విమర్ష .. సద్విమర్ష

రాష్ట్రంలోని రాజకీయపార్టీల మద్య నిత్యం జరుగుతున్న పరస్పర విమర్శలను చూస్తుంటే ఇందులో సద్విమర్షకులెవరన్న విషయాన్ని ప్రజలు బేరీజు వేసుకోలేక పోతున్నారు. తాము చేస్తున్న ఆరోపణలు ఎదుటివారిని లేదా వారి కుటుంబ సభ్యులను బాదిస్తాయన్న కనీస ఆలోచనకుకూడా వారు స్వస్తి చెబుతున్నట్లు కనిపిస్తున్నది.  విమర్షలు కేవలం రాజకీయాలవరకే పరిమితమవ కుండా హద్దు మీరుతున్నాయి. ఫలితంగా పరస్పర వ్యక్తిగత దూషణలకు దారితీస్తున్నాయి. ఒకరిని తక్కువ చేసి చూపించేందుకు నిరంతరం విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకోవాడాన్ని సమాజం ఏవిధంగా అన్వయించు కుంటుందన్నది ఆలోచించుకోవాల్సి ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలకాలంలో రాజకీయపార్టీల మద్య జరుగుతున్న పరస్పర విమర్శలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. రానురాను పక్కనున్న దాయాది రాష్ట్రంలోని రాజకీయ నాయకులతో పోటీపడుతున్నట్లు కనిపిస్తున్నాయి.

ఒక మనిషీ లేదా ఒక ప్రాంత పురోభివృద్దికి సద్విమర్ష అవసరమన్నది ఎవరు కాదనలేని నిజం. ఆలాంటి విమర్శను సహృదయంతో స్వీకరించగలిగినవాడే నిజమైన నాయకుడి లక్షణమంటారు పెద్దలు. మన ప్రధాని నరేంద్రమోదీ కూడా తాజాగా ఇదే అంశాన్ని ఊటంకించడం గమనార్హం. నిర్మాణాత్మక సద్విమర్శ ప్రజాస్వామ్యానికి ఆత్మవంటిదంటారాయన. విమర్శలో నిజాయితీ ఉంటే తాను తప్పనిసరిగా అక్కున చేర్చుకుంటానన్నారు.  ఆమెరికన్‌ ‌పాడ్‌ ‌కాస్టర్‌, ‌కంప్యూటర్‌ ‌శాస్త్రవేత్త లెక్స్ ‌ఫ్రీడమన్‌ ఆదివారం నిర్వహించిన షో లో ఆయన విమర్శ- సద్విమర్శపైన తన మనోభావాలను పంచుకున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్ష తప్పనిసరిగా ఉండాల్సిందేనన్న మోదీ, విమర్శవేరు, ఆరోపణలువేరని విషదీకరించారు. తప్పుడు ఆరోపణలు ప్రజాస్వామ్యానికి హానిచేస్తాయి. సంక్షోభాలకు కారణమవుతాయి. అయితే సద్విమర్శలోకూడా కూలంకష అధ్యయనం, లోతైన పరిశోధన, నిండైన విశ్లేషణ ఉండా లంటారాయన. తలపండిన రాజనీతిజ్ఞుడైన, మంచి తెలివిగలవారైనా ఒక్కోసారి నోరుజారకపోరు. అది సమాజంలో సంచలనాత్మకంగా మారుతుంది.

దానిపైన  మళ్ళీ విమర్శల పరంపర, ఒక్కోసారి రాజకీయ సంక్షోభానికి దారితీసే వరకు వెళుతుంది. అయితే తన తప్పిదాన్ని తెలుసుకుని వెంటనే పశ్చాత్తాపాన్ని వ్యక్తంచేయడంద్వారా సమస్యకు పులిస్టాప్‌ ‌పెట్టేవారు కొందరైతే, తన తప్పును ఒప్పుగా మొండిగా వాదిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా విమర్శల విస్పోటానికి దారితీసేవారు మరికొందరు. తాజాగా కేంద్రంలో, రాష్ట్రంలో ఇలాంటి వాతావరణమే ఇప్పుడు చోటుచేసుకుంది. కేంద్రంలో బిజెపి వర్సెస్‌ ‌కాంగ్రెస్‌, ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌వర్సెస్‌ ‌బిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీల పరస్పర విమర్శలు ఇలాంటి విస్పోటానికి దారితీస్తున్నాయి. సరస్పర విమర్శలను చూస్తుంటే ఎవరివి సద్విమర్షలో తేల్చుకోలేనిస్థితిలో ప్రజలున్నారు. నాయకులు మాట్లాడుతున్న పదాల అర్థాల మూలాలను వెతుక్కోవాల్సి వస్తున్నది. ఎవరు త్యాగధనులు, అసలు త్యాగమంటే ఏమిటి? ఎవరిని జాతిపిత అనాలి, ప్రజలకోసమో, రాష్ట్రంకోసమో తమ జీవితాలను ధారపోసినవారిని ఎలా గుర్తించాలి, వారి వ్యక్తిగత జీవితాలను ఇందులో బేరీజు వేసుకోవాలా వద్దా లాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే విమర్శల్లో భాగంగా అసభ్య పదజాలాన్ని ఎవరు ఎక్కువగా వాడితే వారిమాటలను  సద్విమర్శలుగా పరిగణించాలా వద్దా? ఎలా అర్థం చేసుకోవాలన్న అయోమయంలో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.

image.png
మండువ రవీంర్‌రావు
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *