“ఒక వైపు భవన నిర్మాణ రంగంలో విజయకేతనాన్ని ఎగరవేస్తూనే మరోవైపు విఠల్ సాయన్న సామాజిక సేవలో కూడా నిమగమై ఉండేవారు. ప్రధానంగా విఠల్ సాయన్న ధార్మిక భావాలు కలిగినవారు. ఆధ్యాత్మిక రంగం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. పలు దేవాలయాలకు, దైవకార్యాలకు ఆయన విరాళాలు అందించారు. ముఖ్యంగా తెలుగు సామాజిక రంగంలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. తెలుగు వారికి ఎంతో అండదండగా నిలిచేవారు. కష్టాలంటే ఏమిటో తెలిసినవాడు గనక ఎందరో ఆపన్నులను ఆదుకున్నాడు.”
ఎక్కడ, ఏ కులంలో పుట్టామన్నది కాదు… జీవితంలోని ఒడిదుడుకుల్ని ఎదుర్కొని, ఆకలితో అలమటిస్తూ, కష్టనష్టాలతో పోరాడి విజేతగా నిలవడమే ప్రధానం. వలసంటేనే అంతులేని వ్యథ.. అందులో భరించలేని పేదరికం అతిపెద్ద శాపం. కానీ, ఆ వ్యథల్నుండి, పేదరికపు గ్రహణాలను చీల్చుకొని కోటికాంతులతో ఉదయించే సూర్యుడిలాంటి విజేతలే నేటికీ, ఏనాటికీ, తరతరాలకి ఆదర్శంగా నిలుస్తారు. అలా నిలిచిన వాడే.. విఠల్ సాయన్న..
ముంబయిలో, అత్యంత నిరుపేదలు నివసించే లోయర్ కొలాబాలో, ఒక యాదవ కుటుంబంలో, 14 జనవరి, 1866లో విఠల్ సాయన్న జన్మించారు. తినడానికి బుక్కెడు బువ్వ కూడా సరిగ్గా లభించని ఇంట్లో చదువు సంధ్యలు ఎంత కాలం సాగుతాయి..? అందుకే 15 ఏండ్ల వయసులోనే విఠల్ అప్పటికే ముంబయిలో ప్రసిద్ధి పొందిన తెలుగు భవన నిర్మాత నాగూ సయాజి వద్ద కూలీగా చేరాడు. రోజుకు ఒక రూపాయి జీతంతో రాళ్ళు కొట్టేవాడు. రాళ్ళు కొట్టిన చేతులు రాటు తేలాయి. వాటితో పాటు విఠల్ కళ్ళలో భవిష్యత్తు గురించి బంగారు కలలు కూడా బలపడ్డాయి. జీవితంలో ఏదో సాధించాలనీ, పరిస్థితుల్లో మార్పు తెచ్చుకోవడం తన పనేననీ గ్రహించిన విఠల్ తనను తాను పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోకుండా, ఏటికి ఎదురీదేందుకు సాహసించారు. ఆ సాహసమే అతడిని రాళ్ళు కొట్టే కుర్రాడి నుండి, మేస్త్రీదాకా తీసుకెళ్ళింది.
మేస్త్రీ పనిలో విఠల్ ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. అంతటితో ఆయన ఆగిపోలేదు. అప్పట్లో ముంబయిలో చాలా మంది భవన నిర్మాతలు తెలుగువారు కావడం వల్ల విఠల్ కూడా భవన నిర్మాణ కాంట్రాక్ట్‌దారుడు కావాలని బలంగా నిర్ణయించుకున్నారు. పట్టుదల, చిత్తశుద్ధి, లక్ష్యసాధన ఉంటే ఎలాంటి గమ్యాలైన అందుకోవచ్చని నిరూపించారు విఠల్. భవన నిర్మాణ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు.
ఆయన నిర్మించిన భవనాలెన్నో నేడు పర్యాటక స్థలాలుగా మారి కోట్లమంది ప్రజల మన్ననలు పొందుతున్నాయి. ముఖ్యంగా జనరల్ పోస్ట్ ఆఫీస్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం భవనాలు ఇప్పటి తరాన్ని కూడా అబ్బురపరుస్తున్నాయి. ఇండో సారాసెనిక్ పద్దతిలో భవనాలు నిర్మించడం ఈ భవనాలతోనే ప్రారంభమయ్యాయని చెప్పుకుంటారు. జనరల్ పోస్టాఫీస్ భవనాన్ని జాన్ బేగ్ అనే ప్రముఖ ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు. ఆ డిజైన్‌కు తగ్గట్టే భవన నిర్మాణంలో నల్లటి లావా రాళ్ళను వినియోగించారు. డిజైన్ కోసం అవసరమైన పసుపు రంగు రాళ్ళను కుర్లాహిల్ నుండి సేకరించారు. తెలుపు రాళ్ళను గుజరాత్‌కు చెందిన ధాంగాద్ర నుండి తెప్పించారు. ఆనాటి ఆ నిర్మాణ శైలి ఇప్పటికీ భవ్యంగా, దివ్యంగా, వైభవంగా అలరారుతున్నది. అదీ విశేషం.
ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం భవనం శిల్పకళా రీతులకు పెట్టిందిపేరుగా నిలిచి ఉన్నది. మిస్టర్ విటెట్ డిజైన్ చేసిన ఈ భవనాన్ని విఠల్ అప్పట్లో నాలుగు లక్షల వ్యయంతో నిర్మించారు. విఠల్ సౌందర్యదృష్టికి ఈ భవనం ప్రతీకగా పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఈ మ్యూజియం భవనానికి సమీపంలోని రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భవనాన్ని కూడా విఠల్ సాయన్ననే నిర్మించారు. ఈ విషయంలో మిస్టర్ విటెట్ ఒక మాట అన్నారు. ‘డిజైన్ తయారు చేసింది తానే అయినా, విఠల్ సాయన్నలో ఉన్న శిల్పకళా సౌందర్య దృష్టి ఈ భవనానికి కొత్త భవ్యతను తెచ్చిపెట్టింది’ అన్నారు. వారిద్దరి అనుబంధం చాలా కాలం కొనసాగింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సర్ కావస్‌జీ జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ, స్మాల్ కాజ్ కోర్టు, కొలాబా మిలిటరీ క్వార్టర్స్, బుచర్ ఐల్యాండ్ బ్యాటరీ స్టేషన్, ఖోపోలిలోని టాటా అండ్ సన్స్ పవర్ హౌజ్, ఠాణేలో పురాతన కల్వా బ్రిడ్జి, మస్జీద్ బందర్‌లోని ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ భవనం లాంటి ఎన్నో చారిత్రక భవనాలు విఠల్ సాయన్న నిర్మించినవే అని తెలుసుకున్నప్పుడు తెలుగువారు గర్వంగా పొంగిపోతారు.
ఒక వైపు భవన నిర్మాణ రంగంలో విజయకేతనాన్ని ఎగరవేస్తూనే మరోవైపు విఠల్ సాయన్న సామాజిక సేవలో కూడా నిమగమై ఉండేవారు. ప్రధానంగా విఠల్ సాయన్న ధార్మిక భావాలు కలిగినవారు. ఆధ్యాత్మిక రంగం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. పలు దేవాలయాలకు, దైవకార్యాలకు ఆయన విరాళాలు అందించారు. ముఖ్యంగా తెలుగు సామాజిక రంగంలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. తెలుగు వారికి ఎంతో అండదండగా నిలిచేవారు. కష్టాలంటే ఏమిటో తెలిసినవాడు గనక ఎందరో ఆపన్నులను ఆదుకున్నాడు. 1893లో హిందూ ముస్లిం అల్లర్ల సమయంలో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు, 1896లో ముంబైలో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు బాధితులకు విఠల్ సాయన్న ఎంతో అండగా నిలిచాడు. తన సంపాదనలో ఎక్కువ భాగం సమాజసేవకే వినియోగించేవాడు. ఇతడి సేవల్ని గుర్తించి ప్రభుత్వం పౌరసన్మానం చేయాలనుకున్నప్పుడు ఎంతో సున్నితంగా దాన్ని తిరస్కరించాడు.
దైవభక్తి కారణంగా, ఆయన ఆధ్యాత్మిక గురువు ఆదేశంతో, 1912 లో ముంబయికి 30 మైళ్ళ దూరంలో ఉండే ఠాణే నగరంలో భవ్యమైన ‘దత్త మందిరాన్ని’ నిర్మించి, ప్రజలకు అంకితం చేశారు. ఠాణే ప్రాంతంలో కూడా ఆయన కుల, మత, ప్రాంత, భాషాలకు అతీతంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. ఆనాడు ఆయన నిర్మించిన ‘దత్త మందిరం’ నేటికీ ‘విఠల్ సాయన్న దత్త మందిరం’ పేరుతో పూజలందుకుంటోంది. ఆయన నిర్మించిన దత్త మందిరాన్ని, శిరిడి సాయిబాబా, సంత్ గాడ్గే మహారాజ్, బాల గంధర్వుడు లాంటి మహనీయులెందరో సందర్శించారు. ఆ మందిరం ప్రక్కనే విఠల్ సాయన్న నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంతేగాక, ఠాణేలోని జనరల్ హాస్పిటల్‌కు స్థలాన్ని విరాళంగా ఇవ్వడమే కాకుండా నిర్మాణ బాధ్యతల్ని కూడా విఠల్ సాయన్ననే తీసుకున్నారు.
పేద ప్రజలకు సంజీవనిగా వెలుగుతున్న జనరల్ హాస్పిటల్ ప్రాంగణం లో కూడా విఠల్ సాయన్న విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి రోజూ ఆ హాస్పిటల్‌కు వచ్చే వేలాది మంది జనం, ముందుగా విఠల్ సాయన్న విగ్రహానికి మొక్కుకొని హాస్పిటల్‌లోకి వెళ్తారు. రోగాల్ని నయం చేసుకొని వెళ్ళేవారు కూడా ఒక క్షణం విఠల్ సాయన్న విగ్రహం ముందు భక్తి శ్రద్ధలతో నిలిచి కృతజ్ఞతలు తెలుపుకోవడం నేటికీ జరుగుతోంది. ఒక తెలుగు వ్యక్తిని దేవుడిగా భావించి ఈ మరాఠీ గడ్డ మీద విగ్రహాలు ప్రతిష్టించడమంటే అంతకన్న గర్వకారణం మనకేముంటుంది..? పేదరికం నుండి పొడుచుకొచ్చిన పోరాట వీరుడు విఠల్ సాయన్న నేటి తరానికి ఆదర్శప్రాయుడని చెప్పడం అతిశయోక్తి ఏమాత్రం కాదు. ధర్మదాత గా, ప్రజాసేవకుడిగా పేరు పొందిన విఠల్ సాయన్న 9 ఫిబ్రవరి, 1932 నాడు అనంతలోకాలకు పయనమైవెళ్ళిపోయారు.





