తెలుగు రాష్ట్రాల జల వివాదాల్లో సామరస్యం హుళక్కే?

“తొలి నుండి కూడా రేవంత్ రెడ్డి ప్రకటనలు శూల శోధన గావించితే ఒక్కోసమయంలో ఒక్కో రకంగా మాట్లాడటం గమనించగలం. సామరస్యం అన్న తరువాత అంతా ఏక పక్షంగా వుండదు కదా? ఇచ్చి పుచ్చుకోవడంగా వుండాలి? ఇవన్నీ ఆలోచించకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామరస్యం ప్రతిపాదన చేశారా? ఈ పాటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. నదీ జలాల వివాదాంశాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల స్థాయిలోనే కాకుండా ప్రజల్లో కూడా భావోద్వేగాలు రెచ్చగొట్టారు. ప్రధానంగా గోదావరి వరద జలాలు అపురూపమైన బంగారు ద్రవం చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సామరస్యం ప్రతిపాదన సాధ్యమేనా?..”

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన అంతర్ రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించుకునేందుకు జరిగే ప్రయత్నాల తీరుపై తెలంగాణలో మాత్రమే అధికార ప్రతి పక్షాల మధ్య రగడ కొనసాగుతుండగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా మొదలైంది. ఇది నూతన పరిణామం. ఇరువురు ముఖ్యమంత్రులు పలు వేదికలపై కలుసుకున్నప్పుడు వీరి మధ్య ఏలాంటి చర్చలు పరస్పరం హామీలు నెల కొన్నాయో ఏమో గాని తన అభ్యర్థనపై రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం నిలుపుదల చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు తెలంగాణ శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయగానే ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంపై ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ముప్పేట దాడి మొదలైంది. ప్రధాన ప్రతి పక్షం వైసిపి నే కాకుండా వామపక్షాలు ఇతర ప్రజా సంఘాలు కూడా ముఖ్యమంత్రి తెలంగాణకు ఏలా హామీ ఇస్తారని నిలదీస్తున్నాయి.

ఆ సమయంలో చంద్రబాబు నాయుడు విదేశాల పర్యటన నుండి వచ్చారు. రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై ఇంత వరకు ముఖ్యమంత్రి మాత్రం స్పందించ లేదు.ప్రధాన ప్రతి పక్షం వైసిపి తెలుగు దేశం నేతల మధ్య మాత్రం ఇప్పటికీ పెద్ద వాగ్వాదమే కొన సాగుతోంది. వాస్తవంలో రాయలసీమ ఎత్తిపోతలు పథకం పెద్ద ప్రయోజనకారి కాకున్నా పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నిర్మాణం నిలిచి పోయినా రాజకీయ రంగు పులుము కోవడంతో రాయలసీమలో భావోద్వేగ అంశమైంది. ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. అయితే తెలుగు దేశం పార్టీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రకటనను పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డిపై ఎదురు దాడి తీవ్ర తరం చేస్తోంది. తెలుగు దేశం వైసిపి పార్టీల మధ్య ప్రకటనల యుద్ధం సాగుతోంది. ఇతర ప్రతి పక్షాలు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు విప్పాలని డిమాండ్ చేస్తూనే వున్నాయి. ఇంతవరకు తెలంగాణలో అధికార ప్రతి పక్షాలు మధ్య రగులుతుండిన చిచ్చు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు వ్యాపించింది.

ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే సామరస్యం గురించి ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని బజార్ కెక్కించడంతో వాస్తవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరుకున పడ్డారు. విషాదమేమంటే తన ప్రకటనతో ఆంధ్ర ప్రదేశ్ లో చిచ్చు రగిల్చిన రేవంత్ రెడ్డి అదే సమయంలో కోర్టులు వద్దు మనమే సంప్రదింపులతో జల వివాదాలు పరిష్కారం చేసుకుందామనే పిలుపు ఇవ్వడం ఆశ్చర్యకరమే. తన ప్రకటనతో ఆంధ్ర ప్రదేశ్ లో చిచ్చు పెట్టిన పూర్వరంగంలో సామరస్యం గురించి ప్రకటన చేయడంలోని ఆంతర్యం రేవంత్ రెడ్డికే ఎరుక? సంప్రదింపులు ఏలా సాధ్యమౌతుంది? చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించ దలచి వుంటే నల్లమల సాగర్ అనుసంధానానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి వుండ కూడదు.

పూర్వాశ్రమంలో చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డికి వున్న సాన్నిహిత్యాన్ని బిఆర్ఎస్ పార్టీ నేతలు చిలవలు పలవులు చేసి ఎదురు దాడి చేస్తుండగా ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో ఒప్పందాలు ఏలా సాధ్యం? పాలమూరు రంగారెడ్డి డిండి కల్వకుర్తి నెట్టెంపాడు పథకాల డిపిఆర్ ఆమోదంలో అడ్డు చెప్ప వద్దని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడును కోరారు. ఒక పక్క ట్రిబ్యునల్ విచారణ జరుగుతుండగా నికర జలాలు కేటాయింపులు లేకుండా ప్రాజెక్టుల డిపిఆర్ లు కేంద్ర జల సంఘం ఆమోదించే వీలు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదని భావించ లేము. ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపాదించిన నల్లమల సాగర్ అనుసంధానానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకెక్కిన పూర్వ రంగంలో సామరస్య చర్చలకు అవకాశముంటుందా? నల్లమల సాగర్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో జరిగిన విచారణ కు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కావడం దేనికి సంకేతం?

ఒక వేళ తను ప్రతి పాదించినట్లు కృష్ణ జలాల అంశంలో ఆంధ్ర ప్రదేశ్ అడ్డు చెప్పకుండా అదే సమయంలో గోదావరి వరద జలాలు ఉపయోగించుకొని నల్లమల సాగర్ అనుసంధానానికి తలపడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలుపుతారా? ఇందుకు బిఆర్ఎస్ పార్టీ నుండి వచ్చే ఎదురు డాడి ఏలా ఎదుర్కోగలరు?ఆంధ్ర ప్రదేశ్ కు అనుకూలంగానే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసి అంతిమంగా వెనక్కి తీసుకున్నారని అప్పుడే బిఆర్ఎస్ నేత హరీష్ రావు అప్పుడే విమర్శనాస్త్రం సంధించారు. వరద జలాలు పేరు చెప్పి గోదావరి జలాలు ఆంధ్ర ప్రదేశ్ దోపిడీకి తలపడుతోందనే ప్రచారం తెలంగాణ ప్రజల్లోనికి ఈ పాటికే బాగా చొప్పించారు. తొలి నుండి కూడా రేవంత్ రెడ్డి ప్రకటనలు శూల శోధన గావించితే ఒక్కోసమయంలో ఒక్కో రకంగా మాట్లాడటం గమనించగలం. సామరస్యం అన్న తరువాత అంతా ఏక పక్షంగా వుండదు కదా? ఇచ్చి పుచ్చుకోవడంగా వుండాలి? ఇవన్నీ ఆలోచించకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామరస్యం ప్రతిపాదన చేశారా? ఈ పాటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. నదీ జలాల వివాదాంశాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల స్థాయిలోనే కాకుండా ప్రజల్లో కూడా భావోద్వేగాలు రెచ్చగొట్టారు. ప్రధానంగా గోదావరి వరద జలాలు అపురూపమైన బంగారు ద్రవం చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సామరస్యం ప్రతిపాదన సాధ్యమేనా?

దీనికితోడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నల్లమల సాగర్ అనుసంధానానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు లో వేసిన రిట్ పిటిషన్ వెనక్కి వచ్చిన తర్వాత కోర్టు సూచన మేరకు సివిల్ సూట్ వేయనున్నట్లు ఢిల్లీ లో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఇరువురు ముఖ్యమంత్రులు ముఖాముఖిగా సంప్రదింపులు సాగించే వాతావరణం ఎక్కడ వుంది.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *