అంబేడ్కర్ స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నాం..

ఆయన గౌరవార్థం బిజెపి ఆధ్వర్యంలో పంచతీర్థాల అభివృద్ధి
కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్ కు వేధింపులు
తన జీవితాంతం కాంగ్రెస్ తోనే పోరాటం చేశారు.
కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13:  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళుతోందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్బంగా ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్ జీవీకే సర్కిల్ లోని అంబేడ్కర్ విగ్రహం తో పాటు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండిలోని అంబేడ్కర్ విగ్రహాన్ని కిషన్ రెడ్డి శుభ్రం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కృషిని, వారసత్వాన్ని గౌరవిస్తూ పలు కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు.

అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో పెట్టారని గుర్తు చేశారు. అంబేడ్కర్ జీవితానికి సంబంధించిన 5 ముఖ్యమైన ప్రదేశాలను బిజెపి ప్రభుత్వం ‘పంచతీర్థాలు’ అని పిలుస్తోందని, వాటిని చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలుగా తీర్చిదిద్దింది. దేశ ప్రజలంతా ఆ ప్రాంతాలను సందర్శించి నివాళులర్పించే విధంగా అభివృద్ధి చేశారు. జన్మభూమి (మవు, మధ్యప్రదేశ్): అంబేద్కర్ జన్మస్థలం, స్మారక చిహ్నంగా అభివృద్ధి చేశారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాలను శుభ్రం చేని అలంకరణ చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.

జయంతి ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహించుకునేలా అనేక ఏర్పాట్లు చేస్తున్నాన్నారు. అంబేడ్కర్ తన జీవితాంతం కాంగ్రెస్ తో పోరాటం చేశారు. అంబేద్కర్ ని ఎన్నికల్లో ఓడించేందుకు నెహ్రూ సైతం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ తర్వాత రాజకీయాల్లోకి వొచ్చిన అనేకమంది విగ్రహాలను పార్లమెంటులో పెట్టారు. కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వలేదు.

భారత రాజ్యాంగం రూపకల్పన చేసి, సామాజిక న్యాయ సంస్కరణలకు డాక్టర్ అంబేడ్కర్ అసమానమైన కృషి చేసినప్పటికీ, కాంగ్రెస్ ఆయనకు దక్కాల్సిన గుర్తింపును ఇవ్వలేదు. అంబేద్కర్ పట్ల కక్షసాధింపు చర్యలతో ఆయన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ వేధించింది. నరేంద్ర మోదీ నేతృత్వంలో అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఆ మహనీయుడి ఆశయ సాధన కోసం బిజెపి పునరంకితమై పనిచేస్తుంది. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పండుగ వాతావరణంలో విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *