– అలాంటి వాటిని వెంటనే సరెండర్ చేయాలి
– లేకుంటే చర్యలు తప్పవన్న ఎన్నికల సంఘం
న్యూదిల్లీ,సెప్టెంబర్ 4: వోటరు కార్డులకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఒకటికి మించి కార్డులు కలిగి ఉండటం నేరమని ఎన్నికల సంఘం పేర్కొంది. ఒకవేళ రెండు, అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఒకదాన్ని మాత్రమే పెట్టుకొని అదనపు కార్డులను సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. అలా చేయకపోవడం తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. రెండు వోటరు కార్డులను కలిగి ఉంటే ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం నేరం. సెక్షన్ 31 కింద వారికి గరిష్ఠంగా ఏడాది శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉండొచ్చు. ఒకవేళ ఎవరి వద్దనైనా రెండు, అంతకంటే ఎక్కువ కార్డులు ఉంటే ఒకటి మాత్రమే తమ వద్ద ఉంచుకోవాలని ఈసీ అధికారులు వెల్లడించారు. వోటరు జాబితాలో రెండుచోట్ల వొటరుగా ఉన్నట్లయితే ఒకచోట తమ పేరును తొలగించాలని కోరుతూ ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లోనూ వెసులుబాటు ఉందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ మీడియా పబ్లిసిటీ సెల్ ఛైర్మన్ పవన్ ఖేడాకు రెండు వోటరు కార్డులున్నాయనే ఫిర్యాదు రావడంతో ఎన్నికల సంఘం ఆయనకు ఇటీవల నోటీసు జారీ చేసింది. దీనిపై ఖేడా స్పందిస్తూ.ఎన్నికల అధికారుల తీరును తప్పుపట్టారు. డిలీట్ చేయాలని గతంలోనే దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఈసీ నిర్లక్ష్యంగా వ్యవహరించి వోటరు జాబితా నుంచి తన పేరు తొలగించలేదన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





