పేదల హక్కులను దెబ్బతీసేలా వీబీజీ-రామ్ జీ చట్టం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 2: డాక్ట‌ర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింద‌ని, ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి కనీసం వంద రోజుల ఉపాధి కల్పించి, కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం ప్రధాన లక్ష్యమ‌ని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా రాష్ట్రంలో లబ్ధి పొందిన వారిలో సుమారు 90 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నార‌న్నారు. వీరిలో 62 శాతం మహిళలు లబ్ధి పొందారన్నారు. అయితే ప్ర‌స్త‌తం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం పేదల హక్కులను దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు. ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళలు, బలహీన వర్గాల ఉపాధికి హామీ లేకుండా చేస్తోంద‌ని, పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే నిబంధనలు పేదల పాలిట శాపంగా మారనున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆ కారణంగా ఈ సభ కింద తెలిపిన విధంగా తీర్మానిస్తోంద‌ని మంత్రి సీత‌క్క తీర్మానాన్న ప్ర‌వేశ‌పెట్టారు.

తీర్మానంలోని అంశాలు..

1. కొత్త చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉంది. ఉపాధి హామీ చట్టం అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. డిమాండ్ క‌నుగుణంగా పనుల ప్రణాళికను తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది. డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి.
2. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు అమల్లో ఉన్న ఎంజీ న‌రేగాలో దాదాపు 62 శాతం మహిళలు కూలి పొందేవారు. కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత (నార్మేటివ్) కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి. దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు నష్టపోతారు. మహిళా సాధికారత సాధించాలంటే పాత విధానాన్ని పునరుద్ధరించాలి.
3. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పూర్తిగా కేంద్రమే నిధులు కేటాయించేది. కొత్త చట్టం ద్వారా కేంద్ర-రాష్ట్ర నిధుల వాటా 60:40గా మార్చటం సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తుంది. ఇది రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. పాత నిధుల వాటా ప‌ద్ధ‌తిని పునరుద్ధరించాలి.
4. మహాత్మాగాంధీ పేరును ఈ పథకం నుంచి తొలగించటంతో ఆయ‌న స్ఫూర్తిని నీరుగార్చినట్లయింది.
5. వ్యవసాయ సీజన్ లో 60 రోజుల విరామం తప్పనిసరిగా విధించడంతో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది. ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి.
6. ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా 266 రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉంది. కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులు తొల‌గించటంతో చిన్న, సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు నష్టపోతారు. ఇప్పుడున్న పనుల జాబితాను యథాతథంగా అనుమతించాలి.
ఎంజీన‌రేగా చట్టంలో నిర్దేశించిన ఉద్దేశాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని కూలీ కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మహాత్మాగాంధీ న‌రేగా చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఈ సభ తీర్మానిస్తున్న‌ది.

పథకం పై మాట్లాడాల్సి వస్తుందనే బిఆర్ఎస్ వాకౌట్

అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క చిట్ చాట్ మాట్లాడుతూ ఉపాధి హామీ ప‌థ‌కంపై మాట్లాడాల్సి వ‌స్తుంద‌నే బీఆర్ ఎస్ స‌భ నుంచి వాకౌట్ చేసింద‌ని వ్యాఖ్యానించారు. బీజేపీ కి బీఆర్ఎస్ సహ‌కరిస్తున్న‌దనే దానికి ఇదే నిదర్శనమ‌న్నారు. బీజేపీ- బిఆర్ఎస్ ఎజెండా ఓక్కటేన‌ని,
కార్పొరేట్ ల కోసమే అవి పనిచేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. అందుకే ఈరోజు చర్చలో బీఆర్ఎస్ పాల్గొనలేదన్నారు. మోదీ మెప్పు కోసం బీఆర్ ఎస్ పెద్దలు సభను బాయ్‌కాట్ చేశార‌ని విమ‌ర్శించారు. బీఆర్ ఎస్ ది ఫ్యూడల్ మెంటాలిటీ అని, అందుకే ఉపాధి హామీని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసినా టిఆర్ఎస్ సైలెంట్ గా ఉంద‌ని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *