-ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డాం
– అర్థాంతరంగా సైనికచర్య ఎందుకు ఆపేశారు?
-ధైర్యమున్న నాయకుడే యుద్ధాన్ని నడిపిస్తాడు
– బాచుపల్లి జైహింద్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలుపుకునేందుకు పాక్ పై యుద్ధం చేయాలని, రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏఐసీసీ ఆదేశం మేరకు గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాచుపల్లిలో జైహింద్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వి.ఎన్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పహల్గామ్ లో భారతీయుల గుండెల్లో తూటాలు దించిన ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండొద్దని ఆనాడు నెక్లెస్ రోడ్ వేదికగా నినదించాం. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు చోటు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ పటంలో పాకిస్థాన్ కనిపించొద్దని, ఇందుకు ప్రధానికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన సంగతి ఆయన గుర్తు చేశారు.
అఖిలపక్ష భేటీకి హాజరై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే స్పష్టంగా కేంద్రానికి మద్దతు పలికారు. కానీ నాలుగు రోజుల యుద్ధం తరువాత ఏం జరిగిందో గానీ అర్ధాంతరంగా మోదీ ప్రభుత్వం యుద్ధాన్ని ముగించింది. యుద్ధ విరమణ చేసే ముందు ఎందుకు అఖిలపక్షం అభిప్రాయం తీసుకోలేదని ప్రశ్నించారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధ తంత్రాన్ని నడిపించగలడన్నారు. మన ఆర్మీ జవాన్ కల్నల్ సంతోష్ ను చైనా పొట్టన పెట్టుకుంటే మోదీ కనీసం చైనాకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేయలేదు. 1971 లో భారత్- పాక్ యుద్ధ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం అవసరం లేదని నిర్మొహమాటంగా చెప్పిన ధీశాలి ఇందిరమ్మ. ఆనాటి యుద్ధంలో ఇందిరమ్మ పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసి చూపారు.
ఇందిరమ్మ స్ఫూర్తితో పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయాలని, ఇందుకు మద్దతుగా ఉంటామని తాను ప్రకటించానని చెప్పారు. దేశ ప్రజలు వీరతిలకం దిద్ది యుద్ధం చేయమంటే ట్రంప్ చెప్పాడని మోదీ యుద్ధం విరమించారు. మరి ఇవాళ దేనికోసం బీజేపీ నేతలు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. యుద్ధం మీ సొంత వ్యవహారం కాదు, దేశ భద్రత అంశం. మోదీ ప్రభుత్వం దేశ భద్రతను ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని బీజేపీ దెబ్బతీస్తే, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కాంగ్రెస్ జైహింద్ యాత్ర చేపట్టిందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, గాంధీ కుటుంబానిది మోదీ కాలం చెల్లిన నాణెం లాంటి వారన్నారు. దేశానికి రాహుల్ గాంధీ లాంటి నాయకుడు కావాలి. రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా చూసే వరకు మనం విశ్రమించొద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.



