాల్గొన్నాను.  ‘తెలంగాణ కవయిత్రులు కవిత్వం’, ‘ఈ దశాబ్ది స్త్రీ  సాహిత్యం’, ‘అమెరికాలో తెలుగుభాష సుస్థిర ప్రగతి’ వంటి అంశాలపై ఉపన్యసించాను. ఈ వ్యాసాలన్నీ చాలా సంకలనాల్లో వచ్చాయి. తెలుగు భాషా సాహిత్యాల పట్ల గౌరవాన్ని, ఇష్టాన్ని అమెరికా ప్రతి సభలో చూస్తాం. ఫర్టైల్ ల్యాండ్స్, సారవంతమైన భూములు ఎక్కడెక్కడుంటే అక్కడికి వెళ్లి ‘పోడు’ వ్యవసాయం చేస్తూ, తాత్కాలిక నివాసాలు ఏర్పరుచుకుంటూ జీవించేవాళ్ళు ఆది నుంచి మానవులు. నోమాడ్స్, nomads, సంచారులు అంటాం. భవిష్యత్తులో తెలుగు సాహిత్యం కోసం మన కవులు అట్లా వస్తారేమోనని అనిపిస్తున్నన్నంతగా ఇక్కడే స్థిరపడుతున్నవాళ్ళు పిల్లలకు తెలుగు భాషా సాహిత్యాలు నేర్పిస్తున్నారు. లోతైన దృష్టితో చదివించడమన్నమాట. కానీ, మా తరంవాళ్ళ హృదయాల్లో వలస పక్షుల్లా ‘మాతృదేశము మాతృదేశమే’ అనే భావనే నిలిచిపోయిందనుకుంటున్నాను.

మలిదశ తెలంగాణ ఉద్యమసందర్భంగా చాలా భావోద్వేగానికి గురయ్యాను. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అస్తిత్వాన్ని కోల్పోతున్నామన్న అసంతృప్తి వస్తే తప్పకుండా బాధపడతారు.  ప్రతిభాన్వితులైన వాళ్ళని కూడా అణచివేసినప్పుడు తిరుగుబాటు తప్పదని చరిత్ర చెబుతున్నది. ముఖ్యంగా భాషవిషయంలో స్వేచ్ఛను హరిస్తే ఎదురయ్యే హృదయావేదన ఎలా ఉంటుందో నేనూ చవిచూశాను.

‘వర్ణమాల వగరుస్తుందా?’, ‘గోముఖవ్యాఘ్రాలు’, ‘ఆకురాయి పట్టు’, ‘బతుకమ్మ కుంట’, ‘నయమైంది’, ‘నవ నిరసనోపాఖ్యానం’ ‘గొంగట్ల మెతుకులు’ వంటివి ఉద్యమస్ఫూర్తితో రాసిన కవితలు. మానవీయ కోణంతో చూడక వివక్ష కనబరిచినవాటిపై కలం ఝళిపించాను. ‘విస్మృతి’, ‘జాంబవపురాణం’. ‘ఎక్కాబుడ్డి’, ‘తెలంగాణ’, ‘తెలంగాణ హరితహారం (పాట)’, ‘ఉస్మానియా నెమలీక’ వంటివి రాష్ట్ర సాధనానంతర కవితలు. తెలంగాణ సాహిత్య చరిత్ర, సంస్కృతి సంప్రదాయాల విలువలకు విపరీతంగా పరితపించి వ్యాసాలెన్నో రచించాను, ఉపన్యాసాలలో స్పందించాను. కథల్లో తెలంగాణ భాషా ప్రయోగం ఎక్కువ చేశాను. ‘మనసు పరిమళించిన వేళ’, ‘మృత్యుంజయుడు’, ‘సత్యం చర’, ‘మట్టి పూలు- మంచి వాసనలు’, ‘రాచిప్ప’ కథలలో తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను మీరు గమనించవచ్చు. అలాగే, ‘పాలాల్ల’, ‘కన్నీటి మడుగు’, ‘తొక్కులాట’, ‘ఎర్రజీరలు’, ‘ఒంటరి మేఘం’, ‘దండన, ‘ఘర్షణ’ వంటి కథలలో తెలంగాణ సామాజిక జీవనాన్ని చిత్రిస్తూ, ఇక్కడి విప్లవ భావాలు, శ్రామిక వర్గ, మధ్యతరగతి జీవన విధానాలు, గ్రామీణ నేపథ్య విశేషాలను చిత్రించే ప్రయత్నం చేసాను.

సమకాలీన తెలంగాణ జీవన అనుభవాలను తెలిపే అంశాలకి నా రచనల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. భాషాపరంగా స్థానికతని దృష్టిలో పెట్టుకోవడం వల్ల తెలంగాణ మాండలికాలు, నుడికారాలు, పలుకుబడులు నా కథలలోకి వచ్చి చేరాయి. నూతన చైతన్యంతో ఆలోచించి అనుసరించాల్సిన సంప్రదాయాలు వంటి విషయాలెన్నో ప్రోది చేస్తూ రాసిన కథలున్నాయి. కథా శిల్పానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో వస్తువుకు అంతే ప్రాముఖ్యత ఉంటుందన్న నా అభిప్రాయాన్ని వైవిధ్యమైన రీతుల్లో వ్యక్తం చేశాను.

వ్యాసాలైతే విరివిగా రాశాను. తెలంగాణ ప్రాచీన ఆధునిక సాహిత్య విషయాలు, వ్యక్తులు వ్యక్తిత్వాలు, సాంస్కృతిక విశేషాలపైనా ఎన్నో వ్యాసాలు నా ‘వ్యావహారిక’, ‘సృజన రంజని’, ‘అనివార్యం’, వ్యాస సంపుటాలలో చూడవచ్చు. ‘తెలంగాణ స్త్రీల సాహిత్యం’ అనే సాహిత్య విమర్శాగ్రంథం కూడా రాశాను అది ముద్రణలో ఉన్నది, త్వరలో రాబోతున్నది.

‘మయూఖ’ తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రికను నడపుతూ తెలంగాణ సాహిత్యానికి ప్రాముఖ్యతనిస్తున్నాను. “వలస విధానపు వరమేర యిది/ తెల్లోడుపెట్టిన తెగులేర యిది/ నల్లోడు నేడు నడుపుతున్నాడు/ దోపిడీవర్గాల దాపునున్నాడు” అంటూ మాబాపు పెండ్యాల రాఘవరావు రాసిన కవిత స్ఫూర్తి. ప్రతిభ ఎక్కడ ఉన్నా ఒప్పుకోవాలి. అలాంటప్పుడు కేవలం ప్రాంతీయ తత్వానికే మొగ్గు చూపకూడదు. విశాల దృక్పథంతోనున్నా పుట్టినగడ్డకు విలువియ్యాలి. ఎంత భావోద్వేగమున్నా, ఇవన్ని నేను ‘నిత్య విద్యార్థిని’ అని ఒప్పుకుంటూనే చెబుతున్నాను. దీనికంతటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆలంబననే కారణం.

-కొండపల్లి నీహారిణి

*********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *