– కాంప్లెక్స్ ఎరువులను పాత విధానంలోనే కొనుక్కోవచ్చు
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: యూరియా పంపిణీ కోసం ప్రత్యేక యాప్ రాబోతోందని, ఇప్పటికే వాట్సప్ ఛానల్ ద్వారా రైతులకు సమాచారం ఇస్తున్నామని, భూమి ఉన్నదాన్ని బట్టి యూరియా సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంతి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మంగళవారం మాట్లాడారు. యూరియా కొనుగోలులో ఈIపాస్ సిస్టమ్ ప్రవేశపెట్టామని, యూరియా పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ ఆలోచన చేశామని తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోనే యాప్ నిర్వహణ ఉంటుందని, ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌ఐసీ సంస్థ దాన్ని తయారు చేసిందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం పదివేల యూరియా పంపిణి కేంద్రాలున్నాయని, వాటిని కూడా పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. యూరియా పంపిణి ఒకేవద్ద కాకుండా వికేంద్రీకరణ చేయాలలని చూస్తున్నామన్నారు.
ఇంటి వద్దనే ఉండి యూరియా బుక్ చేసుకోవచ్చునని, సెల్ నెంబర్, పట్టాదారు పాస్‌బుక్ ఉంటే సరిపోతుందని, రాష్ట్రవ్యాప్తంగా యూరియా నిల్వల గురించి కూడా ఇంట్లో ఉండి చూసుకోవచ్చునని మంత్రి చెప్పారు. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి ఇలా ఏ పంట వేస్తున్నారో దాన్నిబట్టి యూరియా సరఫరా ఉంటుందన్నారు. యూరియా ఎక్కువ కావాలని వేసే పంట కాకుండా మరో పంట అని టిక్ చేస్తే పంట కొనే సమయంలో ఇబ్బంది అవుతదని హెచ్చరించారు. చిన్న, సన్నకారు రైతులకు ఒకే విడతలో యూరియా ఇస్తామని, చిన్న రైతులను ఇబ్బంది పెట్టొద్దనే ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పెద్ద రైతులు ఒకేసారి 20, 30 యూరియా బస్తాలు తీసుకెళ్తే ఇబ్బంది ఉంటదని, వారికీ రెండు మూడు దశల్లో యూరియా ఇస్తామని, నెల రోజుల్లోనే పెద్ద రైతులకు కావాల్సినంత యూరియా మూడు విడతల్లో ఇస్తామని వివరించారు. పట్టాదారు వివరాలు యాప్‌లో ఎంట్రీ చేయగానే ఆయా జిల్లాలకు వెళ్ళిపోతుందని, కౌలు రైతులు కూడా బుక్ చేసుకొని యూరియా తీసుకోవచ్చునని చెప్పారు. ఆధార్, పేరుతోపాటు పట్టాదారు పాస్‌బుక్ ఎంట్రీ చేస్తే చాలు.. ల్యాండ్ ఓనర్‌కు ఓటీపీ వస్తది.. దాన్ని కౌలుదారు తెలుసుకొని ఎంట్రీ చేయాలని సూచించారు. డీలర్లు కూడా బుకింగ్ ఆధారంగానే యూరియా అమ్మకాలు చేపట్టాలన్నారు. డీఏపీ, ఇతర కంప్లెక్స్ ఎరువులు పాత విధానంలో కొనుగోలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. డీలర్‌కు ఎన్ని లారీల లోడు వచ్చాయో యాప్‌లో తెలపాలని, డీలర్ వద్దకు రైతు రాకుండానే యూరియా తీసుకెళ్లొచ్చునని చెప్పారు. బుక్కింగ్ ఐడీలో ఉంటే చాలు 24 గంటలపాటు బుకింగ్ చేసిన ఐడీ పనిచేస్తదన్నారు. ఆ గడువు లోపు రాకుంటే మరోసారి బుక్ చేసుకోవాలన్నారు. రైతులకు అవగాహన లేకుంటే అగ్రి అధికారులను సంప్రదించాలని, మహిళా గ్రూప్‌ల సహాయం కూడా తీసుకుంటామని మంత్రి తుమ్మల చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



